Telangana Political Waar : మంత్రి ఈటల ఇబ్బందికి కారకులెవ్వరు? | minister etela rajender
Telangana Political Waar : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి అవసరాలు ఏమి టో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. పరిపాలించే ప్రభుత్వానికి మెరిట్ తప్పనిసరిగా ఉండాలని ఈటల రాజేందర్ అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ మొదటిగా మనిషినని తెలిపారు. రైతులు లేకుంటే బతుకే లేదని అన్నారు. గ్రామీణ జీవితాన్ని చిన్నాభిన్నం చేయవద్దని సూచించారు.
చర్చలు సఫలం కాలేదా?
టిఆర్ఎస్ పార్టీలో అభిప్రాయ బేధాలు ఇంకా సమిసిపోనట్టే కనిపిస్తున్నాయి. మంత్రి తాజా వ్యాఖ్యలతో పార్టీలో సీనియర్ మంత్రి అయిన ఈటల రాజేందర్‌కు అధిష్టానానికి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదనేది స్పష్టమవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో చర్చలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కలవలేదనేది స్పష్టమవుతుంది. అసలు టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారనేది ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న రాజకీయ విషయాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతన్న సందర్భంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్‌ను భుజానికి ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పడుడప్పుడు సమావేశాల్లో ఈటల నా తమ్ముడు లాంటి వాడు.. నా కుడి భుజం లాంటి వాడు అని పదేపదే చెప్పేవారు.

ప్రశ్నించే గొంతైన ఈటల!
ఉద్యమం సమయంలో సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశంలో భంగం కలిగినప్పుడు ఈటల రాజేందర్ ముందుండి గొంతెత్తి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక అసెంబ్లీలో కూడా శాసన సభాపక్ష నేతగా పార్టీ తరపున బలమైన వాదనలు వినిపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ సమస్యలను గొంతెత్తి ప్రశ్నించారు.
ఎందుకు డీలా పడ్డారు?
అలాంటి దమ్మున్న ఈటల రాజేందర్ ఈ మధ్య కాలంలో డీలా పడినట్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రెండో సారి అధికారంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే మంత్రి ఈటల రాజేందర్ తన సహజ శైలికి భిన్నంగా ఉంటున్నారనే ప్రచారం కొనసాగుతుంది. ఈటెల రాజేందర్ వ్యవహారంపై కొంత కాలంగా అధిష్టానం సీరియస్‌గా ఉంటుందట. సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఈటలకు కొంత కాలం నుండి గ్యాప్ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఢిల్లీలో రాజకీయాలు చేసేందుకు తీసుకు వెళ్లే వారిలో కొందరు సీనియర్ నాయకుల పేర్లలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే అది తనకు ఇష్టం లేని ఈటల రాజేందర్ తనకు అనుకూలంగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఒకరు ఇద్దరు నేతలను ప్రోత్సహించారని సన్నిహితుల వద్ద వాపోయారట. ఇక అప్పటి నుంచే అధిష్టానానికి, ఈటల రాజేందర్ కు గ్యాప్ పెరిగిందనేది సమాచారం.
ఇతరులను ప్రోత్సహించడంతోనేనా గ్యాప్!
రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి నిమిషంలో ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారనే వార్తలు వినిపించాయి. ముందు కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను ఉద్ధేశించి ఇటీవల మేం గులాబీ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఈటల. ఇక అక్కడ నుంచి పోటీగా అధిష్టానం కరీంనగర్ నుంచి గంగుల ప్రభాకర్‌ను ప్రోత్సహిస్తుందట. దీంతో సీఎం కేసీఆర్‌కు , ఈటల రాజేందర్‌కు కొంత గ్యాప్ పెరిగిందని చర్చించుకుంటున్నారు.
కొత్త పార్టీ పెట్టనున్నారా?
ఆర్టీసీ సమ్మె సమయంలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా అప్పట్లో గట్టిగా స్పందించారు ఈటల రాజేందర్. దీంతో గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. అయితే మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక పరిస్థితులపై కూడా సీఎం కేసీఆర్ తన అంతర్గతంగా ఆరాతీశారనేది తెలుస్తోంది. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సీఎం దృష్టికి రావడంతో ఈటలకు, కేసీఆర్‌కు మాటలు లేవని సమాచారం. పార్టీ పెట్టడం పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా కౌంటర్ కూడా వేశారనేది తెలుస్తోంది.

ఆ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ రైతులకు మద్దతుగా పంట కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని అప్పట్లో చర్చకు తెరలేపారు. అలాగే పేదలకు పథకాలు ఇచ్చినంత మాత్రాన పేదరికం పోదని, పార్టీ జెండాలు మోయడం ముఖ్యం కాదని, ప్రజా సేవ చేయడమే ముఖ్యమంటూ ఈటల గతంలో కామెంట్ చేశారు. ఈ మధ్య పెరిగిన గ్యాప్‌తో అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి ఈటలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇక ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌కు హైదరాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది.
కేసీఆర్తోనైతేనే పరిష్కారం?
సాగర్ ఉప ఎన్నికలు కూడా మంత్రి ఈటలకు అప్పగించలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి ఈటలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ సీఎం కేసీఆర్ అపాయిమెంట్ ఇవ్వలేదనే ప్రచారం కొనసాగుతుంది. ఎలాగైనా కేసీఆర్‌తోనే కూర్చుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ భవన్ చర్చించుకుంటుంది. గతంలో ఎమ్మెల్యే రసమయి కూడా ఇలాగే ఉండటంతో కేసీఆర్ స్పదించి మాట్లాడటంతో వ్యవహారం సద్ధుమణిగిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడితే పరిస్థితి సద్ధుమణుగుతుందని గులాబీ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
- Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
- Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్‌ను Covid చుట్టుముట్టింది!
- Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?