Academic Year : ఏడాదంతా పుస్తకం తెరిస్తే ఒట్టు! వ‌చ్చే ఏడాదైనా కొన‌సాగేనా?

Special Stories

Academic Year : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి పిల్ల‌ల‌కు చ‌దువు దూర‌మ‌య్యింది. స‌రిగ్గా పాఠ‌శాల‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెలకొంది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఏ ఒక్క త‌ర‌గ‌తి కూడా పిల్ల‌లు పూర్తి చేసిన దాఖ‌లాలు లేవు. ఈ ఏడాది కూడా అంతే ముగిసిపోయింది.


Academic Year: క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కి ఈ ఏడాది కూడా ఇంతే ముగిసింది. గ‌తేడాది మార్చి నెల‌లో మూత‌బ‌డ్డ బ‌డులు ఇప్ప‌టి వ‌ర‌కూ తెరుచుకున్న‌ది లేదు. ఏక‌బిగువునా సుమారు 15 నెల‌ల పాటు బ‌డి పిల్ల‌ల‌తో పాటు క‌ళాశాల విద్యార్థులు సైతం చ‌దువుల‌కు దూర‌మ‌య్యారు. ఇక ఈ విద్యా సంవ‌త్స‌రం కూడా బ‌డులు సాగ‌బోవ‌ని ప్ర‌భుత్వం చెబుతూనే ఉంది. దీంతో చ‌దువులు సంగ‌తే అంతుప‌ట్ట‌కుండా ఉంది. ఇక ఈ ఏడాది పాఠ‌శాల విద్య‌లో భాగంగా 8,9,10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు ఈ నెల 16వ తేదీ ను ండి ఆన్‌లైన్ క్లాసు(online class)లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఆ రోజు నుండే ఉపాధ్యాయుల‌ను కూడా బ‌డుల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాల‌ను సైతం జారీ చేశారు. ఆ దిశ‌గా పాఠ‌శాల‌ల‌ను కూడా సిద్ధం చేసుకోవాల‌ని యాజ‌మాన్యాల‌కు చెప్పారు. జూలై నాటికి క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డితే రోజు విడిచి రోజు నేరుగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించే అవ‌కాశాల‌ను సైతం ప‌రిశీలి స్తున్నారు. చిన్న పిల్ల‌ల‌కు క‌రోనా సోకే ప్ర‌మాదం ఉండ‌టంతో అటు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే పిల్ల‌ల ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై సూచ‌న‌లు జారీ చేసింది. భ‌విష్య‌త్తులో దుష్ఫ‌రిణామాలు ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌నే ఉద్ధేశ్యంతో ఈ విద్యా సంవ‌త్స‌రాన్ని తొలివిడత‌గా పై త‌ర‌గ‌తులు వారికి ఆన్‌లైన్‌(online class)లో ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసింది.

చ‌దువుల ప‌ట్ల ఆస‌క్తి త‌గ్గిందా?

సుమారు 15 నెల‌ల పాటు బ‌డులు లేక‌పోవ‌డంతో చిన్నారుల‌కు చ‌దువుల ప‌ట్ల ఆస‌క్తి త‌గ్గిపోయింది. ఈ విష‌యంలో గ్రామీణ ప్రాంతాలు మొద‌టి వ‌రుస‌లో ఉన్నాయి. గ‌తేడాది వ‌ర్షాకాలం స‌మ‌యంలో కూడా ఇళ్ల‌లోనే ఉన్న పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌తో పాటు పొలం బాట ప‌ట్టారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంత విద్యార్థులు పుస్త‌కాలు తెరిచిందే లేదు. అక్ష‌రాలు చ‌ద‌విందే లేదు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థులు త‌ప్ప ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు విన్న ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివే విద్యార్థులు త‌క్కువే. ఇప్ప‌టికి కూడా బ‌డులు తెరిచేందుకు అనుకూల వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. దీంతో విద్యావ్య‌వ‌స్థ స‌మూల నాశ‌నం అవుతోంద‌ని విద్యావేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దారి త‌ప్పిన ఆన్‌లైన్ విద్యావిధానం!

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఆన్‌లైన్ విద్యావిధానం ఆదిలోనే దారి త‌ప్పింది. పాఠాలు వింటున్న వారి వివ‌రాలు ఎప్ప‌టి క‌ప్పుడు డిఇఓ కార్యాల‌యానికి చేర‌వేయాల‌ని ఇచ్చిన ఆదేశాలు బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. క‌నీసం 10 శాతం మంది విద్యార్థులు కూడా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు విన్న‌ది లేదు. కానీ ఎంఈఓలు మాత్రం 80 శాతం, 90 శాతం మంది హాజ‌రయ్యారంటూ త‌ప్పుడు లెక్క‌ల‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేశారు. ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కూడా పెద్ద భారంగా మారింది. మ‌రో ప్ర‌క్క గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లు లేక‌, ఉన్న‌ప్ప‌టికీ సిగ్న‌ల్ అంద‌క‌, ఇంట్లో ఒక్క‌టే ఫోన్ ఉండ‌టంతో ఇంటి పెద్ద దానిని తీసుకుని బ‌య‌ట‌కు వెళితే పిల్ల‌లు టివిల‌కు ప‌రిమితం అయ్యే ప‌రిస్థితి ఎదురైంది. మ‌రి ఇక ఈ ఏడాది సంగ‌తేంటో అంతుప‌ట్ట‌కుండా ఉంది.

దిగ‌జారిన ప్ర‌మాణాలు!

ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివే పేద విద్యార్థులు చ‌దివేది అంతంత మాత్ర‌మే. త‌ల్లిదండ్రులు కూలీ నాలి కోసం బ‌య‌ట‌కు పోయి పొద్దుపోయిన త‌ర్వాత గానీ ఇళ్ల‌కు చేర‌రు. ఇక బ‌డుల‌కు వెళ్లి వ‌చ్చిన విద్యార్థులు ఇంటికి రాగానే పుస్త‌కాల సంచుల‌ను విసిరేసి ఆట‌పాట‌ల్లో నిమ‌గ్నం అవుతుంటారు. వారిని చ‌ద‌వ‌మ‌నే వారు ఉండ‌రు. దీంతో వీరిలో విద్యాప్ర‌మాణాలు అంతంత మాత్ర‌మే. బ‌డులు క్ర‌మంగా న‌డిచిన రోజుల్లోనూ తెలుగు కూడా స‌రిగా చ‌ద‌వ‌డం రాని పిల్ల‌లు ఉన్నారు. ఇక ఇంగ్లీష్‌, హిందీ, లెక్క‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఇప్పుడు ఆ కాస్త కూడా గాడి త‌ప్పింది. 7వ త‌ర‌గ‌తి విద్యార్థుల్లో క‌నీసం 10 వ‌ర‌కు ఎక్కాలు వ‌చ్చిన వారు త‌క్కువే. హిందీ, ఇంగ్లీష్ కూడ‌బ‌లుకుని కూడా చ‌ద‌వ‌లేక‌పోతున్నారు. దీంతో విద్యాప్ర‌మాణాలు క్ర‌మంగా దిగ‌జారిపోతున్నాయి. వీరిని పై త‌ర‌గుతుల‌కు పంపుతున్న‌ప్ప‌టికీ రాబోయే రోజుల్లో చ‌దువులు సాగించ‌లేక మ‌ధ్య‌లోనే ఆపేసే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

-సేక‌ర‌ణ ప్ర‌జాప‌క్షం(భ‌ద్రాచ‌లం).

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *