Congress party : కాంగ్రెస్‌లో దాగుడు మూత‌లాట‌! అసంతృప్తే కార‌ణ‌మా?

Congress party : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. టీపీసీసీ చీఫ్ అంశంపై సీనియ‌ర్లు సైలెంట్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా అంత‌ర్గ‌తంగా ర‌గులుతూ ఉన్న‌ట్టు గా మారింది. అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లాల‌ని సీనియ‌ర్ల‌తో భేటీ కావాలంటూ అధిష్టానం చెప్ప‌డంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ నేత‌ల ఇండ్ల దారి ప‌ట్టారు. ఇప్ప‌టికే చాలా మంది నేత‌ల‌ను క‌లిసి వ‌స్తున్నారు. కానీ తీవ్ర‌మైన అసంతృప్తితో ర‌గులుతున్న వారు మాత్రం రేవంత్‌కు క‌నీసం స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.


Congress party : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామ‌కంపై రాష్ట్రంలోని సీనియ‌ర్ల‌లో అసంతృప్తి కొన‌సాగుతూనే ఉంది. దీనిపై సీనియ‌ర్ నేత‌లు గుర్రుగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి ల‌క్ష్మారెడ్డి బ‌హిరంగంగా విమ‌ర్శ‌లకు దిగిన విష‌యం తెలిసిందే. వీరితో పాటుగా చాలా మంది నేత‌లు లోలోన ర‌గులుతున్న‌ట్టు పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. మ‌రోవైపు పార్టీ నేత‌ల‌ను ఒక్కొక్క‌రిగా క‌లుపుకొని వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి కూడా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

మౌనం దేనికి సంకేతం?

ఎంపీలు ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు జ‌గ్గారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, మాజీ ఎంపీ మ‌ధుయాష్కి, పొన్నం, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డితో స‌హా ప‌లువురు టీపీసీసీ పీఠం కోసం పోటీ ప‌డ్డారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, వీ.హ‌నుమంతురావు, జ‌గ్గారెడ్డి వంటి నేత‌లు రేవంత్ రెడ్డి వద్దంటే వ‌ద్దంటూ అధిష్టానానికి లేఖ‌లు పంపారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో కొంత‌మంది నేత‌లు విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఒక‌రిద్ద‌రు నేత‌లు వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేసినా, మ‌ళ్లీ మౌనం పాటించారు. అటు ఉత్త‌మ్‌, జానారెడ్డి, జ‌గ్గారెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, జీవ‌న్‌రెడ్డితో పాటు ప‌లువురు మాత్రం మొత్తానికి మౌనంగా ఉన్నారు. ఎంపీ వెంక‌ట‌రెడ్డి కూడా ప్ర‌స్తుతం సైలెంట్ అయ్యారు. అయితే ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్న దాగుడు మూత‌ల వ్య‌వ‌హారం ఇంకెన్ని రోజులు కొన‌సాగుతుంద‌నేది హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ పార్టీలోని ఈ వ్య‌వ‌హారానికి ఎలా పుల్‌స్టాఫ్ పెడ‌తార‌ని, సీనియ‌ర్ల‌ను ఎలా స‌మ‌న్వ‌యం చేస్తార‌న్న‌దే అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఓ వైపు రేవంత్ రెడ్డి కూడా కొంత‌మందిని క‌లుస్తూ చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా, ఎంత మేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతాయో తెలియ‌డం లేదు. దీనిపై కాంగ్రెస్ కేడ‌ర్ కూడా సందిగ్థంలోనే ప‌డింది. ఒక వేళ ఇలాగే అంత‌ర్గ‌త పోరు కొన‌సాగితే మాత్రం పార్టీకి చాలా న‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

అందుబాటులో లేం అంటున్న సీనియ‌ర్లు!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామ‌కం త‌ర్వాత సీనియ‌ర్ల‌ను క‌లుపుకుని వెళ్లాల‌ని అధిష్టానం సూచించ‌డంతో సీనియ‌ర్ల ఇళ్ల చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ నెల 7న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తుండ‌గా.. ఆహ్వానిస్తూనే క‌లిసి ప‌ని చేద్దామంటూ చ‌ర్చిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే సీనియ‌ర్ నేత జానారెడ్డి, ష‌బ్బీర్ అలీని క‌లిశారు. ఆ త‌ర్వాత పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, సుద‌ర్శ‌న్ రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్‌, ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు వంశీచంద్‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌తో పాటుగా అనారోగ్యంతో హాస్పిట‌ల్లో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ నేత వీహెచ్ ను కూడా క‌లిసి మ‌ద్ద‌తు తీసుకున్నారు. ఆదివారం ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ ఇంటికి వెళ్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇదే సంద‌ర్భంలో పార్టీలో అసంతృప్తి నేత‌లుగా భావిస్తున్న ప‌లువురిని క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే సీనియ‌ర్లు, బ‌ల‌మైన నేత‌ల‌ను క‌ల‌వాల‌ని రేవంత్ చేస్తున్న ప్ర‌యత్నాలు స‌ఫ‌లం కావ‌డం లేదంటున్నారు. తాను వ‌స్తున్నాన‌ని స‌మాచారం ఇచ్చి వెళ్లేందుకు సిద్ద‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇంట్లో లేమంటూ దాగుడు మూత‌లు ఆడుతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీలు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు శ్రీ‌ధ‌ర్ బాబు, జ‌గ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు రేవంత్ కు స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. దాదాపు ఈ నాలుగైదు రోజుల నుంచి సీనియ‌ర్ల‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, వాళ్ల నుంచి రిప్లై రాక‌పోవ‌డంతో కొంత అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్‌. ఒక వేళ రేవంత్ అసంతృప్తుల ఇంటికి వెళ్లి క‌లిస్తే ఏమ‌వుతుందని, స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం మంచిది కాద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇది రేవంత్‌కు కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌నే తెచ్చి పెడుతుంద‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Share link

Leave a Comment