Somu Veerraju had a meeting with Mudragadda Padmanabhan | Mudragadda Padmanabhan:కాపు ఉద్యమ నేత బీజేపీలో చేరనున్నారా?
Somu Veerraju had a meeting with Mudragadda Padmanabhan | Mudragadda Padmanabhan:కాపు ఉద్యమ నేత బీజేపీలో చేరనున్నారా?East godavari : ఆంధ్రప్రదేశ్లోని భారత జనతా పార్టీ (బిజెపి) బలపడేందుకు అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్న బిజెపి పార్టీ, ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే విధంగా అడుగులు వేస్తూ ఇతర పార్టీల నాయకులకు, సినీ నటులకు వల వేస్తోంది.
ఈ క్రమంలో కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల సినీనటి వాణీ విశ్వనాథ్ ను కలిసి బీజేపీలో చేరిక విషయమై పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చలు జరిపారు. అదే విధంగా టిడిపికి చెందిన మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, పడాల అరుణను సైతం కలిసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను బిజెపిలో చేరనని తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఇప్పటికే కళా వెంకట్రావు తెలియజేశారు.
గతంలో ముద్రగడ్డపై టిడిపి చూపు!
2019లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనుకున్న పార్టీలు ప్రతి అవకాశాన్ని వదలుకోకుండా ప్రయత్నం చేశాయి. అందులో భాగంగానే ఆ ఎన్నికల సమయంలో టిడిపి కూడా కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టింది. ఎలాగైన ముద్రగడ్డ పద్మనాభంను ఒప్పించి తమ పార్టీలోకి చేర్చుకుంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కడకీ పోదని టిడిపి భావించింది. అందులో భాగంగానే, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టిడిపికి చెందిన నేతలు సమావేశం అయ్యారు. అయితే ఎన్నికల అనంతరం ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోనీ చేరకుండా అలానే ఉద్యమ నాయకుడిగా ఉండిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి ముద్రగడ వైపు వెళ్ల లేదు.
అయితే ఇప్పుడు బీజేపీ ఆహ్వానాన్ని ముద్రగడ పద్మనాభం మన్నిస్తారా? ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం బిజెపిలో చేరితే రాష్ట్ర రాజకీయాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంకు పార్టీలో ఏ పదవి ఇస్తారో దాన్ని బట్టి ముద్రగడ ముందుకు అడుగులు వేస్తారా? లేదా? అనేది సమావేశం అనంతరం వారు స్వయంగా తెలియజేసేంత వరకు తెలియదు. ఇప్పటికే రాష్ట్రంలో టిడిపి ఒంటరిగా పోరాడుతుంది. బిజెపి, జనసేన మాత్రం జోడీగా ముందుకు వెళుతున్నాయి. రానున్న తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక పంచాయతీ ఎన్నికలపై బిజెపి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేగం పెంచినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ముద్రగడను కలిసిన సోము వీర్రాజు
మాజీ మంత్రి , కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించినట్టు వీర్రాజు తెలిపారు. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో అనేక దఫాలుగా మంత్రిగా బాధ్యతలు వహించిన ముద్రగడ ఆవశ్యకత ప్రస్తుత రాజకీయాలకు అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ క్రమంలో ముద్రగడ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బలహీనమైన శక్తిగా బిజెపి- జనసే కూటమి పాత్ర పోషిస్తుందని సోము వీర్రాజు తెలిపారు.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..ఇసుక టిప్పర్ రూపంలో కబళించి మృత్యువు