School Love Story : స్వ‌ప్న నా మొఖం మీద లెట‌ర్ విసిరింది

School Love Story: స్వప్న‌కు నేనంటే చాలా ఇష్టం. కానీ నాకు స్వ‌ప్పంటే అస్స‌లు ప‌డ‌దు. పైగా ఆమెను చూస్తే చిరాకేస్తుంది. మ‌నిషైతే తెల్ల‌గా, ఎత్తుగా ఉంటుంది కానీ నాజూక‌న్న‌ది అస్స‌లు క‌న‌బ‌డ‌దు ఆమెలో, ఎప్పుడూ జుత్తు విర‌బోసుకుని నుదుటున బొట్టు లేకుండా జిడ్డు ముఖంతో సిగ్గు లేకుండా తిరుగు తుంటుంది. మా అమ్మ కూడ చాలా సార్లు స్వ‌ప్న‌ను పిలిచి మంద‌లించింది. ఐనా స‌రే త‌ను మాత్రం సోమ‌రిత‌నం వ‌ద‌ల్లేదు.

ఒక‌సారి త‌న ఫ్రెండ్ జ్యోతి ద్వారా నాకు ల‌వ్‌లెట‌ర్ (School Love Story) పంపించింది. స్వ‌ప్న మీదున్న కోపం జ్యోతి మీద తీర్చుకున్నాను. ఓసారి స్వ‌ప్న ఎదురొచ్చింది. దీనికంటే బుర‌ద‌లో పొర్లే పంది న‌యం కాస్త అందంగా నైనా క‌నిపిస్తుంది అంటూ నేను నా ఫ్రెండ్స్ హేళ‌న చేశాం. ఆ రోజు ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిది స్వ‌ప్న‌. మ‌ళ్లీ మా ఛాయ‌లోకి కూడా రాలేదు. నాతో పాటు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయ‌డానికి, సెంట‌ర్ స్కూల్‌కి వ‌చ్చింది స్వ‌ప్న‌. ఐనా న‌న్ను చూసి, చూడ‌న‌ట్టే త‌న పాటికి త‌న ప‌రీక్ష రాసి వెళ్లిపోయింది.

కొన్నాళ్ల‌కు రిజ‌ల్ట్ వ‌చ్చాయి. స్వ‌ప్న ఫ‌స్ట్ క్లాస్లో పాసైంది. నేను మూడు స‌బ్జెక్స్ త‌ప్పిపోయాను. స్వ‌ప్న‌కు ఫ్రీ సీటు వ‌చ్చేస‌రికి, ఇంట‌ర్ చ‌ద‌వ‌డానికి క‌ర్నూలు వెళ్లింది. నేను మాత్రం చ‌దువు మాని, కిరాణా కొట్టు పెట్టు కొని విగ్ర‌హంలా కూర్చుని, స‌రుకులు విక్ర‌యించే ప‌నిలో బిజీ అయిపోయాను. ద‌స‌రా సెల‌వుల‌కు స్వ‌ప్న వ‌చ్చింద‌ని నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. చాలా రోజులైంది క‌దాని చూడాల‌నిపించి వాళ్లుండే వీధికి వెళ్లాను. ఆరు బ‌య‌ట అరుగుపై కూర్చొని, పువ్వులు క‌డుతున్న స్వ‌ప్న‌ను చూసి, నా క‌ళ్ల‌ను నేను న‌మ్మ‌లేక‌పోయాను.

School Love Story: భువికి దిగొచ్చిన తార‌లా ఉంది!

దివి నుండి భువికి దిగి వ‌చ్చిన తార‌లా ఉంది. లాంగా ఓణికి గుడ్‌బై చెప్పి చ‌క్క‌టి పంజాబి డ్రెస్సు సింగారించుకున్నాక లేత మ‌ల్లెపూల‌తో కూర్చోపెట్టిన బొమ్మ‌లా ఉంది స్వప్న‌. ఒక‌ప్పుడు స్వప్న‌కు నేనంటే పిచ్చి ప్రేమ‌. ఇప్పుడు స్వ‌ప్న‌ను చూశాక‌, ఆమెపై నాకు గ‌ల పిచ్చి ముదిరిపోయింది. ధైర్యం చేసి, లవ్ లెట‌ర్ సిద్ధం చేశాను. క్ష‌మాప‌ణ కోరుతూ రాసిన లెట‌ర్‌ని తెలివైన నా మిత్రుడు ర‌ఘు చేత పంపాను. ఊరి చివ‌ర పాడుబావి వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని స్వ‌ప్న ప్ర‌త్యుత్త‌రం పంపేస‌రికి, నా సంతోషం హ‌ద్దులు చెరిపేసుకుంది. ఎగిరి గంతేశాను.

ల‌వ్ స్టోరీ

School Love Story: చెప్పిన స‌మ‌యం కంటే ప‌ది నిమిషాల ముందే అక్క‌డికి చేరుకున్నాను. లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చింది స్వ‌ప్న‌. నేరుగా నా వ‌ద్ద‌కు వ‌చ్చి నేను పంపిన లెట‌ర్ విసిరి నా మొఖాన కొట్టింది. ప్రేమ‌నేది అందంలో నుండి పుట్ట‌దురా..మ‌న‌సులో నుండి పుడుతుంది..

అందాన్ని మెచ్చి ప్రేమించేవాడు ప్రేమికుడు కాదు, కాముకుడు. ఎదుటి మ‌నిషిని ప్రేమ‌గా చూడు..ఆశ‌గా చూడ‌ వ‌ద్దు..ప్రేమంటే న‌మ్మ‌కం..దాన్ని పెంచుకో..తుంచుకోవ‌ద్దు..అంటూ అగ్గి మీద గుగ్గిలంలా మండిన స్వ‌ప్న‌, వెన‌క్కి తిరిగి వెళ్లిపోయింది. స్వ‌ప్న కాన్సెప్ట్ పూర్తిగా అర్థ‌మై సిగ్గుతో త‌ల‌దించుకున్నాను. ఔను ప్రేమంటే ఇదే..న‌ని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *