వరంగల్ : జర్నలిస్ట్, క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత, వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న శుక్రవారం పత్రికల యాజమాన్యాలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ లో ఉదయం ప్రధాన పత్రికలను అన్నింటినీ ప్రజలకు చూపిస్తూ ‘మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా గత కొన్ని నెలలుగా ఆయా ప్రధాన పత్రికల్లో వచ్చిన తెలంగాణ ప్రధాన వార్తలను చదివి, విశ్లేషణ చేసి ప్రజల సమస్యలపై వివరిస్తున్నారు.
![]() |
Teenmar Mallanna |
ఈ నేపథ్యంలో వరంగల్ – నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం జనగాం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో తీన్మార్ మల్లన్నకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే విధంగా నిరుద్యోగులు, మేధావులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు స్వాగతం పలుకుతూ తీన్మార్ మల్లన్నను ప్రోత్సహిస్తున్నారు. పాదయాత్ర కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నే కాకుండా స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పని కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న అనేక ప్రజా సమస్యలపై క్యూ న్యూస్ ద్వారా వెలుగు లోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువయ్యారు. నోట్ల రద్దుపై స్టోరీ చదవండి :నోట్ల రద్దు ఎవరికి మేలు? దేశంలో ప్రస్తుతం పరిస్థితులు ఏమిటి?
అయితే తీన్మార్ మల్లన్న ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రధాన పత్రికలు తీన్మార్ మల్లన్న వార్తను కనీసం జిల్లా పరిధిలోనైనా జడ్జిమెంట్ పరంగా కూడా ప్రచురించకపోవడంతో కాస్త నిరాశ చెందారు. ప్రతి రోజూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికలన్నింటినీ ఉదయం కొన్ని లక్షల జనాభాకు చూపిస్తూ ఆయా పత్రికల సర్యూలేషన్ పెంచుతుంటే, తన వార్త కూడా కవర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న’ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పత్రికల యాజమాన్యానికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
1650 కిలోమీటర్ల మేర సుధీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నం. పాదయాత్ర చేసేది మల్లన్న కదా! మల్లారెడ్డి కాదు కదా! అందుకోసమే ఉన్న ప్రధాన పత్రికలన్నీ వరంగల్ లో ఉన్న ఆయా పత్రికల స్టాఫర్లకు మొన్ననే ఒకరు దావత్ ఇచ్చి, ఇంత కవర్ కూడా చేతిలో పెట్టిర్రు. మరి లైవ్ చూస్తున్నటువంటి ప్రజల్లారా! మనం కూడా రిపోర్టర్లను కొని వార్తలు రాపించుకుందామా? మన ద్వారా లక్ష సర్కిలేషన్ అవుతున్న పత్రికలను మనం చదవడం అవసరమా? మన వార్త రాయని, వాస్తవాలే రాయమంటున్నా!ఇయ్యాల ఒక పత్రికలో ఒక వార్త చూస్తే లోపల వరంగల్ రిపోర్టర్ రాసిండు. దుబ్బాకలో టిఆర్ఎస్ ఓటమితోని టీజేఎస్ కోదండరాం రెడ్డికి, రాణీ రుద్రమ్మ రెడ్డికి జోష్ వచ్చిందట. ఒక పత్రికలో ఈ రోజు వచ్చింది. ఆ నిరసనగా 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ లక్షలాది మంది ప్రజలతోని కలుసుకుంటూ పోయి, దాదాపు 50,60కి పై చిలుక సభలు పెట్టకుంటూ రోడ్‌షోలు చేసుకుంటూ పోతుంటే, ఆఫ్ట్రాల్ మల్లన్న కదా! మల్లారెడ్డి కాదు కదా! అని వార్తలు రాస్తలేదేమో! ఆ నిరసనగా ఈ రోజు ఒక పత్రికను చదవడం లేదు సోదరులారా!
ఎందుకంటే మాకు విలువు ఇచ్చిన పత్రికకే మేం విలువు ఇస్తాం. మాకు విలువ ఇచ్చిన పత్రికల వార్తలే మేం చదువుతాం. మా వార్తను అంతో ఇంతో కొన్ని పత్రికలు రాస్తున్నాయి. అలా అని నేను మా వార్తను రాయమని అడగలేదు. కానీ వారు బాధ్యతగా రాస్తున్నారు. అసలు తీన్మార్ మల్లన్న బరిలోనే లేడన్న యాంగిల్ తీసుకొచ్చి వార్తుల రాస్తాఉన్నరు. ఒక్కసారి మీడియా యాజమాన్యాలు పరిశీలించండి.అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? మా రోడ్డు షో , సభలకు ఎందుకు వేలాది మంది ప్రజలు వస్తున్నారు… ఒక్క సారి తెలుసుకోండి. ఇప్పుడు వనపర్తి నుండి బాధితులు వచ్చిర్రు, బయ్యారం నుండి, ఖమ్మం నుండి బాధితులు వచ్చిర్రు. మీడియా వద్దకు కదా వీరు వెళ్లాల్సింది. మా దగ్గరకు ఎందుకు వస్తున్నరు? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు.