TikTok భార్గ‌వ్ ఘ‌ట‌న ముమ్మాటికే Sexual Grooming నే : చిన్మ‌యి

TikTok భార్గ‌వ్ ఘ‌ట‌న ముమ్మాటికే Sexual Grooming నే : చిన్మ‌యి

Sexual Grooming : TikTok భార్గ‌వ్ విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఓ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి స్పందిచారు. ఇది కేవ‌లం Sexual Grooming అని, ఒక అమాయ‌కురాలైన మైన‌ర్ బాలిక‌పై ఆ వ్య‌క్తి చేసిన లైంగిక దాడి అని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై తాను ఓ తెలుగు పేప‌ర్ చ‌దివాన‌ని, ఆ పేప‌ర్‌లో అంతా ఆ మైన‌ర్ బాలిక‌ను, త‌ల్లిదండ్రుల‌ను కించ‌ప‌రిచే విధంగా రాశార‌ని చిన్మ‌యి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టిక్‌టాక్ భార్గ‌వ్ అనే కుర్రాడుకు తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఫ్యాన్స్ ఉన్న‌ట్టు చూశాన‌ని పేర్కొన్నారు. ఆ న్యూస్ పేప‌ర్‌లో ఘ‌ట‌న గురించి రాసిన‌ది చ‌దువుతూ..’ఓ త‌ల్లి అతి గారాభం చేయ‌డంతోపాటు, ఆ బాలిక తండ్రి ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ బాలిక ఎక్క‌డికి వెళుతోంది గ‌మ‌నించ‌క‌ పోవ‌డం, ఆ అమ్మాయికి పూర్తిగా స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డంతో టిక్‌టాక్ భార్గ‌వ్‌తో ఆమె మ‌రింత చ‌నువుగా ఉండ‌టం చేసేది. త‌ల్లిదండ్రుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ మైన‌ర్ బాలిక కామాంధుడి చేతిలో బ‌లైంది. అని రాశార‌ని చిన్మ‌యి అన్నారు. ఈ తెలుగు పేప‌ర్‌లో రాసినది చ‌దువుతుంటే ఆడ‌పిల్ల‌ది, వారి త‌ల్లిదండ్రుల‌దే త‌ప్పుగా స‌మాజానికి చెప్పే రీతిలో ఉంద‌ని తెలిపారు. ఇలా రాయ‌డం చాలా దారుణ‌మ‌ని ఆమె ఆ క‌థ‌నాన్ని త‌ప్పుబ‌ట్టారు.

ఆ మైన‌ర్ బాలిక త‌ల్లిదండ్రులు ఏ కార‌ణం చేత విడిపోయారో, వారి మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు ఉన్నాయో తెలియ‌కుండా వారి జీవితాల‌ను ఇలా రాయ‌డం చాలా త‌ప్పు అని అన్నారు. ఎంతో మంది భార్య‌భ‌ర్త‌లు కొన్ని మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల విడిపోతున్నార‌ని, అందులో భాగంగా త‌ల్లి వ‌ద్ద‌నే పిల్లలు ఉంటున్నార‌ని తెలిపారు. తాను కూడా చిన్న‌ప్ప‌టి నుంచి త‌ల్లి వ‌ద్ద‌నే పెరిగాన‌ని అన్నారు. ఎంతో మంది త‌ల్లులు త‌మ పిల్ల‌ల‌ను బ‌తికించుకోవ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డుతూ, స‌మాజంలో వారిని వారు రక్షించుకుంటూ వారి పిల్ల‌ల‌ను ఆర్థికంగా కాపాడుకుంటూ వ‌స్తున్నార‌న్నారు. త‌ల్లిదండ్రులు ఏ ఆడ‌పిల్ల‌ల‌ను బాధ్య‌తా ర‌హితంగా పెంచాల‌ని అనుకోర‌ని తెలిపారు.

Singer Chinmai

ఈ టిక్‌టాక్ భార్గ‌వ్ చేతిలో మోస‌పోయిన బాలిక లాంటి వారు స‌మాజంలో ఎంతో మంది ఉన్నార‌ని అన్నారు. ఒంటరి జీవితంతో బ్ర‌తుకు ఈడుస్తున్న ఆ మైన‌ర్ బాలిక త‌ల్లి పెంచిన విధానాన్ని కించ‌ప‌రిచే విధంగా స‌మాజంలో చూపించ‌డం ఇంకా అలాంటి కుటుంబాల‌ను క్రుంగిపోయేలా చేసిన‌ట్టు అవుతుంద‌ని అన్నారు. ఈ ప్ర‌పంచంలో ఓ ఆడ‌పిల్ల ఇండిపెండెంట్‌గానే బ‌త‌కాల‌ని చిన్మ‌యి అన్నారు. సోష‌ల్ మీడియాలో ఆడ‌పిల్ల‌లు అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డం, ఫొటో పెట్టుకోవ‌డం, ఇత‌ర వ్య‌క్తుల‌తో వీడియోలు చేయ‌డం త‌ప్పు కాద‌ని అన్నారు. కానీ కొంద‌రు భార్గ‌వ్ లాంటి మ‌గాళ్లు ఫ్రెండ్ షిప్ పేరుతో అమ్మాయిల‌ను ద‌గ్గ‌ర‌గా చేసుకొని వారికి గిఫ్ట్‌లు ఇస్తూ, వారి త‌ల్లిదండ్రుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు అమ్మాయిల‌ను ప‌రిచ‌యం చేసి వారికి మ‌రింత ద‌గ్గ‌రై, వారిని లొంగ‌దీసుకునే మాట‌లు మాట్లాడుతూ ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని చెప్ప‌డం లాంటివి చేస్తున్నార‌ని అన్నారు. అలా బాలిక‌ల‌ను లొంగ దీసుకొని వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్ల‌లు సింగిల్ ఫేరెంట్ స‌మ‌క్షంలో ఎద‌గ‌డం త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌ను ఎలాగైతే పిల్ల‌లు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అని ప‌రిశీలించాల‌ని కోరుతున్నారో, అదే విధంగా సోష‌ల్‌మీడియాలో ఉండే మగ‌వారిని కూడా వారివారి త‌ల్లిదండ్రులు ప‌రిశీలించాల‌ని అన్నారు. ఎంతో మంది ఆడ‌పిల్ల‌లు సోష‌ల్ మీడియాలో భార్గ‌వ్ లాంటి వారి చేష్ట‌ల‌కు, మాట‌ల‌కు ప‌డిపోయి న‌మ్మిన మ‌నిషే క‌దా! అని త‌ల్లిదండ్రుల‌కు చెప్పుకోకుండా మోస‌పోతున్నార‌ని అన్నారు. ఇలా ఆడ‌పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకునే కామ‌పిశాచుల‌ ప‌ట్ల ఆడ‌పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Share link

Leave a Comment