Ashada Masam 2021: ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయ‌రు? |ఆషాఢ‌ మాసం నెల‌

Ashada Masam 2021: ఆషాఢ‌ మాసం గురించి పెద్ద‌లు మ‌న‌కు చెబుతుంటారు. కొత్త‌గా పెళ్లి అయిన వారు ఈ మాసంలో కొన్ని నిబంధ‌న‌లు, ఆచారాలు పాటించాల్సిన అవ‌స‌రం ఉంది.


Ashada Masam 2021: ఆషాఢం మాసం ప‌ర్వ‌దినాల‌ను తీసుకొస్తుంది. చంద్రుడు ఉత్త‌రాషాఢ న‌క్ష‌త్రం నందు ఉండ‌టం వ‌ల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు. జూలై 10 నుంచి ఈ మాసానికి మ‌న స‌నాత‌న ధ‌ర్మంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఆషాఢ మాసంలో సూర్యుడు క‌ర్కాట‌క రాశిలోకి సంక్ర‌మ‌ణం చేయ‌డం విశేషం. సూర్యుడు క‌ర్కాట‌క రాశి నుంచి ధ‌న‌స్సు రాశి అంత్యం వ‌ర‌కు ఉండే కాలాన్ని ద‌క్షిణాయ‌ణంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంది. ఆషాఢ శుక్ల విదియ నాడు పూరీ జ‌గ‌న్నాధుడు ర‌థోత్సం ప్రారంభ‌మ‌వుతుంది. ఆ రోజున సుభ‌ద్ర బ‌ల‌భ‌ద్రుడితో కూడిన జ‌గ‌న్నాథుడిని ర‌థంపై ఊరేగిస్తున్నారు. తెలంగాణలో బోనాలు కూడా ఈ మాసంలోనే జ‌ర‌గ‌డం మ‌రో విశేషం.

ఈ మాసంలో ఏం చేయాలి?

ఆషాఢ మాసంలో శుక్ల‌ప‌క్ష ఏకాద‌శి..తొలి ఏకాద‌శి. ఈ ఏకాద‌శి హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన‌ది. ఆషాఢ పౌర్ణ‌మిని వ్యాస పౌర్ణ‌మిగా పాటిస్తారు. చాతుర్మాస దీక్ష‌లు ఈ మాసంలోనే ప్రారంభ‌మ‌వుతాయి. శ్రీ మ‌హా విష్ణువు ఆషాఢ మాసంలో శ‌య‌నిస్తాడు. ఆషాడం నుంచి కార్తీక శుద్ధ ఏకాద‌శి వ‌ర‌కు మ‌హా విష్ణువు శ‌య‌నంతో ఈ నాలుగు మాసాల్లో తేజం త‌గ్గ‌డం వ‌ల్ల దీనికి శూన్య మాసం అని పేరు. జ్యోతిష శాస్త్రం ప్ర‌కారం శూన్య మాసాల్లో శుభ‌కార్యాలు (వివాహం, ఉప‌న‌య‌నం, గృహారంభ ప్ర‌వేశాలు వంటివి) చేయ‌రు.

ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ష‌ష్టిని స్కంద వ్ర‌తం అంటారు. ఈ రోజు సుబ్ర‌హ్మేణ్యేశ్వ‌రుడిని పూజించి ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటారు. సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రుడి ఆరాధ‌న వ‌ల్ల వంశాభివృద్ధి జ‌రిగి కుజ‌దోషం, కాల‌స‌ర్ప‌దోషం తొల‌గుతాయ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ స‌ప్త‌మిని భాను స‌ప్త‌మి అని కూడా అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తారు.

ఆషాఢ మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మికి అత్యంత ప్రాముఖ్య‌త ఉంది. ఆషాఢ పౌర్ణ‌మి రోజున వేదాల‌ను విభ‌జించి అష్టాద‌శ పురాణాలు, మ‌హాభార‌త‌, భాగ‌వ‌తాలు వంటివి లోకానికి అంద‌జేసిన జ‌గ‌ద్గురు అయిన వేద వ్యాసుల వారి జ‌న్మ‌దినం కావ‌డంతో ఈ పౌర్ణ‌మికి వ్యాస పూర్ణ‌మి అని పేరు. ఆ రోజు వ్యాస భ‌గ‌వానుడిని పూజించి వారివారి గురు ప‌రంప‌ర‌ను అనుస‌రించి గురుపూజ నిర్వ‌ర్తిస్తారు.

ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ‌(దీపాన్ని వెలిగించి పూజ‌చేయ‌డం) చేస్తారు. అమావాస్య రోజున దీప‌పు కుందెలు శుభ్రం చేసి ముగ్గుపై దీపాన్ని నిల‌బెట్టి ప‌సుపు, కుంకుమ‌తో పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి న‌లువైపులా దీపాలు పెట్ట‌డం వ‌ల్ల ల‌క్ష్మీప్ర‌ద‌మ‌ని పురాణాలు పేర్కొంటున్నాయి.

మ‌హిళ‌లు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

ఆషాఢం మాసం రాగానే మ‌హిళ‌లు గోరింటాకు పెట్టుకోవ‌డం మ‌న తెలుగు నాట ఆచారం. గోరింటాకు గౌదీదేవికి ప్ర‌తీక‌గా భావిస్తారు. గౌరి ఇంటి ఆకునే గోరింటాకుగా మ‌న పురాణ క‌థ‌లు తెలియ‌జేస్తున్నాయి.

ఆషాఢ మాసంలో అధిక వ‌ర్షాలు, నీటిలో మార్పులు రావ‌డం సంభ‌విస్తాయి. రోగాలు, క్రిములు పెరిగే మాసం కూడా ఇదే. అందువ‌ల్ల మ‌హిళ‌లు నీటితో ఎక్కువ‌గా ప‌నిచేయ‌డంతో ఈ గోరింటాకు పెట్ట‌కుంటే వారి అనారోగ్యం బారిన‌ప‌డ‌కుండా ఉంటార‌ని ఆయుర్వేదం తెలియ‌జేస్తోంది.

గోరింటాకు మ‌హిళ‌లు పెట్టుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యానికి సంబంధించిన దోషాలు తొలిగి ఆరోగ్యం సిద్ధిస్తుంద‌ని పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి.

పెళ్లిళ్లు ఎందుకు చేయ‌రు?

ఆషాఢంలో స‌ప్త దాతువులు స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం, వ‌ర్షాలు కుర‌వ‌డంతో పొలం ప‌నులు అధికంగా ఉండ‌టం, ప్ర‌త్యేకించి శూన్య మాసం కావ‌డంతో పాటు దీక్ష‌కు సంబంధించి మాసం కావ‌డం వ‌ల్ల ఆషాఢంలో గ‌ర్భ‌ధార‌ణ‌కు అనుకూల‌మైన మాసం కాద‌ని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువ‌ల్ల ఈ మాసంలో పెళ్లిళ్లు చేయ‌రు. అంతేకాకుండా కొత్త‌గా పెళ్లైన వారిని కూడా దూరంగా ఉంచుతారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *