Walking Style | నేను మోనార్క్‌ని నన్నేవరేం చెయ్యలేరు..అన్నట్టు బోర విరుచుకుని వడివడిగా అడుగులేసే వారూ, ప్రపంచ భారాన్నంతా మోస్తున్నవారిలా భుజాలు కుంచించుకుపోయినట్టు నడిచే మధ్య తరగతి సుబ్బారావులూ, హంస నడకల అమ్మాయిలూ.. ఎవరు ఎలాంటి వారో వారి నడక(Walking Style) చూసి పట్టేయొచ్చంటున్నారు మనస్తత్వశాస్త్ర నిపుణులు.
Walking Style | నడకతో మీరేంటో చెప్పవచ్చు!
కొంత మంది పాదాలను ఈడుస్తూ ఈసురోమని నడుస్తుంటారు. ఇలాంటి సదరు వ్యక్తులు బద్దకస్తుల కేటగిరిలోకి వస్తారన్నమాట. త్వరగా ఒత్తిడికి గురువుతారు కూడా. ఎవరి చెప్పులైతే తొందరగా అరిగిపోతాయో వాళ్లే ఈ తరహా వ్యక్తులన్నమాట. ఈసురోనే వాళ్లకి ఫక్తు వ్యతిరేకం నిటారుగా హుషారుగా నడిచేవాళ్లు. వీళ్లు చాలా సమర్థులు. సోమరితనం వీరి ఒంటికి అస్సలు పడదు. నడుస్తున్నప్పుడు జఘనభాగం కదులుతోందంటే వీరికి నలుగురి దృష్టినీ ఆకర్షించాలన్న తపన ఎక్కవన్నమాటే!. కొందరు గబాగబా చేతులు ముందుకీ వెనక్కీ ఊపుతూ నడుస్తుంటారు. Easy Going తరహా మనస్తత్వం వీరిది. Self-Confidence ఎక్కువ. జేబులో చేతులు పెట్టుకుని నడిచేవాళ్లది గుంభనంగా ఉండే మనస్తత్వం. అంత తేలిగ్గా బయటపడరు. ప్రతితీ రహస్యమే. గడ్డం పైకెత్తి బోరవిరిచి చేతుల్ని అవసరమైనదానికన్నా ఎక్కువుగా కదుపుతున్నారూ అంటే ఎదుటివారిని ఇంప్రెస్ చేసేయాలను కుంటున్నారన్నమాట.
Walking Style | అసలు నడక ఇదేనా?
ఇతర వ్యాయామాలకన్నా నడకనే ఎక్కువుగా ఎంచుకుంటారు కొందరు. ఆరోగ్యం కోసం నడక అనుకున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు పాటిస్తుంటారు. అయితే Walking చేసేటప్పుడు పొట్టను లోపలికి లాగి పెట్టుకోవాలి. కానీ శ్వాస తీసుకుంటూ నడవాలి. మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది కానీ క్రమంగా అలవాటు అవుతుంది. పాటలు వింటూ నడవడం వల్ల ఎక్కువుగా ప్రయోజనాలు ఉంటాయని అమెరికాకు చెందిన అద్యనకర్తలు చెబుతున్నారు. వారంలో కనీసం మూడుసార్లు ఇలా చేయడం వల్ల నడక ద్వారా మనం అనుకున్న లక్ష్యం ఇట్టే అందుకోవచ్చుంటున్నారు.


నడిచేటప్పుడు మొట్ట మొదటిగా నెమ్మదిగా అడుగులు వేయాలి. 5 నిమిషాలయ్యాక శరీరాన్ని వేగంగా కదిలిస్తూ Brisk వాక్ చేయాలి.చివర్లో ఓ నిమిషం పరుగూ, మరో నిమిషం నడక చొప్పున చేయాలి. మొదటిసారి వ్యాయామం చేసేవారు నెమ్మదిగా Jogging మొదలెట్టి క్రమంగా పరుగెత్తేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల ఎక్కువ కెలోరీలు కరుగుతాయి. రోజులో కనీసం 20 నిమిషాల నుంచి అరగంట వరకూ నడవాలి. దీనివల్ల శక్తిస్థాయిలూ పెరుగుతాయని అంటున్నారు నిపుణులు. పచ్చని చెట్ల మధ్య, మొక్కల మధ్య నడిచేవారిలో ఆనందం 75 శాతం పెరుగుతుందని మైండ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
నడిస్తే పోయేదేం లేదు!
ఇంజన్‌కు అడపాదడపా ఓవరాలింగ్ ఎలా చేస్తారో అలాగే మన శరీరానికి ఓవరాలింగ్ అవసరమే. అందుకు సరైన పద్ధతి వ్యాయామం. ఎక్సర్సైజులు ఇలాగే చేయాలీ అనేం లేదు. కొందరు జాగింగ్‌ను ఎంచుకుంటే మరికొందరికి రన్నింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఇంకొందరికి యోగాపై మక్కువ కావచ్చు. ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే వయసును బట్టి వ్యాయామం ఉండాలి. సాధారణంగా 50ఏళ్ల కు పైబడినవారు రన్నింగ్ చేస్తే గుండె సంబంధిత జబ్బులకు లోనుకావచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కేలరీల రూపంలో కరిగిస్తే ఒంటికి నూతనోత్సహం, ఉత్తేజం కలుగుతాయి.