Telangana schools reopen: తెలంగాణ‌లో ఫిబ్ర‌వ‌రి 1నుంచి స్కూళ్లు ఓపెనింగ్‌!

Telangana schools reopen హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2022 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థ‌లు తెరుచుకోనున్న‌ట్టు తెలుస్తోంది. కోవిడ్ ప్ర‌భావంతో కొద్ది నెల‌లుగా మూత ప‌డిన పాఠ‌శాల‌లు తిరిగి ఓపెన్ చేయ‌నున్న‌ట్టు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం విద్యాశాఖ‌లోని అన్ని విభాగాల అధికారుల‌కు ఆదేశాల‌ను జారీ చేశారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను కచ్చితంగా అమ‌లు చేస్తూ పాఠ‌శాల‌లు తెర‌వాల‌ని విద్యాశాఖ విభాగాల‌కు ఆదేశాలు (Telangana schools reopen) ఇచ్చారు.

కోవిడ్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు మూత‌ప‌డ్డ స్కూళ్లు తిరిగి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన మంగ‌ళ‌వారం తెరుచుకోనున్నాయి. ఇటీవ‌ల సంక్రాంతికి ఇచ్చిన సెల‌వుల‌ను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి వ‌ల్ల ఈ నెల 30 వ‌ర‌కు పొడిగించారు. రేప‌టితో సెల‌వులు ముగుస్తుండటంతో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు పునః ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ స్ప‌ష్టం చేసింది. ఇత‌ర రాష్ట్రాల్లో పాఠ‌శాల‌లు తెర‌వ‌డం, అక్క‌డ విద్యార్థుల‌పై కోవిడ్ ప్ర‌భావం అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు త‌క్కువ‌గా ఉంద‌న్న వైద్య ఆరోగ్య శాఖ సూచ‌న‌ల‌తో పాఠ‌శాల‌లు పునఃప్రారంభం స‌రైన స‌మ‌యంగా విద్యాశాఖ భావించింది. విద్యా సంస్థ‌ల్లో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాల‌ని వైద్య శాఖ‌కు సూచించింది.

ప్ర‌త్య‌క్ష బోధ‌నే మంచిది!

ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌తో పాటు ప్ర‌భుత్వ జూనియ‌ర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ క‌ళాశాల్లో టీవీ, ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల్లో 8,9,10 త‌ర‌గ‌తుల‌కు మాత్ర‌మే టీ శాట్, దూర‌ద‌ర్శ‌న్‌, వాట్సాప్ తో ఆన్‌లైన్ బోధ‌న జ‌రిగింది. ప్ర‌త్య‌క్ష బోధ‌న‌కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని ఇప్ప‌టికే త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాద‌న‌తో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు ఇప్ప‌టికే ఇంట‌ర్‌, 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు గ‌డువును ప్ర‌భుత్వం పొడిగించింది. వాటి వార్షిక ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను కూడా వెల్ల‌డించాల్సి ఉంది. దీనికి ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేసి స్కూళ్లు రీఓపెనింగ్ త‌ర్వాత ప్ర‌క‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సెల‌వులు కొన‌సాగితే సిల‌బ‌స్ పూర్తి చేయ‌డం క‌ష్ట‌త‌రం అవుతుంద‌ని, దాని ప్ర‌భావం వార్షిక ప‌రీక్ష‌ల‌పై ప‌డుతుంద‌ని ప‌లు సంఘాలు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. తాజాగా విద్యా సంవ‌త్స‌రాన్ని పొడిగించాల‌న్న విజ్ఞ‌ప్తిపై కూడా ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించే అవ‌కాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను మే నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మే 30 వ‌ర‌కు విద్యా సంవ‌త్స‌రాన్ని పొడిగిస్తార‌ని ఆ శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Share link

Leave a Comment