the corporate sector :కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
మంచి రోజులు రానున్నాయి అన్నాడు ప్రధాని మోడీ!!
తనకేనేమో అనుకున్నారు శ్రామిక ప్రజలు!
కార్పొరేట్ సంస్థలు అని మోడీ చేతలు నిరూపించాయి!
ప్రధాని మోడీ ఎర్రకోట దగ్గర జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు..మనికీభాత్ అంటూ.. మాట్లాడినప్పుడు ‘నేను ప్రధాన మంత్రి హోదాలో మాట్లాడటం లేదు. దేశానికి మొదటి సేవకుడిగా మాట్లాడుతున్నాను.’ అని ప్రజలు ఇంకెంత మాత్రమూ పొరపడనవసరం లేదని ప్రజలకు జాతిపిత మహాత్మాగాంధీ లెవల్ లో చెప్పేవారు. కానీ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకే తాను ప్రథమ సేవకుడినని తన చేతల ద్వారా తిరుగు లేకుండా నిరూపించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర కేబినెట్ అత్యంత త్వరితగతిన ఆమోదించిన కార్మిక చట్టాల సవరణలు అతడింకెంత మాత్రము’ ఛాయ్ వాలా’ల ప్రతినిధి కాదనీ, ‘దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధి(the corporate sector’ మాత్రమేనని నిరూపించాయి ఇది వాస్తవం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేసిన కార్మిక చట్టాలు దేశంలో నూటికి పదుల సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు వర్తించడమే లేదని కార్మిక వర్గం ఎప్పటి నుండో గగ్గోలు చేస్తున్నది. ఇవాళ దేశంలోని బడా పెట్టుబడిదారులు కూడా ఇదే మాట అంటున్నారు. అయితే, వాళ్ల వాదన ఏమిటంటే నూటికి 90 మందికి వర్తించని చట్టాలను నూటికి 10 మందికి ఉన్న మైనార్టీకి వర్తింపచేయడం అన్యాయం కాదా? అని, ‘అప్రజాస్వామికం’, ‘నిరంకుశం కాదా?’ అని మైనార్టీకే వర్తిస్తున్న చట్టాలను మైనారిటీకి కూడా వర్తింప చేయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
మైనార్టీ కార్మిక చట్టాల అమలు ఏది?
మైనారిటీ కార్మికవర్గానికి వర్తించే చట్టాలు కూడా వారిలో అత్యధికులకు అమలు కావడం లేదనీ, చట్టాలలోని, అత్యధిక భాగం ఆచరణలో అమలు కావడం లేదని కార్మికవర్గం ఫిర్యాదు చేస్తున్నది. ఫ్యాక్టరీల చట్టంలో అత్యధిక భాగం కార్మికుల భద్రత గురించీ, పాటించాల్సిన పరిశుభ్రత చర్యల గురించీ, కార్మికులకు కల్పించబడవలిసిన కనీస సౌకర్యాల గురించి వివరిస్తుంది. కానీ, వీటిని అత్యధిక శాతం యాజమాన్యాలు అమలు చేయవు. అందుచేతనే, దేశంలో పెద్ద యెత్తున పారిశ్రామిక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ సంఖ్యలో కార్మికులు మరణించడం, అంగవైకల్యం కావడం చూస్తున్నాం. యూనియన్లు కార్బైడ్ ప్రమాదం, శివకాశిలో పదులు, వందల సంఖ్యలో ముక్కు పచ్చలారని పిల్లలను బలి తీసుకుంటున్న ప్రమాదాలు, గనులలో నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలు, భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణ సందర్భంగా జరుగుతున్న ప్రమాదాలు మనం రోజూ వింటున్నవే) అత్యధిక ఫ్యాక్టరీలు, మిల్లులు, షాపులు, సంస్థలలో 8 గంటల పనిదినం కానీ, కానీస వేతనాలు కానీ, ఓవర్ టైం రేటు కానీ, శెలువు, ప్రావిడెంటు ఫండ్, బోనస్, గ్రాడ్యూయిటీ లాంటి సౌకర్యాలు కానీ అమలు కావడం లేదు. కార్మికులకు నియామక పత్రాలు కానీ, గుర్తింపు కార్డులు కానీ యాజమన్యాలు ఇవ్వడం లేదు. కార్మికుల గురించి నిర్వహించాల్సిన హాజరు రిజిస్టర్లు కానీ, వేతనాల చెల్లింపు రిజిష్టర్లు కానీ నిర్వహించడమే లేదు.
బీడీ కార్మకుల పరిస్థితి దయనీయం!
బీడీ మరియు చుట్ట కార్మికుల చట్టాన్నే ఉదాహరణకు తీసుకుంటే, ఈ చట్టంలోని ఎక్కువ భాగం బీడి ఖార్ఖానాల నిర్మాణం పరిశుభ్రత ఎలా ఉండాలి? మహిళా కార్మికుల పిల్లలను చూసుకోవడానికి సంరక్షణ శాలలు, శిక్షణ పొందిన ఆయాలు, వారికి అందుబాటు చేయాయాల్సిన ఆహారం గురించి విస్తారంగా రాశారు. కానీ, ఈ చట్టం వచ్చినప్పటి నుంచి బీడీ ఫ్యాక్టరీ యజమానులు కార్మికుల చేత ఖార్ఖానాలలో పనిచేయించ డమే మానేశారు. ఇప్పుడు నూటికి 99 మంది కార్మికులు తమ, తమ ఇళ్లలోనే పనిచేస్తున్నారు. మహిళా బీడీ కార్మికులకు గర్భిణీ సమయంలో మూడు నెలల వేతనం తో కూడిన సెలవు ఇవ్వాలని ఈ చట్టంలో నిర్ధేశించబడింది. ఈ చట్టం వర్తింప చేయబడి అనేక సంత్సరాలు గడుస్తున్నా.. మన రాష్ట్రంలో ఒక్క కార్మికురాలికి కూడా అమలు చేసింది లేదు.
1970లో కాంట్రాక్టు కార్మికుల చట్టాన్ని చేశారు. ప్రభుత్వ రంగంలోని, ప్రయివేటు రంగంలోని యాజమాన్యాలన్నీ పోటీ పడి ఈ చట్టాన్ని ఉల్లంఘించి, బరి తెగించి భారీ ఎత్తున కాంట్రాక్టు కార్మికులను నియమించుకుంటున్నాయి. పట్టించుఉనే అధికారులే లేరు. కోర్టులు కార్మికులకు వ్యతిరేకంగానే తీర్పులిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట అనుకూలంగా తీర్పు వచ్చినా, అమలు చేసే నాధుడే లేడు.
బహుళ జాతి కంపెనీల రాజ్యమేలుతున్న ఆటో ఉత్పత్తి రంగం(బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, తయారీ రంగం) దీంతో పాటు పట్టణాలు, నగరాలు శుభ్రపరిచే పారిశుధ్య రంగంలో ఈ చట్టాన్ని ఉల్లంఘించి, కాంట్రాక్టు కార్మికులను మెజార్టీ సంఖ్యలో నియమించుకోవడం వల్ల, యూనియన్ నిర్మాణ హక్కును కాలరాయడం వల్ల కార్మికులు అన్ని నిర్భంధాలను ఎదుర్కొని సమరశీల పోరాటాలకు విజృంభించడం చూస్తున్నామనడంలో అతిశయోక్తి లేదు.
కార్మిక చట్టాలు కనీసంగా కూడా అమలు చేయబడిన కారణంగా అస్సాం, బెంగాల్ లోని తేయాకు తోటల కార్మికులు, తమిళనాడులోని తిర్పూరు బట్టల మిల్లుల కార్మికులు, నిత్యం వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరిన్ని వందల మంది తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసంఘటిత రంగం మున్సిపల్ కార్మికులు ఘోరమైన ప్రమాదాల బారినపడుతున్నారు. లక్షల సంఖ్యలో ఆకలి చావులకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు.
యజమాని నిరంకుశానికి బుద్ధి చెప్పే చట్టం ఏది?
కార్మికుల పనిభద్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దశాబ్ధాల తరబడి పనిచేసిన తర్వాత కూడా, యజమానికి ఏ క్షణంలోనైనా కోపం వచ్చినా, ఉద్యోగానికి నీళ్లొదులు కోవాల్సిందే. యజమాని నిరంకుశంగా పని నుండి తొలగించకుండా అడ్డుకునే ఏ చట్ట నిబంధనా ఇంత వరకూ ఏ కార్మిక చట్టంలోనూ లేదు. పని పోగొట్టుకోవడమే కాకుండా, వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కార్మికుడు దశాబ్ధాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది సామాన్య కార్మికులెవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. యజమాని చట్టాలను ఉల్లంఘించారని నిరూపించడమే కష్టం, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కార్మికుడు నిరూపించినా, కార్మిక చట్టాలలో ఉల్లంఘనలకున్న శిక్షలు, జరిమానాలు నామ మాత్రమే.
కార్మిక చట్టాలు కంటి తుడుపు కోసమే ఉన్నాయనీ వాటికి కోరల లేవనీ,అమలు జరగడం లేదనీ కార్మికులు ఆవేదనతో ఆందోళన చేస్తున్నారు. కార్మిక శాఖ, యంత్రాంగం యజమానుల శాఖగానే పనిచేస్తున్నదనేది అందరికీ తెలిసి యదార్థం. ఈ శాఖలో ఏ అధికారైనా కార్మికులకు అనుకూలంగా వ్యవహరిస్తే, చట్టాల అమలకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే, అతడు శంకర గిరి మాన్యాలు పట్టి పోవాల్సిందేనేది అనుభవం.
కార్మిక చట్టాలలో అనేక అంశాలు అస్పష్టంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సామాన్య కార్మికులెవరికీ అర్థం కాని భాషలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ సులభతరం చేయాల్సిన అవసరముంది. సందిగ్ధతలన్నింటినీ తొలగించాల్సిన అవసరముంది. అమలుకు యోగ్యంగా చేయాల్సిన అవసరమూ ఉంది కార్మికులకు అనుకూలంగా మెరుగుపర్చాల్సిన అవసరమూ ఉంది. దేశంలోని కార్మిక సంఘాలు ఈ చట్టాలలో చేయవల్సిన మార్పులు గురించి అనేక ప్రతిపాదనలను ఎప్పటి నుండో చేస్తున్నా పట్టించుకున్న వారు లేరు.
ఆ రెండు ప్రభుత్వాలూ చిన్నచూపే!
ఒక వైపు వాస్తవాలు ఇలా ఉంటే, దేశ, విదేశీ పెట్టుబడిదారులు దేశంలోని వారి వకాల్తా దారులు చాలా కాలంగా కార్మిక చట్టాల గురించి బీద ఏడ్పులు ఏడుస్తున్నారు. గతంలోని యూపీఏ ప్రభుత్వ మంత్రులు, ప్రధాన మంత్రి, ప్రస్తుత ఎన్డీఏ మంత్రులు ప్రధాన మంత్రి కార్మిక చట్టాల నిరంకుశ స్వభావం గురిం,ఈ వాటి వల్ల యజమానులు పడుతున్న అంతులేని బాధల గురించి కడవల కొద్ది కన్నీరు కార్చడం చాలా కాలం నుండి చూస్తున్నాం. యజమానులు, తమ కార్మికులను ఇష్టానుసారంగా తొలగించడానికి, తమ ఫ్యాక్టరీలను ఇష్టారాజ్యంగానో, తాత్కాలికంగానో, శాశ్వతంగానో మూసివేసి కార్మికులను బ్లాక్ మెయిల్ చేయడానికి పారిశ్రామిక వివాదాల చట్టంలోని చాప్టర్ 5-బి ఆటంకాలు కల్పిస్తున్నది. ఫ్యాక్టరీల చట్టం కార్మికులకు కొన్ని భద్రతా చర్యలనూ, 8 గంటల పని దినాల్నీ, కార్మికులతో చేయించుకో గల్గిన ఓవర్ టైం పనిపైనా కొన్ని ఆంక్షలను పిల్లలతో పనిచేయించుకోవడం పైనా, మహిళలతో రాత్రి పూట పనిచేయించుకోవడం పైనా నిషేధాన్ని నిర్ధేశిస్తున్నది.


కాంట్రాక్టు కార్మిక (నిషేధం నియంత్రణ) చట్టం
కార్మికులను ఏ హక్కులు లేని కట్టు బానిసలు చేయడాన్ని నిషేధించటమో, నియంత్రించటమో చేస్తున్నది. కార్మిక చట్టాలను అమలు చేయడానికి కార్మిక యంత్రాంగాన్ని, వారికి తనిఖీలు చేసి అమలు చేయించే అధికారాలనూ కార్మిక చట్టాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం సవరణల ద్వారా ఈ చట్టబద్ధ హక్కులన్నింటినీ కాలరాసి వేయాలని మోడీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఆ విధంగా మన దేశ కార్మిక వర్గం, ప్రపంచ కార్మిక వర్గం వీరోచిత పోరాటాల ద్వారా, అశేష త్యాగాల ద్వారా సాధించుకున్న చట్టబద్ధ హక్కులన్నింటికీ సమాధి కట్టే దుస్సాహాసానికి మోడీ ప్రభుత్వం ఒడిగడుస్తున్నది.
కార్మిక చట్టాలను అటకెక్కంచనిదే విదేశీ పెట్టుబడులు రావట! చైనాలో వేతనాలు పెరుగుతున్నాయట! మనం తక్కువ వేతనాలతోనూ, తక్కువ సౌకర్యాలతోనూ ఎక్కువ గంటలు మాన కార్మికులతో పనిచేయించు కుంటే, ప్రపంచమంతా మనమే సరుకులను ఎగుమతి చేయొచ్చట!. మన కార్మికుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ నిధులను కూడా తమ పెట్టుబడులుగా మార్చుకొని, మన కార్పొరేట్ సంస్థలు గరిష్ట లాభాలు సంపాదించుకొని ప్రపంచ ధనికులలో అగ్రగాముల జాబితా వెలు గొందుతుంటే, మనం గర్వంగా కాలరెగరేసుకోవాలట!. మన కార్మికుల నిజవే తనాలు రోజురోజుకూ ఘననీయంగా పడిపోతున్నాయనీ, ఫ్యాక్టరీ ఉత్పత్తి విలువలో కార్మికుల వేతనాల భాగం పడిపోతున్నదనీ సృష్టించబడుతున్నదనపు విలువలో కార్మికులు పొందే భాగం తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దారిద్య్రం, నిరుద్యోగం ఆదాయ అంతరాలు పెరిగిపోతున్నాయనీ, మానవాభివృద్ధి సూచికలో మనం ప్రపంచంలో 135వ స్థానంలో ఉన్నామని లోకం కోడై కూస్తున్నా మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదు.
గుణపాఠాలు నేర్చుకోనిదే మంచి రోజులుండవు!
చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోని వారెవ్వరికీ మంచి రోజులుండవు. 2009 నుండే భారత కార్మిక వర్గం దేశంలోని ప్రధాన కార్మిక సంఘాల నాయకత్వంలో పది డిమాండ్లను ముందుకు పెడుతూ వచ్చింది. కాంట్రాక్టు కార్మిక విధానం రద్ధు, 21 వేల రూపాయల కనీస వేతనం, నిత్యావసర సరుకుల ధరల అదుపు,
ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల అమ్మకం నిలుపుదల, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు, మొదలైన డిమాండ్లు వీటిలో ఉన్నాయి. ఈ డిమాండ్ల అమలును కోరుతూ అనేక సదస్సలు, భారీ ప్రదర్శనలు, అనేక దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరిగాయి. అయినా గతంలోని యూపీఏ ప్రభుత్వానికి కానీ, ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి కానీ, కార్మికుల డిమాండ్ల మీద ఎలాంటి పట్టింపు లేదు.
మోడీ ఫలితాన్ని తప్పక చవిచూడాల్సిందే!
‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ గానే ఈ రెండు ప్రభుత్వాలు వ్యవహరించాయి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం మరొకడుగు ముందుకు వేసి, కార్మికులు కోరుతున్న దానికి వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను నీరు గార్చడానికి పూనుకొని 44 చట్టాలను సమూలంగా మార్చి 4 కోడ్లుగా తయారు చేసింది. కార్మిక హక్కులకు భంగం కలిగించినందుకు మోడీ ఫలితాన్ని అనుభవించక తప్పదు.
‘పిల్లిని ఒక గదిలో బంధిస్తే అది ఎదురు తిరగక మానదు’ అనే సత్యం అందరికీ తెలిసిందే. యావత్ కార్మిక వర్గ పోరాటమే ఇందుకు సజీవ ఉదాహరణ. కరోనా మాటున మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటంలో అగ్రగ్రామి పాత్ర నిర్వహిస్తున్నారు. తమ స్వంత యూనియన్ హక్కు కోసం, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయడం కోసం, గౌరవనీయమైన వేతనాల కోసం అన్ని వేధింపులనూ,


అణచివేతలనూ, నిర్భంధాలనూ ఎదుర్కొని విజయవంతంగా సాగిస్తున్న పోరాటాలు, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగానూ, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానూ, అ సంఘటిత, సంఘటిత రంగంలో కార్మికులందరినీ ఐక్యం చేస్తూ, పర్మినెంట్లు, కాంట్రాక్టు కార్మకులను ఐక్యం చేస్తూ ఇతర రంగాల కార్మికులు, శ్రామికులందరి సంఘీభావాన్ని కూడగట్టుకుని సాగిస్తున్న సమరశీల పోరాటాలు, దేశంలోని కార్మిక వర్గం మంతటికీ ఆదర్శప్రాయమైన పోరాటాలుగా దిశానిర్ధేశం చేసే పోరాటాలు సమస్త కార్మిక వర్గం ఈ దిశలోనే సాగి భారత కార్పొరేట్ సంస్థలకు, దోపిడీ పాలక వర్గాలకు గుణపాఠం నేర్పుతుందని ఆశిద్ధాం.
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?