Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌!

0
49

Second Covid Wave: కుప్ప‌లు కుప్ప‌లుగా మృత‌దేహాలు! దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌!

Second Covid Wave: దేశంలో మ‌ళ్లీ క‌రోనా రాకాసి పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ఆసుప‌త్రుల‌న్నీ క‌రోనా రోగుల‌తో కిక్కిరిసి పోతున్నాయి. మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, గుజ‌రాత్, బీహార్ రాష్ట్రాల్లో రోగుల‌కు బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. కొంత మంది క‌రోనా రోగులు ఆసుప‌త్రుల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో బెడ్‌పై ఇద్ద‌రు రోగులు చికిత్స తీసుకుంటున్నారు. లాల్‌బ‌హుదూర్ ఆసుప‌త్రికి రోగులు క్యూ క‌డుతున్నారు. బెడ్లు లేక‌పోవ‌డంతో వ‌చ్చిన రోగులు వ‌రండాల్లో, కూర్చీల్లో ప‌డిగాపులు కాస్తున్నారు. ఆసుప‌త్రుల వ‌ద్ద చావుబ‌తుకుల మ‌ధ్య రోగులు కొట్టుమిట్టాడుతున్నారు.

Photo : ANI

గుజ‌రాత్ లోనూ క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త ర‌కం వైర‌స్ భారిన ప‌డిన వారి సంఖ్య పెరుగుతోంది. క‌రోనా తో మృతి చెందిన వారి మృత‌దేహాల‌తో ఆసుప‌త్రుల మార్చురీలు ద‌ఢ పుట్టిస్తు న్నాయి. స్మ‌శాన వాటిక‌ల్లో కుప్ప‌లు తెప్ప‌లుగా మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. ఒక ప్ర‌క్క క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆక్సిజ‌న్ కొర‌త మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ముంబైలో 10 మంది, బోపాల్ లో 5 గురు మృతి చెందారు. ఆసుప‌త్రుల్లో బెడ్ లు లేక ఆటోల్లోనూ, వాహ‌నాల్లోనూ క‌రోనా రోగులు నిరీక్షిస్తున్నారు.

ప్ర‌ముఖులు, క్రికెట‌ర్లు ఆసుప‌త్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటున్నారంటే ముంబైలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. ఇక ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం సృష్టిస్తోంది. స్మ‌శానంలో కొన్ని, బ‌య‌ట వాహ‌నాల్లో కొన్ని మృత‌దేహాలు ఉండిపోయాయి. ఆసుప‌త్రి వ‌రండాల్లో సంచుల్లో కొన్ని మృత‌దేహాలు, స్ట్ర‌చ‌ర్‌పైన కొన్ని మృత‌దేహాలు క‌నిపిస్తూ అమానుష వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తుంది. రాయ‌పూర్‌లో స్మ‌శాన వాటిక‌లో మృత‌దేహాల చితి మంట‌లు 24 గంట‌లూ ర‌గులుతూనే ఉన్నాయి. పేరుకుపోయిన మృత‌దేహాలకు ద‌హ‌న సంస్కారాలు చేయ‌డానికి స్మ‌శాన వాటిక స‌రిపోక‌పోవ‌డంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండ‌టంతో ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. రాయ‌పూర్ ఆసుప‌త్రిలో క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌ప్ప‌టికీ గుండెపోటుతో కుప్ప‌కూలుతున్నారు.

రాయ‌పూర్‌లోని డా.బిఆర్‌. అంబేద్క‌ర్ మెమోరియ‌ల్‌ ఆసుప‌త్రిలో ఫ్రీజ‌ర్లు నిండిపోవ‌డంతో మృత‌దేహాల‌ను ఎక్క‌డ ఉంచాలో అధికారుల‌కు తెలియ‌డం లేదు. మార్చురీ స్థాయికి మించి మృత‌దేహాల‌ను భ‌ద్ర‌ప‌రు స్తున్నారు. రోజుకు 50 నుంచి 60 మంది రోగులు చ‌నిపోవ‌డంతో అధికారులకు ఏం చేయాలో తోచ‌డం లేదు. రాయ‌పూర్‌లోని 12 రోజుల్లో 861 మంది, దుర్గ్‌లో 213 మంది క‌రోనా రోగులు చ‌నిపోయారు. 15 రోజుల క్రితం రాయ‌పూర్‌లోని రెండు స్మ‌శాన వాటిక‌ల్లోనే అంత్య‌క్రియ‌లు చేసేవారు. ఇప్పుడు ప‌రిస‌రాల్లో ఉన్న 18 స్మ‌శాన వాటిక‌ల‌ను క‌రోనా మృత‌దేహాల‌ను కాల్చ‌డానికి వినియోగిస్తున్నారు. మిగ‌తా న‌గ‌రాల్లోనూ విద్యుత్ ద‌హ‌న ఏర్పాటు కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

Latest Post  Iron Hemoglobin: ఐర‌న్‌కు హీమోగ్లోబిన్‌కు సంబంధం ఏమిటంటే?

మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని ఓ స్మ‌శాన వాటిక‌లో ఏర్పాట్ల‌ను రెండింత‌లు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి భారిన ప‌డిన భ‌ర్త కోలుకుంటాడో లేదో న‌ని భార్య మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద సంఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక హ‌నుమాన్ బ‌స్తీకి చెందిన సుద్దాల శై‌ల‌జ భ‌ర్త‌కు క‌రోనా సోకింది. ప‌రిస్థితి విష‌‌మించ‌డంతో ఆయ‌న్ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అయితే భ‌ర్త క‌రోనా నుంచి కోలుకోక‌పోవ‌డంతో భార్య శైల‌జ తీవ్ర మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

PHOTO : ANI

క‌రోనా విజృంభించిన వేళ మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తుంద‌న‌డానికి ఓ సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్‌లో వెలుగు చూసింది. ఇంటి య‌జ‌మాని క‌ర్క‌శ‌త్వం ఓ మ‌హిళ ప్రాణాల‌ను తీసుకుంది. క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట లో ఓ మ‌హిళ అనారోగ్యానికి గురైంది. ఆసుప‌త్రిలో టెస్టులు చేపించుకోగా క‌రోనా సోకింద‌ని తేలింది. హోం ఐసోలేష‌న్‌లో ఉండేందుకు అధికారులు అనుమ‌తి ఇచ్చారు. అయితే ఆమె ఉండేది అద్దె ఇల్లు కావ‌డంతో య‌జ‌మాని రానివ్వ‌లేదు. తాళాలు కూడా తీయ‌లేదు. దీంతో ఒక రోజంతా బ‌య‌టే గ‌డిపింది. బాధితురాలు ప‌రిస్థితి చూసి స్థానికులు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అధికారులు వ‌చ్చి మ‌హిళ‌ను క‌రీంన‌గ‌ర్ తీసుకెళ్లి వైద్యం అందించారు. అప్ప‌టికే మ‌హిళ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో చ‌నిపోయింది. ఇంటి య‌జ‌మాని చూపిన క‌ర్క‌శ‌త్వానికి స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here