traveling precautions ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త వినోదం కోరుకునే వారు కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువుగా ఇష్టపడతారు. రోజూ వారి పనుల నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని, చుట్టూ ఉన్న వైవిధ్య భరితమైన ప్రపంచాన్ని చూడాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ విధమైన అభిరుచి నుంచే తీర్థయాత్రలు అన్న కాన్సప్ట్ వచ్చింది. ఆధ్యాత్మిక చింతనే కాకుండా ప్రకృతిని ఆస్వాదీస్తూ పర్యటనలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల ప్రజల జీవనశైలి తెలిపే విహారయాత్రల వల్ల ఎన్నోఎన్నో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు జీవిత కాలం గుర్తుండి పోతాయి. యాత్రలకు వెళ్లాలనే ఉత్సాహం ఎంత ఉన్నప్పటికీ, యాత్రలు వినోదం, విజ్ఞానంతో కూడిన విహారం కావాలంటే కొన్ని జాగ్రత్తలు (traveling precautions)తీసుకోవాలి.


ముందస్తు ప్రణాళిక
కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతున్నామంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఎక్కడి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అన్నవిషయాలు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎండాకాలంలో టూర్ వెళ్లాలనుకునేవారు మూడు నెలల ముందుగానే టూర్ ప్లాన్ రెడీ చేసుకుంటే విమాన ఛార్జీలు, రైల్వే ఛార్జీలు తక్కువుగా ఉంటాయి. ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి.


గ్రూపులుగా వెళ్లితే..
అందరూ కలిసి వెళితే ఆ మజానే వేరు. గతంలో టూర్ సర్వీస్‌లు ఉండేవి. ఒక ఊరు నుంచి కొన్ని ప్రాంతాలకు బస్సు ఏర్పాటు చేసేవారు. ఈ ఊరిలో, చుట్టుప్రక్కల ఊర్లలో ఆసక్తి ఉన్నవారు ఆ టూర్ బస్సులో వెళ్లేవారు. ఇప్పుడు టూరిస్ట్ సంస్థలు వచ్చాక ప్యాకేజీలుగా టూర్ ప్రాంతాలను అందిస్తున్నారు. భారత రైల్వే, టూరిజం డిపార్టుమెంట్, ప్రైవేటు టూరిస్ట్ సంస్థలు గ్రూపులకు మంచి రాయితీలు కూడా ఇస్తున్నాయి. మీ బంధువుల స్నేహితుల ఫ్యామిలీలతో కలిసి వెళితే ప్రయాణ ఖర్చులు బాగా తగ్గుతాయి.


వైద్య పరీక్షలు తప్పనిసరి..
విహార యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య పరిస్థితి బట్టి టూర్ ప్లాన్ చేసుకోవాలి. స్విమ్మింగ్, ట్రెక్కింగ్ లాంటివి అందరికీ సరిపోవు. ఆరోగ్యాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. టూర్లో జ్వరం, జలుబు, విరేచనాలు, వాంతులు, కండరాల నొప్పులు వంటి చిన్న చిన్న సమస్యలను తగ్గించే మందులను వెంట తీసుకెళ్లాలి. మధుమేహంతో బాధపడేవారిలో కొన్నిసార్లు షుగర్ లెవల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. చాక్లెట్లు, బిస్కట్లు వంటివి వెంట ఉంచుకోవాలి.


తోడుగా తీసుకువెళ్లండి..
చాలా అనారోగ్య సమస్యలు నీటి కారణంగానే వస్తాయి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగకుండా మీతో పాటుగా మినరల్ వాటర్‌ను క్యారీ చేయండి. ఎక్కువుగా నీళ్లు తాగేలా సమృద్ధిగా నీటిని మీ వెంట ఉంచుకోండి. నిమ్మ, నారింజ, జామ వంటి ఫలాల్లో విటమిన్ సి ఎక్కువుగా ఉంటుంది. ఇవి తక్షణం శక్తిని ఇస్తాయి. అంతే కాదు.. ప్రయాణంలో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలున్న వారు తప్పనిసరిగా నిమ్మ, నారింజలను తమతో పాటు తీసుకువెళ్లాలి. ప్రయాణంలో అజీర్తి, కడుపులో వికారం, అలసటలను అల్లం నివారిస్తుంది.
కొద్ది చుక్కల అల్లం రసాన్ని నిమ్మరసంలో లేదా తేనెతో కలిపి తీసుకుంటే కడుపులో వికారం తగ్గుతుంది. ఎక్కవుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్ పూర్తిగా మానేయండి. తాజా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు ఎక్కవుగా తీసుకోవాలి. గ్లూకోజ్ పౌడర్, నాణ్యమైన ఎనర్జీ డ్రింక్స్, టిన్‌లో లభిస్తున్న కొబ్బరి నీళ్లు ఎప్పుడు వెంట ఉంచుకోవాలి. డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో ఈ కొద్ది జాగ్రత్తలు పాటిస్తే హ్యాపీ జర్నీ.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!