Telugu lo News | ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వార్తలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వార్తలో భాగంగా విజయవాడలో 144 సెక్షన్ అమలు, ప్రత్యేక హోదాపై వీర్రాజు కీలక వ్యాఖ్యలు, బండి సంజయ్‌ని కల్సిన వాల్మీకి బోయాలు, ఉస్మానియా రానున్న రాహుల్ గాంధీ, మళ్లీ రాజకీయాల్లో లగడపాటి? లాంటి తదితర వార్తల(Telugu lo News)ను కింద ఇచ్చాము.
విజయవాడలో Section 144
రేపు UTF తలపెట్టిన ఛలో సీఎంఓకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా తెలిపారు. ఛలో సీఎంఓ కార్యక్రమంలో ఉద్యోగులెవ్వరూ పాల్గొనవద్దని, కార్యక్రమంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ కాంతి రాణా తెలిపారు. విజయవాడలో పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉంది అని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇస్తున్నాంగా!
అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.15 వేల కోట్లతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామన్నారు. పోలవరానికి రూ.55 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.70 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరంతో పాటు రాయలసీమను పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం జగన్ దృష్టిపెట్టాలని సూచించారు.
మతపరమైన రిజర్వేషన్లకు BJP వ్యతిరేకం
నారాయణ పేట జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ వాల్మీకి బోయలతో మాట్లాడారు. BJP గెలిస్తే వాల్మీకీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బిజేపీ వ్యతిరేకమన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి ఎందుకు చేర్చరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లీస్‌తో కేసీఆర్ కుమ్మక్కు వల్ల హిందువులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బాంచన్ బతుకులు కావాలా? పేదల రాజ్యం కావాలా? అని వారితో అన్నారు.
ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ మాట్లాడుతారు
విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీకి తీసుకొస్తామన్నారు. రేపు(సోమవారం) ఉస్మానియాకు వెళ్లి, వీసీ అనుమతి కోరుతామన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్శిటీ వెళ్తారు. యూనివర్శిటీని సందర్భంచి, విద్యార్థులతో మాట్లడుతారు. టిఆర్ఎస్ తో మంతనాలు జరపడం పట్ల పీకేపై అనుమానాలు రావడం సహజమన్నారు. అది మా పరిధిలో లేదు అని అన్నారు.
JANASENA పుట్టింది బాబు కోసమే: మంత్రి
జనసేనకు సిద్ధాంతాలు లేవని, చంద్రబాబు కోసమే ఆ పార్టీ పుట్టిందని మంత్రి గుడివాడ అమర్నాత్ విమర్శించారు. గత ప్రభుత్వంలో రుణ మాఫీ చేస్తానని మోసం చేస్తే దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. విలువలు లేని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలు ఉన్న వ్యక్తి సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్- టిడిపి కలిసి ఆయనపై కేసులు పెట్టాయనే విషయం ప్రజలకు తెలుసన్నారు.
లగడపాటి, వసంత భేటీకి ప్రాధాన్యత
రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి తెరపైకి వచ్చారు. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. తన పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జరిపినట్టు సమాచారం. 2019 లో సర్వేల పేరుతో మీడియా ముందుకొచ్చి టిడిపికి అనుకూలంగా ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లగడపాటి పెద్దగా కనిపించడం లేదు.
రేవంత్ రెడ్డిది అసత్య ప్రచారం
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నాకు మెడికల్ కాలేజీ కూడా ఉందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. నాకు మెడికల్ కాలేజీ లేదని తెలిపారు. ఒక వేళ ఉన్నట్టు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తా అని చెప్పారు.
మా ప్రభుత్వంలోనూ నేరాలు: విజయసాయి
విశాఖపట్టణంలో పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే టిడిపి హయాంలో కన్నా తమ ప్రభుత్వంలో నేరాల సంఖ్య చాలా తగ్గిందని తెలిపారు. మత్స్య కారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వారి కులదైవం ఆలయాన్ని సొంత ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
నేటితో ప్రాణహిత పుష్కరాలు ముగింపు
ప్రాణహిత పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఘాట్లకు తరలివస్తున్నారు. వేకువనే, కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు ముక్తీశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. 12 రోజులుగా పుష్కరాలు సాగుతున్నాయి.