Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమలకు రాష్ట్రపతి రాక
Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమలకు రాష్ట్రపతి రాక తిరుపతి : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమలకు రానున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం సతీసమేతంగా ఆయన తిరుమ లకు రానున్నారు. దర్శనానంతరం అదే రోజున ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం వీరందరూ రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు.
శ్రీవారి పాదుకల ఉరేగింపు నిర్వహణ
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు ఆలయంలో జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీ. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతి పాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నప్పుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నారని పురాణాల ఐతిహ్యం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఏవిస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.