Vro Fighting: ప్రభుత్వ పాలనలో అధికారులది కీలక పాత్ర ఉంటుంది. ప్రజలకు సేవ చేయడంలో కాస్త సహనం, ఓర్పు కలిగిన అధికారులు ఉన్నారు. మరికొందరిలో ముఖం చిట్లించుకుని పనులు చేసేవారూ ఉన్నారు. ఇక ప్రభుత్వ అధికారులు అనగానే అవినీతి కూడా గుర్తుకు వస్తుంది ప్రస్తుత కాలంలో. అయితే ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే మీరు షాక్ తింటారు. ఇద్దరు అధికారులు వాదోపవాదాలు (Vro Fighting) చేసుకుంటూ ఒక అధికారి మరొక అధికారి చెవి కొరికేశారంట. ఈ వింత వార్త ఏపీలోని కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
కర్నూలు జిల్లా కర్నూలు మండలంలోని సుంకేసుల VRO వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్ఓ కృష్ణదేవరాయులు విధులు నిర్వహిస్తున్నారుర. వేణుగోపాల్ తహశీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ సాయంతో వెబ్ ల్యాండ్‌లో వివరాలు ఎంట్రీ వ్యవహారాలు కూడా చూస్తుంటారు. తమ గ్రామ పరిధిలోని పనులు వేణుగోపాల్ రెడ్డి కావాలనే పెండింగ్‌లో ఉంచుతున్నాడంటూ కృష్ణ దేవరాయలు అతనితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కిందమీద పడి ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ సమయంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని వీఆర్ఓ కృష్ణదేవరాయలు కొరికేశాడు.
Vro Fighting: దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఒకరు చెవిని అలానే పట్టుకుని, మరొకరు ఆవేశంతోనూ వెళ్లి పరస్పరం కేసు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం కాస్త తహశీల్దార్ చెవిన పడింది. తహశీల్దార్ వెంటనే పరుగెత్తుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. పోలీసు అధికారులకు చెప్పి, అదే విధంగా ఇద్దరి విఆర్ఓలకు సర్ధి చెప్పాడు. ఇద్దరూ తహశీల్దార్ మాటలకు రాజీకి వచ్చి కేసులు పెట్టుకోకుండా బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఇద్దరూ కేసులు పెట్టుకుంటే విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరుతుంది. అప్పుడు అందరు అధికారుల వ్యవహారం బయటపడుతుందనే ముందు ఆలోచనతో కేసులు పెట్టకుండా తహశీల్దార్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.