
success stories in telugu| Indian tribal life style:మా బతుకులు మారవా?విశాఖపట్టణం : స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెటూర్ల పరిస్థితి ఏమాత్రమూ మారడం లేదు. గ్రామాలకు తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిధులు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకొని ప్రచారాలు చేసుకునే ప్రజాప్రతినిధులు ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనేది ప్రత్యక్షంగా వెలుగుచూస్తున్న గిరిజనుల బాధలను బట్టి ప్రపంచానికి తెలుస్తోంది.
“మా గ్రామాలు అసలు ఎక్కడున్నాయో గ్రామ సచివాలయం అధికారులకు, ప్రజాప్రతినిధులకే తెలియదని, అలాంటప్పుడు మా గ్రామాలకు అధికారులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు గిరిజన బిడ్డలు. మా ఆడపిల్ల పెళ్లి చేసుకొని గర్భిణీ అయితే ఏదన్నా ఆసుపత్రికి తీసుకెళ్దామనుకుంటే రోడ్డు మార్గం లేకుండా పోయింది. ప్రాణం కంటే ఎక్కువ కాదని ఎలాగోలా డొంకలోనూ, లోయలో నుండి తీసుకెళ్లే సమయంలో మధ్యలోనే బిడ్డకు జన్మనిస్తున్నారు. అదే సమయం లో మరణాలు కూడా సంభవించిన సంఘటనలు చాలా ఉన్నాయని అంటూ” గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మన బతుకులు మనమే మార్చుకుందామనుకున్నారు కొందరు చైతన్య వంతమైన గిరిజన యువకులు. రహదారి లేకపోవడంతో ఎంత నరకం అనుభవిస్తున్నామో అనే విషయాన్ని చుట్టుపక్కల 15 గ్రామాల గిరిజనులకు తెలియజేశారు. అందరూ చేయిచేయి కలిపారు. గత ఐదు నెలలుగా కష్టపడి శ్రమధానంతో కొండను తవ్వి రోడ్డు నిర్మించుకున్నారు. ఈ చిత్రం లో కనిపిస్తున్నది విశాఖపట్టణం జిల్లా కొయ్యూరు మండలం యు చిడిపాలెం పంచాయతీ మర్రిపాకల నుంచి చిన్న అగ్రహారం వరకు సుమారు 20 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించుకున్న వైనం ఇది.
నిత్యావసర వస్తువుల కోసం కొయ్యూరు మండల కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల కన్నగూడెం కొత్తవీధి మండల కేంద్రమై మాకు దగ్గరలో ఉన్నందున చిన్న అగ్రహారం వరకు రోడ్డు నిర్మించుకున్నామని గిరిజనులు చెబుతున్నారు. పాడేరు నియోజకవర్గం గూడెం కొత్తవీధి కొయ్యూరు మండలాల మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు సౌకర్యాలు లేవు. దీంతో ఈ రెండు మండలాలకు మధ్యలో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతంలో యువ కులు, పెద్దలు, మహిళలు సమావేశమై రోడ్డు నిర్మించుకోవాలని తీర్మానించుకున్నారు.
గూడెం కొత్తవీధి మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యూరు మండలం యు చిడిపాలెం పంచాయతీలో ఉన్న మారుమూల గిరిజన గ్రామస్థులు మర్రిపాకలు నుండి గూడెంకొత్తవీధి మండలం చిన్న అగ్రహారం వరకుసుమారు 25 కిలోమీటర్ల వరకు ఐదు నెలల పాటు వారంతా చెమటోడ్చి కొండను తవ్వి బండ రాళ్లను తొలగించి మట్టిరోడ్డు నిర్మించుకున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పాడేరు ఐటీడీఏ పీఓ, ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్డు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.