Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యChittoor: సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన కథనం ప్రకారం..మదనపల్లి మండలం నక్కలదిన్నె తండాకు చెందిన వేణుగోపాల్ నాయక్ (24) ములకలచెరువు మండలంలోని కాలువపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ములకల చెరువు వినాయక్ నగర్లో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఉద్యోగి రిత్యా ప్రతి రోజూ కాలువపల్లెకు వెళ్లి వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విధుల నుంచి వచ్చిన గోపాల్ నాయక్ అద్దె ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయారు.
అతనితో పాటు విధులు నిర్వహిస్తున్న తోటి సిబ్బంది శనివారం పలు మార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో గది వద్దకు వెళ్లి చూశారు. వేణుగోపాల్ నాయక్ ఉరివేసుకొని ఉండటాన్ని చూసి షాక్ తిన్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దింపించారు.
సూసైడ్ నోట్ స్వాధీనం…
మృతుడు వేణుగోపాల్ నాయక్ చనిపోతూ సూసైడ్ రాసి ఉంచారు. ఈ సూసైడ్ నోటీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని..నేను అనుకున్నది ఏమీ జరగలేదని, జీవితంపై విరక్తి చెంది చనిపోతున్నా, నా చావుకు ఎవ్వరూ కారణం కాదు’ అని సూసైడ్ నోటీసులో రాసి ఉందని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.