Suez Canal Blocked : ఎట్టకేలకు ఎవర్ గివెన్ నౌక కదిలింది!
ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్(ever given) ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంలో సఫలమయ్యారు. దీంతో ఎవర్ గివెన్(ever given) నౌక తిరుగు ప్రయాణమయ్యింది. ఇప్పటికే భారీగా జామ్ అయిన ఇతర నౌకలకు మార్గం సులభమైందని సూయిజ్ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దాదాపు 20 వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్ గివెన్(ever given)నౌక గత మంగళవారం సూయిజ్ కాలువలో అడ్డంగా తిరిగి ఎటూ వెళ్లలేక ఇరుక్కుపోయింది. ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో బాగా ఇసుక, బంకమట్టి పేరుకు పోయింది. డ్రెడ్జర్ల సహాయంతో ఆ ఇసుకను, బంక మట్టిని తవ్వుతూ మరోవైపు టగ్ బోట్ల సహాయంతో నౌకను కదిలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించారు. ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్ చేశారు. దీంతో పాటు వాతావరణం కూడా సహకరించడంంతో భారీ ఎవర్ గివెన్ నౌక ప్రయాణానికి మార్గం సుగమమైనట్టు నిపుణులు వెల్లడించారు.


వారం తర్వాత నీటిలో తేలిన నౌక
సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద ఎవర్ గివెన్ దాదాపు వారం తర్వాత తిరిగి మళ్లీ నీటి మీద తేలింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గం ఇది. ఇక ఈ నౌక ఈ మార్గం నుంచి తప్పుకోనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 400 మీటర్ల పొడవు (1,312 అడుగులు) మరియు 200,000 టన్నుల బరువు, గరిష్టంగా 20,000 కంటైనర్ల సామార్థ్యం కలిగిన ఎవర్ గివెన్ ప్రస్తుతం 18,300 కంటైనర్లను తీసుకువెళుతుంది. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం..ఓట మళ్లీ నీటిలో తేలినప్పటికీ ఈ జలమార్గం నుండి ఎంత త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేస్తారో తెలియదని 450 కి పైగా నౌకల లాగ్ జామ్ ను క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వెంటనే తెలియదని పేర్కొంది.