Ganpati Bappa Morya: వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహం ముందు భక్తులంతా చేరి ‘గణపతి పప్పా మౌర్యా’ అని నినదించడం మనకు తెలుసు. అసలు వినాయకుడి వేడుకల్లో ఈ మౌర్యవంశం ఎందుకొచ్చింది? వాస్తవంగా వినాయకు డంటే ఎవరు? గణపతి అంటే ఎవరు? నిజాన్ని కప్పిపుచ్చి కల్పనలు ఎలా ముందుకొచ్చాయి? వాస్తవాల్ని తొక్కిపెట్టి జనం కల్పించుకున్న దేవుడికి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు. పరిశీలించాల్సిన అంశాలు. దీనికి నేపథ్యంగా మౌర్యుల పాలనలో ఏం జరిగింది? తదనంతరం శృంగుల పాలనలో వచ్చిన పరిణామాలేమిటీ? తెలుసుకోవడం అవసరం.
What is Ganpati Bappa Morya means?
ప్రాచీన భారతంలో గణ వ్యవస్థ ఉండేది. ఈ రోజు దేశానికి దేశాధ్యక్షుడు ఎలాగో ఆ రోజుల్లో గణానికి అధిపతి అలా ఉండేవాడు. అతనినే గణపతి అనేవారు. మౌర్యుల రాజ్యానికి తొలి గణపతి
- చంద్రగుప్త మౌర్యుడు. ఇతను క్రీ.పూ. 323-299 (బీసీఈ) కాలంలో రాజ్యమేలినవాడు. ఆయన తర్వాత కాలక్రమంలో వచ్చిన మౌర్య చక్రవర్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
- బిందు సారుడు (299-268 బీసీఈ)
- సామ్రాట్ అశోక్ (268-232 బీసీఈ)
- దశరధ మౌర్య ‘232-224)
- సంప్రతి మౌర్య (224-215)
- శాతశుక మౌర్య (215-202)
- దేవవర్మమౌర్య (202-195)
- శతధన్వన్ (195-187)
- బృహద్రత మౌర్య (187-185) ఇతనితో మౌర్యపాలన ముగిసింది.
ఆనాటి కుల విభజన ప్రకారం మౌర్యులు క్షత్రియులు కారు. బహుజనులు. బృహద్రత మౌర్య దగ్గర పుష్యమిత్ర శృంగుడు సర్వసైన్యాధిపతిగా ఉండేవాడు. ఇతను బ్రాహ్మణుడు. అదను చూసి చక్రవర్తిని హత్య చేసి, రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. 185-149 బీసీఈ మధ్య కాలంలో పరిపాలించిన తొలి శృంగ వంశపు రాజు. క్రూరుడు. హిందూ మతావలంభి. బౌద్ధుల్ని అతి దారుణంగా చంపించాడు. హిందూ మతోద్దారకుడిగా – బౌద్ధుల ఆరామాలు, గ్రంథాలు ధ్వంసం చేయించాడు. ఇతని తర్వాత అగ్నిమిత్ర శృంగుడు (149-141) రాజ్యాని కొచ్చాడు. ఇతను తండ్రిలాగా అంత క్రూరుడు కాదు. అతని తర్వాత వసుజేష్ట (141-131), వసుమిత్ర (131-124 బిసీఈ) వంటివారు శృంగుల పాలన కొనసాగించారు. వీరి వివరాలు అంతగా తెలియవు గాని, తర్వాత కాలంలో, అంటే గుప్తరాజుల కాలంలో అగ్నిమిత్ర జీవితాంశాలు కొన్ని కాళిదాసు తన మౌళవికాగ్ని మిత్రలో నమోదు చేశాడు. ఒకవైపు బౌద్ధాన్ని నాశనం చేస్తూ, మరోవైపు 33 వేల హిందూ దేవతల్ని సృష్టిస్తూ, మనుస్మృతి ప్రకారం సమాజ రూపురేఖల్ని-శృంగులు వికృతం చేస్తూ వచ్చారు.


సామ్రాట్ అశోక గురించి!
Ganpati Bappa Morya: సామ్రాట్ అశోక గురించి ఇక్కడ కొన్ని వివరాలు చెప్పుకోవాలి. ఈయనకు ఉన్న అనేక మంది భార్యలలో మొదటి భార్య దేవి. రెండవ భార్య కరువాకి, ఆ తరువాత పద్మావతి, త్రిశ్యరక్ష, అసంధిమిత్ర లాంటివారు ఉన్నారు. ఇందులో దేవి, అసంధి మిత్ర, త్రిశ్యరక్షలు శ్రీలంక మూలాలున్నవారు కాగా, పద్మావతి, కరువాకి ఉత్తర భారతదేశానికి చెందినవారు. మొదటి భార్య కొడుకు మహేంద్ర (285-205) కూతురు సంఘమిత్ర (304-232 బిసీఈ) – వీరిద్దరూ బౌద్ధ భిక్షకులై శ్రీలంకలో విస్తృత ప్రచారం చేశారు. బౌద్ధ ధర్మ స్థాపనలో వీరిది గణనీయమైన కృషి. వీరు కాక, అశోకుడి సంతానంలో చారుమతి, తివల, జులుక వంటి వారున్నారు. వారు వేరు వేరు భార్యలకు పుట్టిన వారు. గణపతి అనే మాట నాటి సమాజంలో ఎలా స్థిరపడింది అనేది అర్థం చేసుకోవడానికి నేపథ్యంగా మనం ఈ వివరాలు చెప్పుకున్నాం. అంతే కాదు, అశోకుని సంతానం రాజ్యాధికారాన్ని సైతం వదలుకుని, బుద్ధుడిలాగే సర్వ సౌఖ్యాలూ వదిలి, ప్రజల్లో తిరుగుతూ, బౌద్ధ ధర్మ ప్రచారానికి జీవితాల్ని ఎలా అంకితం చేశారనేది గ్రహించడానికి ఈ సమాచారం కొంత ఉపయోగపడుతుంది.
అశోకుడి పెద్ద కొడుకు మహేంద్ర బౌద్ధ భిక్షువుగా వెళ్ళిపోవడం వల్ల, రెండవ కొడుకు కునాల మౌర్య రాజ్యానికి రావాలి. కానీ, సవతి తల్లి తిశ్యరక్ష కుట్రల ఫలితంగా చిన్నతనంలోనే గుడ్డివాడయ్యాడు. ఇతను అశోకుడు – పద్మావతిలకు పుట్టినవాడు. కునాలమౌర్య రాజు కాలేక పోయినందువల్ల అతని కుమారుడు దశరథ మౌర్య పట్టాభిషక్తుడయ్యాడు. ఇతడు మౌర్యవంశపు నాలుగవ చక్రవర్తి. చరిత్రలో అశోకుడు ఎందుకు ‘గ్రేట్’గా పరిగణింపబడ్డాడూ? అంటే సువిశాలమైన భారత ఉపఖండాన్ని శాంతి సామరస్యాలతో పరిపాలించాడు కాబట్టి! బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి దాన్ని విస్తరింపజేశాడు కాబట్టి. అంతటి విస్తృతమైన భూభాగాన్ని ఒకే ఒక్కడు పరిపాలించడం ఒక చారిత్రక సత్యం. ఉత్తర భారతదేశంలో పశ్చిమదిశగా ఉన్న గాంధార, తక్షశిల, సింధు వంటి వన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవే. అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలన్నీ మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి.
దక్షిణాన కేరళ ప్రాంతాన్ని చోళులు పాలించేవారు తప్ప మిగతా భారత ఉపఖండమంతా అశోకుడు పాలించిందే. దీన్నే ఇప్పటి పాలకులు ‘అఖండ హిందూ భారత్’ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అశోకుడి కాలంలో అది బౌద్ధ సామ్రాజ్యంగా ఉంది. తర్వాత చాలా కాలానికి అది మొఘల్ సామ్రాజ్య మైంది. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యమైంది. అంతే కాని చరిత్రలో ఎప్పుడూ ఇది హిందూ సామ్రాజ్యంగా విలసిల్లనే లేదు. చరిత్ర పట్ల కనీస పరిజ్ఞానం ఉన్నవారికి ఈ విషయం అర్థమౌతుంది.


మౌర్యుల తర్వాత పుశ్యమిత్ర శృంగుడు (185-149 బీసీఈ) శృంగ రాజ్యాన్ని స్థాపించాడు. బౌద్ధాన్ని అతి కిరాతకంగా అణిచివేయడం ప్రారంభించాడు. కాలం ఎంత గడిచినా, శాంతి ప్రభోదాలతో సమాజంలో ధర్మం వ్యాపించాలే గానీ, హింసాత్మక చర్యలతో ఎవరూ వ్యాపింపజేయలేరు. అప్పటి నుంచి ఇప్పటి దాకా బౌద్ధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే వస్తున్నాయి. అయినా, పూర్తిగా కనుమరుగు చేయలేకపోయారు. అలాగే ఒకప్పటి మౌర్య సామ్రాజ్యపు పరిధిలోనైనా హిందూమతాన్ని వ్యాపింపజేయగలిగారా?
బౌద్ధారామాలు కూల్చి, ఆలయాలు కట్టినందువల్ల, బుద్ధుణ్ణి హిందూమతంలోకి దశావతారాల్లో చేర్చుకు న్నందు వల్ల, బుద్ధుడి జీవిత చరిత్రలోంచి హిందూ దేవుళ్ళకు రూపకల్పన చేసుకున్నందువల్ల.. బౌద్ధానికి తీవ్రంగా నష్టం కలిగించగలిగారు. కానీ, నామ రూపాలు లేకుండా చేయలేక పోయారు. అహింసను ప్రభోదిం చిన ధర్మాన్ని హింసాత్మకంగా నాశనం చేయాలనుకోవడం ఒక పొరపాటైతే, హింసను భోదించే ధర్మాన్ని మళ్ళీ హింసాత్మకంగా ప్రతిష్టించాలనుకోవడం మరో పెద్ద పొరపాటు. ఈ సంఘర్షణ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది.
ఇటీవల బాబ్రీమసీదు తవ్వకాల్లో లభించినవన్నీ బౌద్ధానికి సంబంధించిన గుర్తులు, ఆనవాళ్ళు మాత్రమే. అవి హిందూ దేవాలయ అవశేషాలుగా చూపించి రామజన్మభూమి – అని అన్నారు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఇందుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ తీర్పు చెప్పిన న్యాయమూర్తి రిటైరైన ఆరు నెలల్లోనే అధికార పార్టీ కనుసన్నలలో రాజ్యసభలో కొలువుదీరడం ఈ తీర్పు పట్ల గల అనేక అనుమానాలనూ, అభ్యంతరాలనూ మరింత బలపరుస్తోంది. ఈ విషయాన్ని నిరసిస్తూ వందల మంది బౌద్ధ భిక్షువులు నిరసన ప్రదర్శనలు చేశారు. అరెస్టయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. వారు అల్పసంఖ్యాకులై పోయారు గనక, వారికి సంబంధించిన వార్తలు ప్రధాన వార్తా స్రవంతిలో చోటు చేసుకోలేదు.
ఒకప్పటి సనాతన వైదిక ధర్మమే ఆ తరువాత కాలంలో హిందూ ధర్మంగా చలామణి అవుతూ వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం వినాయకుణ్ణి గణనాయకుడు అని అన్నారు. పార్వతి స్నానానికి వెళుతూ తన శరీరం మీది మైలతో ఒక విగ్రహం చేసి, దానికి ప్రాణం పోసి, బాలుడిగా చేసి బయట కాపలా ఉంచింది. బయటి నుంచి వచ్చిన శంకరుణ్ణి తండ్రిగా గుర్తించలేక ఆ బాలకుడు అడ్డగిస్తాడు. శివుడు కోపం పట్టలేక బాలకుడి తల నరికేస్తాడు. పరిశీలిస్తే ఈ కల్పితకథలో అనేక లోపాలున్నాయి. ఈశ్వరుడంతటి వాడికి, తనను అడ్డగించేది తన కొడుకే అని తెలియపోవడం, తన భార్య ఒక బొమ్మకు ప్రాణం పోయగలదని ఊహించకపోవడం, విచిత్రంగా తోస్తుంది. దేవుళ్ళు గనక, సర్వజ్ఞులు గనక, అన్నీ తెలిసే ఉంటాయని, తెలిసి ఉండాలని.
మనలాంటి మానవ మాత్రులం భావిస్తాం. జీవన్మరణాలను శాసించగల పరమశివుడు పార్వతి పుత్ర శోకాన్ని తగ్గించడానికి బాలుణ్ణి తన స్వశక్తితో బతికించుకోలేకపోయాడు. పోనీ పార్వతైనా బాలుడి తల అతికించడానికి మళ్ళీ తన ఒంటిమీది మైలను ఉపయోగించాల్సింది. అనవసరంగా ఒక అమాయక ప్రాణి ఏనుగును ఎందుకు బలితీసుకున్నట్టూ? ప్రాణం పోయాల్సిన దేవతలు ప్రాణంతీయొచ్చా? ఆదేం దైవత్వం? అయినా మనిషి శరీరానికి ఏనుగుతల ఎలా అమిరిందీ? అవాస్తవాల్ని కట్టుకథలుగా ప్రాచరం చేసినందుకే తర్వాత కాలంలో జనం వీటిని ‘పుక్కిటి పురాణాలు’ అని అన్నారు. ఎవరైనా సోది చెప్పి విసిగిస్తుంటే ‘ఆపు నీ పురాణం‘ అని ఎద్దేవా చేయడం కూడా జరుగుతూ వస్తోంది.
ఇక ఒకసారి బుద్ధుడి బోధనల గురించి చూద్దాం.. మౌర్య సామ్రాజ్యం విస్తరించడానికి చాలా ముందు క్రీ.పూ.5-5 శతాబ్దాల మధ్య కాలంలో శక్యగణం ఉండేది. ఆ గణానికి చెందిన బుద్ధుడు రాజై శక్య గణానికి గణపతి కావల్సింది. కానీ ఆయన రాచరికాన్ని, సకల సౌఖ్యాల్ని త్యజించాడు. బుద్ధుడై తన బోధనల వల్ల ప్రపంచాన్ని ఆకర్షించాడు. అందువల్ల ప్రజలు ఆయనను గణపతిగానే గౌరవించుకున్నారు. బుద్ధుడు అంటే అష్ట వినాయకుడు అని అర్థం – బోధనల్లో రెండు పదాలు తరచుగా వినబడేవి. 1.చిత్తం. 2. మైల. జీవితంలో దుఃఖం ఉందని మొదటిసారిచెప్పిన వాడు ఈ శాక్యముని – బుద్ధుడే!
చిత్తంలోని మైలను వదిలించుకుంటే, మనసు నిర్మలమౌతుందని, దానివల్ల దుఃఖ విముక్తులవుతారని బుద్ధుడు తన శిష్యులకు బోధించేవాడు. బుద్ధుడు జన్మించక ముందు అతని తల్లి కలలో తెల్ల ఏనుగు కనిపించిందని – అందువల్ల బుద్ధుడి జన్మకు ఏనుగును ప్రతీకగా చెపుతారు. వాస్తవంగా జీవించిన చారిత్రక పురుషుడైన బుద్ధుణ్ణి, పురాణ పురుషుడైన కల్పిత గణపతిగా ఎలా మార్చారో చూడండి. అష్టాంగ మార్గాలు అంటే ఎనిమిది నియమాలు పాటించి, వినయ శీలురై ఎలా ఉండాలో, వినాయకుడిగా ఎలా ఉండాలో బుద్ధుడు బోధించాడు.
Ganpati Bappa Morya: బౌద్ధ ధర్మానికి చెందిన రచనలన్నీ పాళీ భాషలో ఉన్నాయి. ఆ భాషలో నాగ్ అంటే ఏనుగు అని అర్థం. అందుకే బౌద్ధ మందిరాల్లో ఏనుగు శిల్పాలు కనిపిస్తుంటాయి. తధాగతుణ్ణి అంటే బుద్ధుణ్ణి మార్చి వైదిక ధర్మ కర్తలు వినాయకుణ్ణి రూపొందించుకున్నారు. అందరు దేవుళ్ళలాగే ఇతను కూడా ఒక కల్పించుకున్న దేవుడు. కల్పించుకున్న దేవుడు కాబట్టి వినాయకుడి చేతులూ, వాహనం మారుతూ వచ్చాయి. మొదట వినాయకుడికి సింహవాహనం ఉండేది. చేతులు పది ఉండేవి. మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చేసరికి మూషిక వాహనం – నాలుగు చేతులు మాత్రమే ఉన్నాయి. ఇన్ని మార్పులెందుకొచ్చాయి? కల్పిత గాథల్లో మాత్రమే ఇలా మార్చుకోవడానికి వీలుంటుంది.


బుద్ధుడు మైలను వదిలించుకుని, నిర్మల చిత్తులు కావాలని చెప్పిన దాన్ని వైదిక ధర్మ బోధకులు అదే మైలను ఉపయోగించి పార్వతి తన ఒంటిమీది మైలతో బొమ్మను చేసి ప్రాణం పోసినట్టుగా రాసుకున్నారు. బుద్ధుడి జన్మకు ఏనుగుకు సంబంధం ఉందని గ్రహించి, దాన్ని ఉపయోగించి ఏనుగుతల బాలుడి మొండానికి అతికించారు. హిందూ పురాణ గాధల ప్రకారం పరుశురాముడు వినాయకుడి దంతం ఒకదాన్ని విరగొట్టాడు. దాన్ని మళ్ళీ సవరించుకునేది ఎలాగో అంతుపట్టక, ఆ పురాణ రచయితలు వదిలేశారు.
ఇక పోతే మౌర్యవంశపు రాజులు బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు. గనక – శృంగుల పాలన వచ్చిన తర్వాత కూడా సామాన్య ప్రజలు మౌర్యుల చల్లని పాలన మరువలేకపోయారు. మనువాదులైన శృంగులు ఎన్ని కల్పిత గాథలు ప్రచారం చేసినా, జనం పాత అలవాటును మార్చుకోలేక పోయారు. మనువాదులు సృష్టించిన హిందూ దేవుడు గణపతిని పూజిస్తూనే, మౌర్యుల కాలం నాటి గణాధిపతిని అంటే ఒకనాటి తమ చక్రవర్తిని గుర్తు చేసుకుంటూ ‘గణపతి పప్పా మౌరియా’ (Ganpati Bappa Morya) అని అనకుండా ఉండలేకపోయారు. ఆ అలవాటు, ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనివల్ల వినాయకుడి తొండమే కాదు, అసలు ఆ కథే బౌద్ధధర్మాన్ని తెగ్గోసి, హిందూ దేవుణ్ణి సృష్టించుకున్న ఒక అతుకుల కథ అని అర్థమౌతూ ఉంది.
నోట్: నేను శేఖరించిన పురాతన వ్యాసం డాక్టర్ … దెేవరాజు మహారాజు గారి
కలం నుండి…. #శ్రీనివాస్ మండెపుడి