chit fund schemes: వరంగల్: చిట్‌ఫండ్స్ కంపెనీల్లో ఖాతాదారులకు డబ్బు చెల్లింపుల విషయంలో వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజలను మోసం చేస్తే మాత్రం చిట్ ఫండ్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్‌జోషి హెచ్చరించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్రేట్ పరిధిలోని చిట్ ఫండ్ సంస్థలు గడువు తీరినప్పటికీ ప్రజలు చెల్లించాల్సిన డబ్బులు చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయని పోలీస్ కమిషనర్ డా.తరుణ్‌జోషి అన్నారు. కొద్ది మంది బాధితులు పోలీస్ కమిషనర్‌కు స్వయంగా కలుసుకోని సదరు చిట్ ఫండ్ సంస్థలపై ఫిర్యాదులు చేశారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రై సిటీ పరిధిలోని చిట్‌ఫండ్ సంస్థల యాజమాన్యాలతో శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనర్రేట్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా చిట్ ఫండ్ సంస్థలు ఖాతాదారులకు చెల్లించాల్సిన డబ్బు విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా చిట్ ఫండ్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజలు మోసం చేస్తున్నాయన్నారు. సాధారణంగా మధ్య తరగతి ప్రజలే ఈ సంస్థల్లో పొదుపు చేసుకోవడంతో పాటు డిపాజిట్ల రూపంలో డబ్బును దాచుకుంటు న్నారన్నారు. దాచుకున్న డబ్బుకు గడువు తీరినా, నెలవాయిదాలు పూర్తి డబ్బులు చెల్లించినా అనంతరం ఖాతాదారులకు చెల్లించాల్సిన డబ్బు కోసం చిట్ ఫండ్ సంస్థలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు మోసం చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి ఫిర్యాదులే ఎక్కువుగా వస్తున్నాయని, చిట్ ఫండ్ సంస్థల ద్వారా రూపొందించిన భూముల వెంచర్లలోని భూములను ఖాతాదారులకు తీసుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని
కమిషనర్ అన్నారు. ఒక వేళ సంస్థ నుండి డబ్బులు తీసుకోని వాయిదాలు సరిగా కట్టని ఖాతాదారులు నియమాలను అనుసరించి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇకనైనా ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రబుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ఖాతాదారులు సకాలంలో డబ్బులు చెల్లించాలని, ప్రజల డబ్బులకు భద్రత కల్పించడమే పోలీసుల అంతిమ లక్ష్యమని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా, హన్మకొండ, కాజీపేట, క్రైం ఎసిపిలు జితేందర్ రెడ్డి, శ్రీనివాస్, బాబురావు, చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేణుమాదవ్, ఇన్ప్పెక్టర్ రాఘవేందర్, మల్లేష్, గణేష్ , రమేష్ కుమార్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.