sitting for long hours | పొగతాగడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం భారిన పడే అవకాశాలు సాధారణం కన్నా నాలుగు రెట్లకు పెరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇవే కాదు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే అందరూ పొగతాగకపోవచ్చు. కానీ దాదాపు అందరూ ఎక్కువ గంటలు కూర్చుని ఉంటారనేది వాస్తవం. ఆఫీసులో కావచ్చు, వ్యాపార సంస్థలో కావచ్చు లేదా టీవీ ముందు కావచ్చు. చాలా మంది రోజుకు 14 గంటల పాటు కూర్చుని లేదా పడుకుని ఉంటారు. ఇలాంటి వారు పలురకాల వ్యాధుల బారిన పడతారని ఇటీవల పరిశోధనల్లో వెల్లడయ్యింది. రోజూ అరగంట పాటు సాధారణ వ్యాయామం చేసే వారు సైతం ఎక్కువ గంటలు కదలకుండా కూర్చుని ఉంటే వారు పలు రకాల వ్యాధుల పాలవుతారని అధ్యయనాల్లో స్పష్టమైంది.
sitting for long hours | రక్త నాళాలు ముడుచుకుపోయి
సహజంగానే ఎక్కువ మంది కూర్చుని ఉండటానికే ఇష్టపడతారు. కండరాల శ్రమ పూర్తిగా ఆగిపోవడమే ఇందుకు కారణం. శరీరం విశ్రాంతి కోరుకుంటున్నప్పుడు కూర్చోవడం అనేది గొప్పగానే ఉంటుంది. అయితే అతిగా కూర్చునే ప్రయత్నం చేస్తే శరీరం పలు రకాల దుష్ఫ్రభావాలకు లోనవుతుంది. వాస్తవానికి కండరాల ప్రక్రియలు రక్తంలోని షుగర్ నిలువల్ని శరీరమంతా వ్యాపింపచేస్తాయి. రక్తంలోని కొవ్వు పదార్థాలను శక్తిగా మారుస్తాయి. మామూలుగా అయితే నడుస్తున్నప్పుడు లేదా కనీసం నిలుచుని ఉన్నప్పుడు శరీరంలోని అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్‌ను, కొవ్వు పదార్థాలను సంగ్రహిస్తాయి.
అయితే ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం వల్ల రకంలోని షుగర్ లేదా కొవ్వు సామాన్యస్థితికి రాలేవు. పైగా, ఎక్కువ సమయం కూర్చునే ఉండటం వల్ల రక్తనాళాలు తమ సహజమైన సంకోచ వ్యాకోచ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ స్థితి ఎక్కువ కాలం కొనసాగితే, అది శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగడానికి, మధుమేహం రావడానికి దారి తీస్తుంది. మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. చివరికి గుండె రక్తనాళాలు దెబ్బతిని గుండె జబ్బులు రావడానికి గానీ, పక్షవాతం రావడానికి గానీ దారి తీయవచ్చు. ఇవే కాదు దాదాపు మరో 34 రకాల విషమ పరిస్థితులుకు దారి తీయవచ్చు.
గంటకొకసారైనా సీట్లోంచి లేస్తే…
ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం వల్ల 52 శాతం మంది అకాల మరణం పాలవుతున్నారని అధ్యయ నాల్లో వెల్లడయ్యింది. ఇందులో 8 శాతం మంది పెద్ద పేగు క్యాన్సర్. 10 శాతం మంది గర్భాశయ క్యాన్సర్, 6 శాతం మంది శ్వాసకోశ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనల్లో బయటపడింది. మరో విషయమేమిటంటే రోజూ 14 నుంచి 18 గంటల పాటు కూర్చునే ఉండేవారు నిత్యం అరగంట పాటు బ్రిస్క్ వాకింగ్ లాంటి సాధారణ వ్యాయామాలు చేసినా ఫలితమేమీ ఉండదు. రోజుకు ఏడు గంటలకు పైగా టివి ముందు కూర్చునే వారిలో దాదాపు 61 శాతం మంది తీవ్రమైన వ్యాధుల పాలవుతున్నట్టు స్పష్టమయ్యింది.

రోజుకు గంట పాటు బాగా శ్రమ కలిగే వ్యాయామాలు చేయడంతో పాటు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారు గంటకు ఒకసారి కొంత దూరం నడవడం గానీ లేదా కనీసం లేచి నిలబడటం గానీ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలిగిపోతాయని ఈ పరిశోధకులు కనుగొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ