Telugu Poems 2022 | మన చిన్నప్పుడు ఎన్నో బాలగేయాలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లం. అంతే కాకుండా అమ్మమ్మో, తాతయ్యో, నాయనమ్మో ఎంచక్కా పాటలు పాడుతూ, కథలు చెబుతూ నిద్ర పోయేలా చేసేవారు. మన అమ్మ వెన్నెల్లో చందమామను చూపిస్తూ అన్నం తినిపించేది. ఇవన్నీ గుర్తుకు వస్తే ఆ మధుర క్షణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. కానీ టెక్నాలజీ కాలం వచ్చిన తర్వాత మనకు ఫోన్ తప్ప మరేదీ తెలియకుండా పోయింది. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరూ ఫోన్లోనే మొఖం పెట్టి కాలం వెళ్లబుచ్చుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లలకు ఈ బాలగేయాలు వినిపించండి. పాడండి.. ఆడిపించండి!
బాలగేయాలు
1)పూవులమ్మ పూవులు
విరబూసిన నవ్వులు
రకరకాల పూవులు
రంగురంగుల పూవులు
పాలనురగ తెల్లన
పాడి ఆవు తెల్లన
మంచి మనసు తెల్లన
మల్లెపూవు తెల్లన
తోటలోన వెలుగులు
బంతులు, చేమంతులు
మన కంటికి వెలుగులు
జాజులు, కనకాంబరాలు
చాచా నెహ్రు ప్రేమలు
చలాకీ గులాబీలు
అందమైన బాలలు
మందారపు పూవులు
జడనిండా పూవులు
మెడనిండా పూదండలు
సైనిక బలగాల పాద
పూజకొరకే పూవులు
2) చిన్ని చిన్ని మొక్కలం
చిగురించే రెమ్మలం
పుష్పించే పువ్వులం
పరిమళించే మల్లెలం
ఆటలతో పాటలతో
గెలిచి తీరే పొప్పొడులం
పలక, బలపం లేకనె
బడికి వెళ్లి చదివెదం
కృత్యాలతో కుస్తీ పట్టి
ప్రగతిదారులు వెతుకుదాం!
కల్లా కపటం తెలియక
కలిసి మెలిసి తిరిగెదం
బాలవాక్కు బ్రహ్మ వాక్కు
అన్న మాట నిజం చేసి
కన్న తల్లిదండ్రులకు
చదువు చెప్పె గురువులకు
మంచి పేరు తెచ్చెదం
మమత కలిగి మసిలెదం.
3)బడికి సెలవులు వచ్చినవి
బామ్మ ఊరికి వెళ్లితిమి
మామయ్య పిల్లల చేరితిమి
బంధువులెందరినో కలిసితిమి
ఆరు బయటకు పోయితిమి
ఆటలు, పాటల గడిపితిమి
చెరువు చెంతకు చేరితిమి
చేపలు, పీతలు చూచితిమి
ఈత కొట్టుచు ఎగిరితిమి
ఈలలు, కేరింతలు కొట్టితిమి
చెట్టూ చేమా తిరిగితిమి
ప్రకృతి వింతలు చూచితిమి
తోటలు, పొలముల కెళ్లితిమి
పుల పుష్పములు తెంపితిమి
వెన్నల రాత్రులు కాంచితిమి
అమ్మమ్మ పక్కన చేరితిమి
కథలు, వింతలు చెప్పితిమి
సెలవులు హాయిగా గడిపితిమి
తిరిగి ఊర్లకు చేరితిమి!
గడుసు పిల్లి
4)పొద్దునే లేచింది గడుసు పిల్లి
కాళ్లు మొహం కడిగింది గడుసు పిల్లి
పగలంత తిరిగింది గడుసు పిల్లి
పాలు మీగడ మెక్కింది గడుసు పిల్లి
రేయి అటక ఎక్కింది గడుసు పిల్లి
ఎలుక కోసం కలగంది గడుసు పిల్లి.
ఆరోగ్యం-ఆనందం
5) ఆరోగ్యం ఆనందం అందరికీ కావాలి
ఓ గృహిణీ యత్నించు అదినీకే సాధ్యం!
బియ్యపు పొరలో విటమిన్- బి అధికం
పాలిష్ పెడితే అది కాస్తా శూన్యం
బియ్యం కొద్దిగా కడిగితే చాలు
గంజి వార్చక వండితేమేలు //ఆ//
కూరగాయలు తరిగి కడగకు
కడిగి తరిగితే విటమినులు దొరుకు
ఆకుకూరలు ఎన్నడు వదలకు
తాజా పండ్లను వాడుట మరువకు //ఆ//
ప్రోటీనులకై పప్పులను మెండుగా వాడండి
ఎముకల గట్టికి చిక్కని పాలని తాగండి
జీర్ణశక్తికి ఉల్లిపాయలు వదలొద్దు
నేత్ర రక్షణకు క్యారెటు నెప్పుడు మరువొద్దు //ఆ//
6) ఆదివారం నాడు అరటి మొలచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పొట్టిగెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు చూడగా పండింది
శనివారం నాడు చక చకా గెలకోసి
అందరికీ పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో
7) చందమామ రావే – జాబిల్లి రావే!
కొండెక్కి రావే – గోగుపూలు తేవే
బండిమీద రావే – బంతి పూలు తేవే
పల్లకిలో రావే – పంచదార తేవే
సైకిలెక్కి రావే – చాక్లెట్లు తేవే
పడవ మీద రావే – పట్టు తేనే తేవే
పెందలాడ రావే- పాలు పెరుగు తేవే
మంచి మనసుతో రావే – ముద్దులిచ్చి పోవే
అన్నియును తేవే – మా అబ్బాయి కీయవె.
8) బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగని చేత మొట్టికాయ తింటానన్నది
9) పొద్దున మనము లేవాలి
పళ్లను బాగా తోమాలి
గ్లాసెడు పాలూ తాగాలి
మంచిగ స్నానం చేయాలి
తలను నున్నగా దువ్వాలి
ఉతికిన బట్టలు కట్టాలి
ఛలో ఛలోమని పోవాలి
గురువుకు దణ్ణం పెట్టాలి
బడిలో చక్కగ చదవాలి
అమ్మా, నాన్నా మెచ్చాలి
అందరు భేషని పొగడాలి!
10) గంధం మెడకూ పూసుకొని
పసుపూ కుంకుం రాసుకొని
కంటికి కాటుక పెట్టుకొని
ఆడవె ఆడవె అమ్మణ్ణి!
పువ్వులు తలలో ముడుచుకొని
తిలకం నుదుటా దిద్దుకొని
బుగ్గను చుక్కా పెట్టుకొని
ఆడవె ఆడవె అమ్మణ్ణి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!