YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుపతి ఎంపీ బరిలో వైసీపీ తరపున సీఎం జగన్ ఫిజియోథెరిపిస్టు?

YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుపతి ఎంపీ బరిలో వైసీపీ తరపున సీఎం జగన్ ఫిజియోథెరిపిస్టు? తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికకు అన్ని పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించారు బల్లి దుర్గా ప్రసాద్‌రావు. అప్పట్లో తన ప్రత్యర్థి పనబాక లక్ష్మీపై సుమారు 2.28 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే కరోనా సోకి బల్లి దుర్గారావు మరణించడంతో తిరుపతి ఎంపీ స్థానానికి మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
సాధారణంగా స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే గానీ మరణించినప్పుడు ఆ ఉప ఎన్నికలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులను నిలబెడతారు. మరో పక్క ఇప్పటికే టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి తరపున తిరుపతి ఎంపీ స్థానానికి పనబాక లక్ష్మీకే తిరిగి టిక్కెట్ అందజేశారు. దీంతో తిరుపతి ఎంపీ స్థానానికి వైసీపీ పార్టీ తరపున ఎవరిని బరిలోకి నిలుపుతారా? అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. మొదట తిరుపతి ఎంపీ టిక్కెట్ దివంగతనేత బల్లి దుర్గాప్రసాద్‌రావు కుటుంబంలో ఆయన కొడుకుకు ఇస్తారని ప్రచారం మొదలైంది. అయితే దుర్గా ప్రసాద్‌రావు కుటుంబానికి రాజకీయంపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఇప్పుడు వైసీపీ కొత్త వ్యక్తి కోసం ఆలోచన చేసింది. పైగా టిడిపి అభ్యర్థిని ముందుగానే తెలపడంతో గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ మళ్లీ పునరాలోచించింది. ఒక్క పక్క అధికార పార్టీ అయిన వైసీపీ తిరుపతిలో బాగా వెనుకబడిందనే వార్తలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినాయకత్వం వెంటనే తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి బల,బలహీనతల గురించి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈ సమావేశంలోనే సీఎం జగన్ ఒక కొత్త వ్యక్తి పేరును తెరమీదకు తీసుకొచ్చారు.
ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఫిజియోథెరిపిస్టు?
వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మకంగా చేపట్టిన పాదయాత్రలో జగన్ వెంటే ఉండే ఫిజియోసేవలు అందించిన గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం జగన్. జగన్ పాదయాత్ర సమయంలో ప్రతిరోజూ తాను బస చేసిన బస్సులో వెన్నంటు ఉండి, జగన్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ నిత్యం ఫిజియోథెరపీ సేవలు గురుమూర్తి అందించారు. ఈ సమయంలోనే సీఎం జగన్‌కు, ఫిజియోథెరఫిస్ట్ గురుమూర్తికి అన్యూన్య బంధం బలపడిందనేది తెలుస్తోంది. అదే విధంగా షర్మిలా పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా గురుమూర్తి ఫిజియోథెరపీ సేవలు అందించారు. షర్మిలా కాలుకు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఆమె ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మొదట తిరుపతి ఎంపీ స్థానానికి ఎవర్ని నిలబెట్టాలా? అని తర్జనబర్జనలు పడుతున్న సమయంలో ఎవరో ఎందుకు తన ఫిజియోథెరఫిస్టు గురుమూర్తిని నిలబెడదాం. అని సీఎం జగన్ ఎమ్మెల్యేలతో అన్నారట. అయితే పార్టీ నాయకులు కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది.
గురుమూర్తిది చిత్తూరు జిల్లా ఏర్పేడు నియోజకవర్గం కావడంతో కలిసి వచ్చిందని అంటున్నారు జిల్లా నాయకులు. గురుమూర్తిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆయన చిత్తశుద్ధేనట. ఎంతో ఓర్పుతో జగన్‌కు చేసిన సేవలే ఈ రోజు గురుమూర్తి కి అదృష్టంలా వరించి ఎంపీ స్థానానికి ఎంపిక కాబడినట్టు నాయకులు చెబుతున్నారు. గతంలో నందిగామ సురేష్‌ను కూడా బాపట్ల నియోజకవర్గానికి ఎంపీగా ఎవరూ ఊహించని విధంగా నిలబెట్టి గెలిపించారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు కొత్త నాయకుడిని తిరుపతి ఎంపీగా ఎంపికచేయడం పట్ల వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
