Telugu Love Story | Love Stories in Telugu | చిగురించిన ప్రేమ చివరికి ఏమైంది?లవ్ స్టోరీlatest telugu love storys”జీవిత… నీ కోసం వెతకని రోజంటూ లేదు. నీ ఫోన్ నెంబర్‌కు కాల్ చేయని క్షణం లేదు. నీ స్నేహితులను అడిగినా సమాధానం లేదు. ఎక్కడున్నావో తెలియదు. అసలు మళ్లీ కాంటాక్టులోకి వస్తావో లేదో కూడా తెలియక నాలో నేనే ప్రతి రోజూ కుమిలిపోతున్నా. ఒంటరి వాడినైన. చచ్చిపోవాలనిపించింది. కానీ ఆ ధైర్యం నాకు లేదు. నా ప్రేమపై నాకు నమ్మకం ఉంది. ఎక్కడో ఒక చోట నువ్వు కనిపించవా? తప్పకుండా కనిపిస్తావనే నమ్మకంతోనే ఇన్ని రోజులు బత్రుకుతున్నా.చివరికి ఇప్పుడు కాంటాక్టులోకి వచ్చావు. నా మనస్సు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడకు వెళ్లావు? ఏమైపోయావు. ఫోన్ స్విచ్ఛాఫ్ ఎందుకు వస్తుంది?” ..అసలు కథ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది.
అతని పేరు విగ్నేష్. పల్లెటూరులో పుట్టాడు. పై చదువులకు పట్టణం వచ్చాడు. ఇంజనీరింగ్ కోసం ఒక ప్రైవేటు కాలేజీలో చేరాడు. అతని క్లాస్‌లో జీవిత అనే అమ్మాయి పరిచయం అయ్యింది. తొలి పరిచయంలోనే అందంగా, సంతోషంగా కనిపించిన ఆ అమ్మాయిపై విగ్నేష్ మనస్సులో ఎక్కడో ప్రేమ పుట్టింది. కానీ అప్పుడేగా పరిచయం, తనలో తానే సంతోషంగా ఫీలయ్యాడు. వాస్తవానికి ఆ అమ్మాయి జీవితది ఆ పట్టణంలోని ఒక కాలనీ. గుణవంతురాలు, సాదాసీదాగా కనిపించే అందమైన అమ్మాయి. తనది ఒక మధ్య తరగతి కుటుంబం. ప్రతి రోజూ కాలేజీ బస్సులో కాలేజీకి వచ్చేది. విగ్నేష్ తనతో పాటు ఇంటర్ పూర్తి చేసిన ఇద్దరు స్నేహితులతో పాటు, కాలేజీలో పరిచయం అయిన మరొక్క స్నేహితుడితో కలిసి పట్టణంలోనే ఒక రూం అద్దెకు ఉంటున్నారు. విగ్నేష్ తండ్రి ఊరిలో వ్యవసాయం చేస్తుంటాడు. అటు మధ్య తరగతి రైతు కాదు. ఇటు పెద్ద రైతు కాదు. విగ్నేష్ తో పాటు ఒక చెల్లెలు కూడా ఉంది. పట్టణంలో చదువుకుంటున్న విగ్నేష్ అందరి అబ్బాయిల్లానే అల్లరి చేష్టలు కలిగి హుషారైన వాడే కానీ, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. చదువులో ముందుండే వాడు. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఆశ అతనిలో ఉండేది.
విగ్నేష్, జీవిత ప్రతి రోజూ కాలేజీలో పలకరించుకునేవారు. వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. జీవిత అప్పుడప్పుడు తన క్యారేజీ విగ్నేష్‌కు తినమని ఇచ్చేది. ఏమైనా పచ్చళ్లు, పండుగలకు ఏమైనా చేసిన తినుబండారాలు విగ్నేష్‌కు ఇచ్చేది. అలా చదువు కొనసాగుతూనే ఉంది. వారి స్నేహం కాస్త ప్రేమగా మారుతున్న క్షణాలు ప్రారంభమయ్యాయి. కాలేజీలో జరిగే ఒక ఫంక్షన్‌కు జీవిత పట్టు లంగా, ఓణి వేసుకొని వచ్చింది. ఆ క్షణం జీవితను చూసిన విగ్నేష్ తన ప్రేమను చెప్పకపోతే ఈ లోపు మరెవరైనా చెబుతారేమో అనుకున్నాడు. ఒక వేళ చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో భయం. ఒక పక్క ఫంక్షన్ జరుగుతోంది. డ్యాన్సులు వేస్తున్నారు. అందరూ కేరింతలు పెడుతున్నారు. కానీ విగ్నేష్ మనస్సు మాత్రం అటు ఇటుగా జీవితపైకే కళ్లు వెళుతున్నాయి. స్నేహితుల మధ్యలో కూర్చున్న జీవిత చాలా హుషారుగా నవ్వుతూ ఎవరి కోసమో చూస్తున్నట్టు నలు దిక్కులు చూస్తుంది. దూరంగా విగ్నేష్ కనిపించాడు. కళ్లతోనే హాయ్ అన్నట్టు సైగ చేసింది. విగ్నేష్ కూడా సంతోషంగా హాయ్ అన్నట్టు చిరునవ్వు పెదవులపైనే ఉంచాడు.


ఫంక్షన్ అయిపోయింది. అందరు విద్యార్థులు సంతోషంగా ఎవరి దారి వారు వెళ్లిపోయారు. తర్వాత విగ్నేష్ కూడా కనిపించలేదు. మరుసటి రోజు క్లాసులో గడిచిన రోజు జరిగిన ఫంక్షన్లో విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంతలో క్లాస్‌కు సార్ వచ్చారు. అనంతరం మధ్యాహ్నం విగ్నేష్ రూంకు భోజనానికి వెళదామనుకున్న సమయంలో జీవిత పలకరించింది.” ఏంటి సంగతులు? అని పలకరించింది. నిన్న ఫంక్షన్లో నువ్వు బాగున్నావు.. అని పలకరించాడు. జీవిత నన్ను చూశావా? అన్నట్టు మాట్లాడింది. ఆ..చూశాను. మరి మాట్లాడలేదు. ఫంక్షన్ అయిపోయినంక మాట్లాడదామనుకున్నా విగ్నేష్ కానీ నువ్వు కనిపించలేదు..అని జీవిత చెప్పింది. అవునా? అన్నట్టు ముఖం పెట్టాడు విగ్నేష్. అయ్యో అనవసరంగా మిస్స్ అయ్యానే?”అన్నట్టు మనసులో అనుకున్నాడు.
సీన్ కట్ చేస్తే..ఇంజనీరింగ్ రెండు సంవత్సరాలు గడిచిపోయింది. విగ్నేష్, జీవితల మధ్య ఎవ్వరికీ కనిపించని ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తన ఇంటిలో చిన్న ఫంక్షన్ ఉంటే స్నేహితులను ఆహ్వానించింది జీవిత. వారితో పాటు విగ్నేష్‌ను కూడా తన స్నేహితులతో తప్పకుండా రావాలని చెప్పింది. వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలని విగ్నేష్ తన రూంమెట్స్తో కలిసి జీవిత ఇంటికి ఫంక్షన్‌కు వెళ్లారు. ఎవ్వరికీ తమ ప్రేమ తెలియదన్నట్టు విగ్నేష్ అనుకుంటున్నాడు. కానీ చెప్పకపోయినా పసిగట్టే స్నేహితులు ఉంటారుగా. వారికి ఎప్పుడో అర్థమైంది. జీవిత, విగ్నేష్ మధ్య ప్రేమ నడుస్తుందని. అందరి స్నేహితులను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది జీవిత.
అలాగే విగ్నేష్‌ను కూడా. సంతోషంగా భోజనాలు చేసి మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ ఎవరి దారి వారు వెళ్లిపోయారు. జీవిత కూడా విగ్నేష్‌ను అమితంగా ప్రేమిస్తోంది. కానీ విగ్నేష్‌కు చెప్పలేదు. ఒక రోజు కాలేజీ అయిన తర్వాత విగ్నేష్ గేటు బయటకు వచ్చాడు.
ఇంటికి వెళ్లేందుకు బస్ ఎక్కకుండా వేగంగా నడుచుకుంటూ స్నేహితులకు చిన్న పని ఉంది అంటూ గేటు బయటకు వచ్చింది. విగ్నేష్‌ని పలకరించింది. రోడ్డు మీద స్నేహితులతో నడుచుకుంటూ వెళ్లే విగ్నేష్ ఆగిపోయాడు. స్నేహితులు వెనక్కి తిరిగి చూసి వాళ్లు ముందుకు సాగారు. “నువ్వేంటి బస్ ఎక్కలేదు. బస్ లేదా?” అని జీవితను పలకరించాడు. లేదు..ఉంది.. కాదు..అంటూ నీతో కాస్త మాట్లాడాలనిపించి బస్ ఎక్కలేదు. అని జీవిత విగ్నేష్‌కు చెప్పింది. సరే అంటూ నడక ముందుకు సాగించారు.
నడక మధ్యలోనే ఏవేవో ఇద్దరు మాట్లాడుకుంటూ..సడెన్‌గా విగ్నేష్ ఐ లవ్ య్యూ అని జీవితకు చెబుతాడు. ఒక్కసారిగా నిలిచిపోయిన జీవిత. విగ్నేష్ ముఖంలోకి చూసింది. టెన్షన్ పడుతున్న విగ్నేష్‌కు ఈ సమయంలో అనవసరంగా చెప్పానేంటి అనే డైలామాలో ఉండిపోయాడు. ఏమీ స్పందించని జీవిత నవ్వుతూ ముందుకు సాగింది. కాస్త టెన్షన్‌ను వదిలేసిన విగ్నేష్ కూడా ఆమెతో కలిసి ముందుకు సాగాడు. అలా ఒక బేకరీ వద్ద ఆగి అక్కడ కొద్ది సేపు ఉండి.. జీవిత ఆటోలో ఇంటికి వెళ్లింది. పరిచయం అయిన మొదటి సంవత్సరమే ఇద్దరూ ఫోన్ నెంబర్లు తీసుకొని చాట్ చేసుకుంటున్నారు. అయితే ఆ రోజు రాత్రి కూడా చాట్ చేసింది జీవిత. తనకు ఇంకా ఏమీ సమాధానం చెప్పలేదని టెన్షన్లోనే ఉంటూ మళ్లీ చెబితే ఏమంటుందోననే భయంతో ఏదో చాట్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా 10 గంటలు అయ్యింది. జీవిత చివరి మెస్సేజ్ ఐ లవ్ య్యూ టూ అంటూ వచ్చింది. గుడ్‌నైట్ తర్వాత వచ్చిన మెస్సేజ్‌ను చూసి విగ్నేష్ ఊహల్లో తేలాడు. రేపు ఉదయాన్నే జీవితను చూడాలనే ఆరాటంలో ఉన్నాడు.
ఇక విగ్నేష్, జీవితల ప్రేమ క్లాస్ అంతా తెలిసింది. వాళ్లిద్దరూ మనస్సు ఒక్కటయ్యేంతగా ప్రేమించుకుంటున్నారు. ఈ లోపు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం వచ్చింది. ఇద్దరూ ప్రేమించుకుంటూనే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. అప్పుడప్పుడు విగ్నేష్ జీవితల ఇంటికి వెళ్లడం వాళ్ల తల్లిదండ్రులను పలకరించడంతో పరిస్థితులు ఆ తల్లిదండ్రులకు తెలిసేలా జేసింది. జీవితల, విగ్నేష్‌లు ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇంజనీరింగ్ చదువు చివరి పరీక్షలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అందరూ కాలేజీకి వీడ్కోలు పలికి వెళ్లిపోయే రోజులు వచ్చాయి. జీవిత, విగ్నేష్ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విగ్నేష్ జీవితను పలకరిస్తూ.. చదువు అయిపోయింది. నేను ఉద్యోగం ఏదైనా చేస్తాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు.
జీవితకు తనను పెళ్లి చేసుకోవాలని ఉన్నా తల్లిదండ్రులు ఏమంటారో నని ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే ఒక రోజు విగ్నేష్ జీవిత వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పలకరించాడు. అంకుల్.. నేను..నేను జీవితను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు భయంగా..భయంగా కంగారుపడుతూ. జీవిత వాళ్ల నాన్న ఒక్కసారిగా జీవితపై కోపంగా చూశాడు. జీవిత వాళ్ల నాన్న విగ్నేష్‌తో మాట్లాడుతూ చూడు బాబు మాది సాంప్రదాయ బద్ధమైన కుటుంబం. ఈ ప్రేమలు, గీమలు మా ఆడవాళ్లలో ఎవ్వరికీ లేవు. పెద్ద వాళ్లు సంబంధం తెస్తే అది చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇక నుంచి జీవితను మరిచిపో. నీ దారిన నువ్వు వెళ్లిపో…అని హెచ్చరిస్తూ సమాధానం ఇచ్చారు. నీరసంగా వెనుదిరిగిన విగ్నేష్ తిన్నగా రూంకు చేరుకున్నాడు. కొద్ది రోజులు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదువు అయిపోయింది. విగ్నేష్ ఇంటికి వెళ్లి నాలుగు రోజులు మాత్రమే ఉండి మళ్లీ రూంలోనే ఉండేదుకు నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకొని సెటిల్ అయి ఎలాగైనా జీవితను పెళ్లి చేసుకోవాలని ఆశతో ఉన్నాడు.
ఈ క్రమంలో జీవిత నుంచి ఫోన్లు లేవు. ఏమైందో తెలియదు. అయిదే రెండ్రోజుల తర్వాత జీవిత ఫ్రెండ్ విగ్నేష్‌కు ఫోన్ చేసింది. జీవితకు ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో జాయిన్ చేపించారని చెప్పింది. ఈ మాట విన్న విగ్నేష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అరే..జీవితకు ఏమైంది. చాలా హుషారుగా ఉండే అమ్మాయి సడెన్‌గా ఇలా అయిపోవడం ఏమిటని మదనపడ్డాడు. రూంలో ఉన్న స్నేహితులందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. రూంలో కేవలం విగ్నేష్ మాత్రమే ఉంటున్నాడు. జీవిత ఆసుపత్రిలో చేరిందన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎలాగైనా ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లి చూడాలనుకున్నాడు. కానీ వాళ్ల నాన్న ఏమంటాడో తెలియదు. పోనీ ఏ ఆసుపత్రో అక్కడకు వెళ్లి చూడాలనుకున్నాడు.
ఎలాగోలా తనకు తెలిసిన ఫ్రెండ్‌తో కలిసి ఆసుపత్రి పేరు కనుక్కొని అక్కడకు వెళ్లాడు. జీవిత బెడ్‌పై సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఒక పక్కకు పడుకొని ఉంది. గది దగ్గరకు వెళ్లినప్పటికీ లోపలికి వెళ్లేందుకు ధైర్యం చాలక అలానే చూస్తూ ఉండిపోయాడు. అసలు జీవితకు ఏమైంది? అనే బాధ మనుసులో మెదులాడుతుంది. అయితే ఆ గదిలో నుంచి ఒక నర్సు జీవితకు ట్రీట్మెంట్ ఇస్తూ లోపలకి, బయటకు తిరుగుతుంది.
విగ్నేష్ ఆ నర్సు దగ్గరకు వెళ్లాడు. చెప్పండి.. అని నర్సు మాట్లాడింది. సిస్టర్ ఆ అమ్మాయికి ఏమైంది. అని అడిగాడు చాలా ధీనంగా. వాస్తవంగా మీరెవరు ఆ అమ్మాయికి ఏమవుతారు? అని అడగకుండానే ఆ నర్సుకు అర్థమైపోయింది. ప్లీజ్ సిస్టర్ అని బ్రతిమాలుతున్నాడు.
అప్పుడు ఆ సిస్టర్ విగ్నేష్‌కు ఇలా చెప్పింది. ఆ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యిందని. విగ్నేష్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లకు బయటకు రానివ్వకుండా దిగమింగుకున్నాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి సిస్టర్ అని అడిగాడు. ఆమెకు కిడ్నీ అవసరమని డాక్టర్ గారు వాళ్ల తల్లిదండ్రులకు చెప్పారు. డబ్బులు రెఢీ చేసుకోమని, ఎవరైనా కిడ్నీ ఇచ్చే వారుంటే తీసుకొచ్చుకోమని చెప్పారు. అని సిస్టర్ విగ్నేష్‌కు చెబుతుంది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందండి. అంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన విగ్నేష్
చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఎటు వెళుతున్నాడో తెలియకుండానే రోడ్డుపై వెళుతున్నాడు. ఎలాగోలా రూంకు చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి జీవిత గురించి ఆలోచించి ఏమీ వండుకొని తినలేదు. కనీసం నిద్ర కూడా పోలేదు. ఎప్పటికో అలా పొద్దుపోయాక నిద్రలోకి జారుకున్నాడు.
ఉన్నట్టుండి చాలా లేట్‌గా నిద్ర లేచిన విగ్నేష్ హడువిడిగా స్నానం చేసి బయటకు వెళ్లాడు. రోడ్డు పక్కన టిఫెన్ సెంటర్ ఉంటే అక్కడ నాలుగు ఇడ్లీలు తిని డైరెక్టుగా ఆటోలో జీవిత ఉన్న ఆసుపత్రికి చేరుకున్నాడు. జీవిత తల్లిదండ్రులు ఆమె వద్దే ఉన్నారు. వాళ్లకి కనిపించకుండా డాక్టర్ గది వద్ద ఎదురు చూస్తున్నాడు. 2 గంటల తర్వాత డాక్టర్ రాగానే గదిలోకి వెళ్లాడు… (స్టోరీ కట్)
సరిగ్గా ఏడాదిన్నర తర్వాత విగ్నేష్ ఫోన్‌కు ఒకానొక రాత్రి తన వాట్సాఫ్‌కు మెస్సేజ్ వచ్చింది. విగ్నేష్ రిప్లై ఇస్తూ ఎవరు ? అని చాట్ చేస్తాడు. కొద్ది నిమిషాలకు మళ్లీ వాట్సాఫ్‌కు మరొక్క మెస్సేజ్ వచ్చింది. ఎలా ఉన్నావు విగ్నేష్? అని. మళ్లీ ఇంతకు మీరెవరు? అని మళ్లీ రిఫ్లై ఇస్తాడు విగ్నేష్. అవతల నుంచి మరొక్క మెస్సేజ్ వచ్చింది. ఆ మెస్సేజ్‌లో నేను జీవిత అని ఉంది. ఆ మెస్సేజ్ చూసిన విగ్నేష్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చాలా సిన్సియర్‌గా జీవితను ప్రేమించిన విగ్నేష్ ఈ ఏడాదిన్నర కాలంలో ఏ అమ్మాయినీ ప్రేమించలేదు. జీవిత..జీవిత అనే పేరునే మనస్సులో ఉంచుకున్నాడు. ఆ తర్వాత వాట్సాప్ చాట్ ఇలా..!
విగ్నేష్: నిజంగానే నువ్వు జీవితవా?
జీవిత: అవును నేనే!
విగ్నేష్: ఎక్కడున్నావు? బాగున్నావా?
జీవిత: నేను చాలా హ్యాపీగా ఉన్నాను.నువ్వు ?
విగ్నేష్: నేను బాగానే ఉన్నాను. ఇన్ని రోజులు ఎక్కడున్నావు?
జీవిత: నేను కెనడాలో ఉన్నాను. మా ఆయనతో..!
విగ్నేష్: షాక్…పెళ్లి అయిందా జీవితా!
జీవిత: అవును నాకు పెళ్లి అయింది.నేను మా ఆయనతో సంతోషంగా ఉన్నాను.
విగ్నేష్: అవునా!(చాలా దిగాలుగా) నేను..నేను మా ఇంటి వద్దనే ఉన్నాను.
జీవిత: ఇంకా ఏమిటి సంగతులు విగ్నేష్. నీకు పెళ్లి అయ్యిందా?
విగ్నేష్: నాకు కాలేదు! నువ్వు బాగున్నావుగా అదే చాలు!
జీవిత: ఎవరినైనా ప్రేమించావా?
విగ్నేష్: ఆ..కానీ!
జీవిత: కానీ..ఆ..ఏమిటి చెప్పు?
విగ్నేష్: జీవిత నీకోసం ఎదురు చూడని రోజంటూ లేదు. నీ ఫోన్‌కు కాల్ చేయని రోజంటూ లేదు. నీ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. నీ ఫ్రెండ్స్‌ను అడిగితే వారి వద్ద నుండి ఎలాంటి సమాధానం లేదు. నేను చాలా నెలలు నేను ఉన్న రూంలోనే ఒక్కడినే ఉన్నాను! చివరికి ఇంటికి వచ్చాను.
జీవిత: అవునా!
విగ్నేష్: అవును జీవిత. మళ్లీ నువ్వు ఇలా మాట్లాడతావని, కాంటాక్టులోకి వస్తావని నేను ఊహించలేదు.
జీవిత: విగ్నేష్..!
విగ్నేష్: చెప్పు జీవిత
జీవిత: నాకు పెళ్లి అయిన మాట వాస్తవమే. మా అమ్మనాన్న గొప్ప సంబంధం అని చెప్పి కెనడాలో ఉద్యోగం చేస్తున్న అతనికి ఇచ్చారు. అయితే! కానీ!
విగ్నేష్: కంగారుగా అయితే! ఆ..చెప్పు
జీవిత: పెళ్లి అయినంక. నేను నన్ను చేసుకున్న అతను రెండో రోజే కెనడా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాం. అక్కడ అతను నన్ను కెనడా తీసుకెళ్లలేదు. నేను అంతకుముందే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. మా తల్లిదండ్రులు బలవంతంగా నాకు ఈ పెళ్లి చేశారు. అని చెప్పాడు.
విగ్నేష్: అవునా! మరీ ఇన్నాళ్లు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? జీవిత.
జీవిత: చేసేది ఏమీ లేదు. ఈ విషయం మా అమ్మనాన్నకు చెప్పాను. చాలా బాధపడ్డారు. వాళ్లు బాధను నేను చూడలేక వేరే చోట హాస్టల్లో ఉంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తున్నాను.
విగ్నేష్: జీవిత ఎంత పని జరిగింది?
జీవిత :??
విగ్నేష్: జీవిత నీకు ఒకటి చెప్పాలి.
జీవిత: చెప్పు విగ్నేష్.
విగ్నేష్: జీవిత నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు డాక్టర్‌ను ఎవ్వరికీ తెలియకుండా కలిశాను.
జీవిత: అవునా? ఎందుకు?
విగ్నేష్: నీకు..నీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యిందిగా.
జీవిత: అవును..విగ్నేష్ ఎవరో నాకు కిడ్నీ దానం చేశారంట.అతని పేరు తెలియదు.అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు. అతనికి థ్యాక్స్ చెబుదామనుకున్నా! ఇంతలో ఇలా జరిగింది.
విగ్నేష్: జీవిత..జీవిత ఆ కిడ్నీ….ఇచ్చింది నేనే జీవిత
జీవిత: ఆ మెస్సేజ్ చూసి జీవిత ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయోమయం లో పడింది. షాక్ నుండి తేరుకొని కళ్లల్లో కన్నీరు కారుస్తూనే ఉంది.
విగ్నేష్: హలో జీవిత? జీవిత
జీవిత: విగ్నేష్..నువ్వు కిడ్నీ ఇచ్చావా? నాకు.. అయ్యే ఎంత పొరపాటు చేశానే అనుకుంటూ వలవల కన్నీరు కారుస్తుంది.
విగ్నేష్: జీవిత..నేను ఆ రోజు కిడ్నీ ఇచ్చేటప్పుడు ఆ డాక్టర్ గారి వద్ద మాట తీసుకున్నాను. నేను కిడ్నీ ఇస్తున్నట్టు నీకు, నీ తల్లిదండ్రులకు తెలియనీవద్దని చెప్పాను. కొద్ది రోజులు అక్కడే రూంలో ఉన్నాను. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి సహాయం చేశారు.
జీవిత: జీవితకు కన్నీరు ఆగడం లేదు. విగ్నేష్ నన్ను క్షమించు! నేను నిన్నుమిస్ అయ్యాను విగ్నేష్ అంటూ ఏడుస్తూనే ఉంది. నేనంటే నీకు ఇంత ప్రేమా!. అయ్యే ఎంత ఘోరం జరిగిపోయిందే! అంటూ కన్నీరు కార్చింది.
విగ్నేష్: జీవిత నువ్వు నా ప్రాణం కంటే ఎక్కవుగా నిన్ను ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.కానీ!
జీవిత: విగ్నేష్! ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా?
విగ్నేష్: ప్రేమిస్తూనే ఉన్నాను. ప్రేమిస్తూనే ఉంటాను జీవిత.
జీవిత: ఇంకా నేను అంటే ఇష్టమేనా విగ్నేష్.
విగ్నేష్: ఇష్టమే! జీవిత. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను.
జీవిత: కళ్లల్లో నీళ్లు కారుతున్నాయి. విగ్నేష్ ఐ లవ్ యూ!
విగ్నేష్: ఐ లవ్ యూ టూ! జీవిత కన్నీరు కార్చుతూ..!
జీవిత: విగ్నేష్ నిన్ను ఈ క్షణమే చూడాలనిపిస్తుంది.
విగ్నేష్: నాకు కూడా జీవిత. నిన్ను చూడాలనిపిస్తుంది.
జీవిత:?? జీవితకు కళ్లల్లో ఆనందం ఒక్కాసారిగా ప్రతిభభించింది.
విగ్నేష్: రేపు నీ దగ్గరకు వస్తాను జీవిత
జీవిత: సంతోషంగా, ఆనందంగా ఒకే విగ్నేష్ తప్పకుండా రా!
విగ్నేష్ ఇక పట్టలేనింత సంతోషంతో తన ప్రేమను జయించినంత ఉత్సాహంతో ఉన్నాడు. తన నిజాయతీ ప్రేమను చాటుకున్నాడు. ప్రేమ విలువను ఆకాశానికి పెంచాడు. నిజంగా ఇలాంటి వారు ప్రస్తుతం కాలంలో ఉంటారో లేదో తెలియదు. కానీ విగ్నేష్ లాంటి అమర ప్రేమికుడు మాత్రం కచ్చితంగా ఏదో ఒక మూలన ఈ ప్రపంచంలో ఉండే ఉంటాడు. చిగురించిన ప్రేమ చివరికి ఇద్దర్నీ కలిపింది. ధన్యవాదములు! ఇలాంటి మరిన్ని ప్రేమ కథలతో మరోసారి మీముందుకు మీ ఖమ్మంమీకోసం.కామ్ అంతవరకు శెలవు..