Viral Fever | జ్వరం నిజానికి అనారోగ్య సమస్య కాదు. ఇది ఏదో ఒక అనారోగ్యానికి లక్షణం మాత్రమే. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.6 ఫారన్హీట్ డిగ్రీలు ఉంటుంది. అంత కంటే పెరిగితే జ్వరం(Viral Fever) వచ్చినట్టుగా భావించాలి. అయితే జ్వరం వచ్చిన ప్రతీసారి కంగారు పడాల్సిన పనిలేదు అని నిపుణులు చెబుతున్నారు.
Viral Fever: జ్వరం ఎందుకంటే?
మన శరీరంలో ప్రమాదకర సూక్ష్మక్రిములు ప్రవేశించగానే మనలోని రక్షణ వ్యవస్థ శరీర ఉష్ణోగ్రత పెంచడంగా తన స్పందనను తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత 97 డిగ్రీల నుంచి 100.4 మధ్య పెరుగుతూ, తగ్గుతూ ఉండొచ్చు. దీని గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.
తాకినప్పుడు వేడిగా ఉంటే, శరీరం వేడిగా ఉండటంతో పాటు నీరసంగా ఉండటం, కళ్లు తిరగడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, వికారంగా ఉండటం, శరీరం మీద దద్దుర్లు కనిపించి నప్పుడు, నీళ్ల విరేచనం అవుతున్నప్పుడు, గొంతులో నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నప్పుడు మాత్రం జ్వరాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.
ఎప్పుడు ప్రమాదమంటే?
సాధారణ జ్వరం దానంతటదే ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు అలా జరగదు. అటువంటి సమయాల్లో అప్రమత్తం అవడం అవసరం. జ్వరం 103 డిగ్రీలను మించి ఉన్నప్పుడు 5 రోజులకంటే ఎక్కువ కాలం పాటు జ్వరం కొనసాగుతున్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, మెడ కండరాలు బిగుసుకుపోయిన భావన కలుగుతూ తలనొప్పి ఉన్నప్పుడు, నిద్ర ఎక్కువుగా వస్తూ మత్తుగా ఉన్నప్పుడు, చర్మం మీద ఎర్రని మచ్చలు ఏర్పడినా, మల విసర్జనలో రక్తం పడుతున్నా కూడా నిర్లక్ష్యం తగదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది.


ఇవి తెలుసుకోండి!
నడుము నొప్పి లేదా ఇతర నొప్పులను తగ్గించేందుకు తీసుకునే ఆస్ప్రిన్, ఐబ్రూఫిన్ వంటి మందులు వాడటం వల్ల నొప్పి తగ్గి సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటి వినియోగం వల్ల జీర్ణ వ్యవస్త మీద కలిగే దుష్ప్రభావాలు రెండు రెట్లు ఎక్కువుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంగీతం వినడం వల్ల మెదడులో కలిగే రసాయన చర్యలు, Drugs తీసుకోవడం, ఇష్టమైన ఆహారం తీసుకోవడం, శృంగారం వల్ల కలిగే రసాయన చర్యలు ఒకే రకంగా ఉంటాయి. పెరీడాంటైటిస్, లేదా ఇతర నోటి సంబంధిత దీర్ఘకాలిక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పురుషుల్లో శృంగార సంబంధ సమస్యలు వచ్చే ఆస్కారం 2.28 రెట్లు ఎక్కువ.