124 a section: భారత దేశంలో గత 150 ఏళ్లుగా పౌరుల స్వేచ్ఛా, స్వాంతంత్యాలకు ప్రధాన అవరోధంగా ఉన్న రాజద్రోహం చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునః సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ దాని అమలును నిలిపివేస్తూ ఇటీవల (మే 11,2022) సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనం.
సెక్షన్ 124ఎ అంటే?
భారత శిక్షాస్మృతి(ఐపీసీ) లోని 124 a section రాజద్రోహం గురించి చెబుతుంది. ఎవరైనా మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కాని, ప్రదర్శనలతో కానీ, మరేవిధంగా కాని భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిదేయతను, విద్వేషాన్ని, శత్రుభావానను ప్రేరేపించిన లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించిన వారిని రాజద్రోహం కింద నేరస్థులుగా పరిగణిస్తారు. రాజద్రోహం అనేది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరం. దీనికి మూడేళ్లపాటు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు దాకా (జరిమానాతో/ జరిమానా లేకుండా) శిక్ష విధిస్తారు. ఈ సెక్షన్ కింద ఆరోపణలతో కేసు దాఖలైన వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. కోర్టులకు పాస్‌పోర్టును అప్పగించి, అవసరమైనప్పుడు హాజరుకావాలి.
తొలిసారి అరెస్టైన వ్యక్తి ఇతనే!
రాజద్రోహం చట్టం 124 a section 1870లో అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి అరెస్టైన వ్యక్తి బెంగాల్ వీక్లీ న్యూస్‌పేపర్ బంగబాసి ఎడిటర్ జోగేంద్ర చుందర్ బోస్ (క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ జోగేంద్ర చుందర్ బోస్-1891 కేసు). ఇతడు 1891 కనీస వివాహ చట్టాన్ని విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించడం వల్ల సెక్షన్ 124ఎ కింద అరెస్టు అయ్యారు. కానీ కలకత్తా హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసి, కేసు ఉపసంహరించింది. స్వాతంత్య్ర పూర్వం 124 a section అమలులో ఉన్నప్పుడు దేశంలో తొలిసారి ఈ సెక్షన్ కింద బాలగంగాధర్ తిలక్ అరెస్టై, జైలు శిక్ష అనుభించిన తొలి వ్యక్తి గా ఉన్నారు.
దేశంలో స్వాంతంత్య్ర అనంతరం దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ కూడా ఈ సెక్షన్ ను భవిష్యత్తులో కొనసాగించడం మంచిది కాదని, అత్యంత అనుచితమైనది, గర్హనీయమైనది, ఎటువంటి చట్టంలోనూ దీనికి తావుండరాదు. అని 1957లో పార్లమెంటులో ప్రసంగించారు. ఈ చట్టంపై 1959 లో అలహాబాద్ హైకోర్టు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ఏవిధంగానూ సమర్థనీయం కాదని, తక్షణం దాని అమలును పునఃసమీక్షించాల్సి ఉందని, వాక్ స్వాతంత్య్రాన్ని కుదించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.
124 a section కింద అరెస్టైన ప్రముఖులు వీరే!
- ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి) -2003
- అరుంధతీ రాయ్ (బుకర్ ఫైజ్ గ్రహీత) – 2010
- అసీమ్ త్రివేది (కార్టునిస్ట్) – 2012
- రిన్షాద రీరా (విద్యార్థి కార్యకర్త) -2019
- కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ (జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులు) – 2019
- వినోద్ దువా (దివంగత పాత్రికేయుడు)
- సిద్ధిఖీ కప్సన్ (కేరళ జర్నలిస్టు)
- హార్థిక్ పటేల్ (గుజరాత్)
- దిశా రవి (బెంగళూరు-వాతావరణ కార్యకర్త- రైతు ఉద్యమం నేపథ్యంలో టూల్‌కిట్ వ్యవహారంలో)
- రఘురామ కృష్ణంరాజు (రెబల్ వైఎస్సార్సీపీ ఎంపీ)