RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్రస్తుతం బిఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బుధవారానికి నెల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తన Twitter ఖాతాలో …ఉద్యోగాన్ని వదిలేసి నల్గొండలో లక్షలాది మంది సాక్షిగా బీఎస్పీలో చేరి నేటికి సరిగ్గా నెల పూర్తయ్యింది. సమయం ఎట్లా గడిచిపోతోందో? .. అంటూ ట్వీట్ చేశారు.
ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)తన ఐపిఎస్ పదవిలో ఉన్నప్పుడు ఎలా చురుగ్గా ఉన్నారో, ఇప్పుడు కూడా అదే స్పీడుతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే చురుకుతనంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఆ పార్టీల్లో చేరకుండా బహుజనుల రాజ్యం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకం చేస్తూ మాయావతి పార్టీ అయిన బీఎస్పీలో ఆగష్టు 8న చేరారు.


పార్టీలో చేరినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రజా వ్యతిరేక పాలనపైన సంధిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరగా చూసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆర్.ఎస్ ప్రవీణ్ ఇప్పటికే పలు సభల్లో మాట్లాడుతూ కొత్త నాయకుడుగా ఎదుగుతున్నారు.
ప్రశ్నించే వారిపైన ప్రభుత్వ నిరాంకుశ పాలనను వేలెత్తి చూపుతూ ఎప్పటికప్పుడు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆర్.ఎస్ ప్రవీణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయి బీఎస్పీలో చేరిన వెంటనే తెలంగాణలో బీఎస్పీ పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి.


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, సభలను పెడుతూ తన వెంట నడిచే నాయకత్వంలో ఫుల్ జోష్‌ను నింపుతున్నారు. ప్రతి జిల్లాలోనూ దళిత, గిరిజన మైనార్టీ సామాజిక వర్గాల వద్దకు వెళ్లి వారి బాధలను, సమస్యలను తెలుసుకుంటున్నారు.
ప్రశ్నించడం…పరామర్శించడం!
ప్రస్తుతం ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడు పెంచారు. అదే సమయంలో అయా సామాజిక వర్గాల, పార్టీల నేతలను స్వయంగా వెళ్లి కలుస్తూ పరామర్శిస్తున్నారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి పై అభ్యంతర వ్యక్తం చేశారు. పార్టీలో చేరికల సమయంలో కౌశిక్ రెడ్డి వేదికపై ఆధిపత్య కులాల వారిని గారు అని గౌరవించడం, పీడిత వర్గాలను చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలవడంపై ఆర్.ఎస్ ప్రవీణ్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో క్లిప్ పెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కొందరిని ఏకవచనంతో పిలవడంపై స్పందిస్తూ అందుకనే జనాలు బహుజన రాజ్యం రావాలనుకుంటున్నారని ట్విట్ చేశారు.


అయితే ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా అధికార పార్టీ విమర్శలు చేస్తూనే అక్కడక్కడ అడ్డుకుంటోంది. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న మూడు సభల్లో సరిగ్గా ప్రవీణ్ కుమార్ స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. దీనిపై స్పందిస్తూ.. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇటీవల బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో కొద్ది సేపు మాట్లాడారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగను వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. ప్రస్తుతం క్యూన్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను అక్రమంగా ప్రభుత్వం జైల్లో పెట్టిందని మల్లనన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తీన్మార్ మల్లన్న గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు కేసులు పెడుతూ ప్రశ్నించే వారిని లేకుండా అణిచివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.