Thunder Shock | ఆ కుటుంబానిది రెక్కాడితో గాని డొక్కాడని పరిస్థితి. కడు పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. చదువుకోవాలని ఉన్నా కుటుంబ పరిస్థితిని చూసి చదువు మధ్యలోనే ఆపేశాడు. తన శక్తికి మించిన పనులన్నీ చేసేవాడు. కుటుంబం ఆకలి తీర్చడానికి తోడయ్యాడు. బర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ బాలుడు చివరకు పిడుగు పాటు(Thunder Shock)కు బలయ్యాడు. ఈ విషాద సంఘటన Tirupathi జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడు గ్రామంలో చోటు చేసుకుంది.
దొరవారి సత్రం మండలం Palempadu గ్రామానికి చెందిన గంధం గురవయ్య కుమారుడు గంధం శంకరయ్య (15) బర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామంలోని పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసిన శంకరయ్య తాను చేయగలిగిన పనులన్నీ చేసేవాడు.

ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు ప్రతిరోజూ లాగే బుధవారం కూడా బర్రెలను తీసుకొని వెళ్లి పంట పొలాలలో మేపుతుండగా తల్లిదండ్రులు దగ్గరికి వెళ్లాడు శంకరయ్య. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడి వర్షం పడింది. అదే సమయంలో తల్లిదండ్రులు కొంచెం దూరంలో కూర్చొని ఉన్నారు. శంకరయ్య మాత్రం విడిగా ఉన్నాడు. మృత్యుకబళించినట్టుగా శంకరయ్యపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబానికి తోడుగా ఉంటున్న కొడుకు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కులు పిక్కట్టిల్లేలా ఏడ్చారు. బాలుడు మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.