Section 124A : రాజ‌ద్రోహ చ‌ట్టం అమ‌లను కేంద్రం ఎందుకు నిలిపివేసింది?

Section 124A : వివాద‌స్ప‌ద‌మైన రాజ‌ద్రోహ చ‌ట్టంపై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. భార‌తీయ శిక్షా స్మృతి(ఐపీసీ) లోని Section 124A నిబంధ‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం పునఃస‌మీక్ష జ‌రిపి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకునేంత వ‌ర‌కు దాని అమ‌లును నిలిపేస్తూ కీల‌క‌మైన ఆదేశాలిచ్చింది.

కేంద్ర పునః స‌మీక్ష పూర్తయ్యేదాకా ఈ చ‌ట్టం కింద కొత్త‌గా కేసులు న‌మోదు చేయొద్ద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలను ఆదేశించింది. ఇప్ప‌టికే న‌మోదైన కేసుల విచార‌ణ కూడా నిలిపివేయాల‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ NV Ramana, జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ హిమాకోహిల నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం 2022 మే 11న ఈ మేరకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఒక వేళ ఎవ‌రిపైనా ఈ సెక్ష‌న్‌తో పాటు ఇత‌ర Sections కింద కేసులు న‌మోదు చేసి ఉంటే మిగిలిన సెక్ష‌న్ల కింద విచార‌ణ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఎప్పుడో బ్రిటీష్ పాల‌కుల హ‌యాంలో అమ‌ల్లోకి తెచ్చిన ఈ Section 124A ప్ర‌స్తుతం సామాజిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా లేద‌ని, అందువ‌ల్ల దీన్ని పునః ప‌రిశీలించాల‌న్న కోర్టు సూచ‌న‌ను అంగీక‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో ధ‌ర్మాస‌నం నిర్ణ‌యం వెలువడింది. రాజ‌ద్రోహ చ‌ట్టాన్ని స‌వాలు చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై మూడో వారానికి వాయిదా వేసింది.

Section 124A లో ఏముంది?

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, ఎన్నికైన ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా మాట‌ల‌తో, చేత‌ల‌తో, సంకేతాల‌తో, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో, విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌తో శ‌త్రుత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తే దేశద్రోహ నేరం కింద‌కు వ‌స్తుంది. దీని కింద కేసు న‌మోదు అయితే బెయిల్ ల‌భించ‌దు. ముంద‌స్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయ‌వ‌చ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డుతుంది. Treason కేసులు ఎదుర్కొన్న వారు ప్ర‌భుత్వోద్యోగాల‌కు అన‌ర్హులు.

సెక్ష‌న్ 124ఎ ఎందుకు తెచ్చారు?

స్వాతంత్య్ర పోరాట స‌మ‌యంలో బ్రిటీష్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లో వెల్లువెత్తుతున్న ఆగ్ర‌హ జ్వాల‌ల్ని అణిచేసేందుకు ఈ చ‌ట్టాన్ని తెచ్చారు. బ్రిటీషిండియా తొలి లా క‌మిష‌న్ థామ‌స్ మెకాలే రూపొందించిన ఈ చ‌ట్టాన్ని 1890లో 124A సెక్ష‌న్ కింద భార‌త శిక్షా స్మృతిలో చేర్చారు.

దీనికింద 1891లో తొల‌సారిగా జోగేంద్ర చంద్ర‌బోస్ అనే ప‌త్రికా సంపాద‌కుడిపై కేసు పెట్టారు. త‌ర్వాత తిల‌క్ మొద‌లుకొని గాంధీ దాకా ప్ర‌ముఖులెంద‌రో కూడా ఈ చ‌ట్టం కింద జైలుపాల‌య్యారు. బ్రిట‌న్ మాత్రం దీన్ని 2009లో ర‌ద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగ‌పూర్ కూడా ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేశాయి.

Raja Droham కేసుల్లో ప్ర‌ముఖులు

124ఎ అమ‌లును తాత్కాలికంగా నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆదేశించిన నేప‌థ్యంలో ఈ నిబంధ‌న కింద న‌మోదైన కేసులు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. జాతీయ నేరాల న‌మోదు విభాగం(NCRB) నివేదిక ప్ర‌కారం ఈ నేరం కింద 2015-2020 మ‌ధ్య కాలంలో మొత్తం 356 కేసులు దాఖ‌ల‌య్యాయి. 548 మంది వ్య‌క్తులు అరెస్ట‌య్యారు.

వీరిలో ఆరుగురిపైనే నేరాలు నిరూపిత‌మై శిక్ష‌లు ప‌డ్డాయి. రాజ‌ద్రోహం కేసులు న‌మోదైన వారిలో బెంగుళూరుకు చెందిన దిశార‌వి (టూల్ కిట్ కేసు), ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌య పూర్వ విద్యార్థులు Kanhaiya kumar, ఉమ‌ర్ ఖ‌లీద్‌, అనిర్భ‌న్ భ‌ట్టాచార్య‌, దివంగ‌త పాత్రికేయుడు వినోద్ దువా, కేర‌ళ పాత్రికేయుడు సిద్ధిఖీ క‌ప్ప‌న్‌, బుకర్ ఫ్రైజ్ విజేత, ర‌చ‌యిత్రి అరుంధ‌తి రాయ్‌, హార్థిక ప‌టేల్ (గుజ‌రాత్‌), అసీమ్ త్రివేది (కార్టునిస్ట్‌, కాన్పుర్‌) వినాయ‌క్‌సేన్ (డాక్ట‌ర్‌,ఛ‌త్తీష‌గ‌డ్‌), సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్‌(పంజాబ్‌) త‌దిత‌రులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *