Unknown Facts: ఈ ప్రపంచంలో మానవునికి తెలియని విశేషాలు, వింతలు ఇంకా చాలానే ఉన్నాయి. భూమి- ఆకాశం మధ్యలో సమస్త ప్రాణికోటి జీవిస్తున్నాయి. కొన్ని అంతరించిపోతున్నాయి. కొన్ని రూపాంతరం చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మనకు తెలియని విషయాలు అలానే మరుగున పడి ఒక ప్రశ్నగా మిగిలిపోతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని ప్రశ్నలకు ఈ క్రింద సమాధానాలు ఇచ్చాం. మరికొన్ని Unknown Factsను ముందుముందు పాఠకులకు అందిస్తాం.
ఛీర్స్(cheers) ఎందుకు చెబుతారు?


ఛీర్స్ ఎందుకు చెబుతారో మీకు తెలుసా? మనము ఏదైనా డ్రింక్స్ కానీ, మద్యం కానీ తాగేటప్పుడు ఛీర్స్ కొడుతుంటాం కదా!. అయితే డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాకించి ఛీర్స్ చెప్పుకోవడం ఇప్పుడైతే సెలబ్రిటీల సింబల్ గా చెప్పవచ్చు. కానీ అది ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా…అంట. మధ్య యుగం నాటి సముద్రపు దొంగలు ఈ సంప్రదాయానికి ఆద్యులు. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవిపై దిగేవారట. అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. దీంతో పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని మద్యం ఒక దానిలోంచి మరో దానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం. ఇలా చేసేటప్పుడు వారు ఛీర్స్ అనకునేవారు. అంటే చావు భయం వద్దు.. ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావన. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్(cheers) చెప్పుకునే సంప్రదాయం మొదట బ్రిటన్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత రాజ్యాల్లోకి వ్యాపించి మన దాకా చేరింది. ఇలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ.. ఇప్పటికీ నలుగురు కూర్చొని డ్రింక్స్, మద్యం తాగిన చోట కనిపిస్తోంది.
సముద్రం దగ్గర ఎందుకు సూర్యుడు, చంద్రుడు (sun and moon)పెద్దగా కనిపిస్తాయి?


సాధారణంగా మనం చూసే సూర్యుడు, చంద్రుడు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయ సమయాల్లో సముద్ర ప్రాంతాల్లోనే కాకుండా భూమ్యాకాశాలు కలిసినట్టుగా కనిపించే చోట సూర్యుడు, చంద్రుడు పెద్దగా కనిపిస్తాయి. మిట్ట మధ్యాహ్నం కన్నా ఉదయం, సాయంత్రాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడానికి మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆఫ్టికల్ ఇల్యూషన్) కారణమని పరిశోధనల్లో తేలింది. నిజానికి సూర్య, చంద్రుల పరిమాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తీసిన అలాగే వేరే ప్రాంతాల్లో వేరే సమయాల్లో తీసిన చిత్రాల్లో సూర్య, చంద్రుల పరిమాణాలు దాదాపు ఒకేలా ఉంటాయి.
విమానాలు(aeroplane) వెనక్కు వెళ్తాయా? ఎందుకు?


ఈ ప్రపంచంలో మనం వినియోగించే ప్రయాణ సాధనాల్లో విమానం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఖండాంతరాలను, దేశాలను గంటల వ్యవధిలో దాటుకుంటూ మన గమ్యాన్ని చేర్చుతాయి. అయితే ఈ విమానాలు ముందుకు వెళ్లడం మాత్రమే గమనించాం తప్ప వెనక్కి వెళ్లిన సందర్భాలు ఎప్పుడూ చూసి ఉండరు. వాస్తవానికి అది సాధ్యం కూడా కాదు. విమానాలు వెనక్కి ప్రయాణించలేవు. అంతెందుకు విమానాశ్రయం నుంచి టేకాఫ్( పైగి ఎగరడం) కోసం ఉన్న చోటు నుంచి వెనక్కి పోలేకపోవడంతో వాటిని ట్రాక్టరు లాంటి భారీ యంత్రం వెనక్కు లాగుతుంది. విమానాలు ప్రయాణించే యంత్రాల్లో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు, గాలిని పీల్చుకొని దహన వాయువుల్ని అధిక పీడనం వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. అయితే యుద్ధ విమానాల్లో మాత్రం ఇంజన్లను అటూ ఇటూ తిప్పే వ్యవస్థ ఉండటం వల్ల అవి ఎటైనా వెళ్లగలవు. హెలికాఫ్టర్లు కూడా ఏ వైపునైనా వెళ్లగలవు.
అంతరిక్షనౌకల(spaceship) పనేంటి? వాటి వల్ల ప్రయోజనం ఉందా!


శాస్త్రవేత్తలు పయనీర్ -10(pioneer-10), వాయేజర్ – 1(voyager 1), వాయేజర్ – 2(voyager 2) లాంటి అనేక మానవరహిత అంతరిక్ష నౌకల్ని అంతరిక్షంలోకి పంపారు. ఇంకా అవసరాన్ని బట్టి పంపుతున్నారు. వీటి వల్ల సౌర వ్యవస్థలోని భాగాలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇవి ఎన్నో ఛాయా చిత్రాలు శాస్త్రీయవిజ్ఞానం కోసమేగాక ఇతర గ్రహాలు, చందమామపైకి మానవసహిత అంతరిక్షనౌకలు పంపే మార్గాలు ఎలాగో తెలుపుతాయి. శుక్రుడు, అంగారకుడిపైన ఉన్న వాతావరణం, వాటి ఉపరితలం ఎలా ఉన్నదో? కొంత సమాచారం ఈ అంతరిక్షనౌకల వల్లే తెలిసింది. నిర్ధేశించిన పనులతో పాటు ఖగోళ వస్తువుల సమాచారం తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ మానవరహిత అంతరిక్షనౌకల్లో ఉంచారు. అక్కడ జీవులుంటే భూవాతావరణం, భూమి మీద ఉన్న మానవుల గురించి సమాచారం తెలుస్తుంది. వీటిలో మనుషులకు సంబంధించి అనేక ఛాయాచిత్రాలు, 53 భాషల్లోని స్వరాల రికార్డింగ్, చంటి పిల్లల ఏడ్పులు, మానవుడి గుండెచప్పుళ్లు, పక్షుల రాగాలు, సాగర ఘోషల శబ్ధాల రికార్డింగ్‌లు ఉన్నాయి.
శరీరానికి సబ్బు(soap)నే ఎందుకు వాడాలి?


సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మ జీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అనుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి. ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్, అది కరోనా అయితే సరే నీటితో పాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది. ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండటానికి గల రహస్యం దాని హైబ్రిడ్ నిర్మాణమే. సబ్బుకు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అంటారు. హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. హైడ్రోఫోబిక్ భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్‌కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది. నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినప్పుడు ఆ నీరు సబ్బు అనువుకున్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది. దీంతో సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్లు సైతం సబ్బు అణువుతో చేతి నుండి విడుదలై బయటకు వెళ్లిపోతాయి. సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్‌ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది.
పురుగుల(worms) పరిమాణం జంతువులు, పక్షుల కన్నా తక్కవుగా ఉంటుంది ఎందువల్ల?


వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్ శాతం ఇప్పటి కన్నా ఎక్కువుగా ఉండి ఉంటే, పురుగుల(worms) దేహ పరిమాణం కూడా ఇప్పటి కన్నా ఎంతో ఎక్కువుగా ఉండి ఉండేది. వెన్నుముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్ ను అందజేస్తుంది. అందువల్ల, పురుగు పరిమాణం పెద్దదయ్యే కొలదీ, దాని దేహానికి ఆక్సిజన్ ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా, చిక్కుపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థ పురుగుల పరిమాణంపై కొంత పరిమితిని విధిస్తుంది.
వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం ఎంత ఎక్కువుగా ఉంటే, వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్ 21 శాతం ఉంటే, భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలిరోజుల్లో గాలిలో ఆక్సిజన్ 35 శాతం ఉండేది అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం 760 మిల్లీ లీటర్లు ఉండే రాక్షస తూనీగలు ఉండేవి. అంతేకాకుండా, పురుగుల గరిష్ట పరిమాణంపై ఆంక్షలు విధించే మరో అంశం- పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే, ఆ భాగాలకు ఆక్సిజన్ లభించదు. అందువల్ల పురుగుల శరీర పరిమాణం చిన్నగా ఉంటుంది.