The Angry Man: గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర, సత్యరాజనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ, యజమాని మెప్పుపొందాడు. అయితే, సత్యరాజుకు కాస్త కోపం (The Angry Man) ఎక్కవ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్లు బేరమాడుతూ విసిగిస్తే, వెళ్లండి, వెళ్లండి! మీరేంక కొంటారు, అంటూ కసురుకునేవాడు.
The Angry Man: తెలుగు స్టోరీ!
కొనడానికి వచ్చినవాళ్లను ఇలా కసురుకోవడం కోప్పడటం లాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కానీ, సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు. ఒక రోజు, ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పనిమనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడటంతో, వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలూ అని పోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం, సత్యరాజును పనిలోంచి తీసివేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు రెండు రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి, తనను పనిలో తీసుకోమని బతిమాలడం మొదలు పెట్టాడు.
అయితే గంగాదరం, అతడు చెప్పేది వినిపించుకోకుండా, ఏయ్, చెప్తూంటే మనిషివి కాదూ వెళ్లు, పో!..అంటూ అరిచాడు. గంగాధరం తనను కుక్కను అదిలించినట్టుగా కరకుగా మాట్లాడటంతో, సత్యరాజు(The Angry Man) మనసు కలుక్కుమన్నది. అతడు కళ్లల్లో నీళ్లు తిరుగుతూండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధరం అతణ్ణి, ఓరేయ్, ఇలారా! అంటూ పిలిచాడు. సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా, గౌరవంగా మాట్లడకుండా కసురుకుంటే, ఆ మనిషి ఎంత బాధపడతాడో! అన్నాడు సౌమ్యంగా.
నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలాగుంటుందో తెలిసి వచ్చింది, బాబూ! అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు, అన్నాడు గంగాధరం శాంతంగా.