Revanth Reddy React To V.Hanumanth Rao Comments | ‘కేటిఆర్ ముఖ్యమంత్రి’ వార్తలపై రేవంత్ స్పందన ఎలా ఉన్నదంటే?Hyderabad: తెలంగాణ రాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ శఖం ముగిసి పోయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఎంపి రేవంత్ రెడ్డి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర మాటలు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కుల, మత రాజకీయాలతో తాను ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. ఏ నాయకుడైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాడని, అదే విధంగా తాను కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల్లో తనపై ఉన్న నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కార్యకర్త నుండి అధ్యక్షడి స్థాయికి ఎదిగారని ఆ విషయంలో తాను తప్పుపడటం లేదని అన్నారు. తాను కూడా అదే విధంగా కార్యకర్త స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు.
కానీ మంత్రి కేటీఆర్ మాత్రం తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడిగి గెలిచారని అన్నారు. తాతల, ముత్తాల ఆస్తులు పోతూపోతూ వారసత్వానికి ఎలా కట్టబెడతారో అదే క్రమంలో మంత్రి కేటీఆర్ కు కూడా తన తండ్రి వారసత్వం పేరుతో గెలుపొందారని పేర్కొన్నారు. మంత్రి అయిన తర్వాత కేటీఆర్ ప్రజల్లోకి వచ్చి తన పాలన చూపించి వ్యక్తిగతంగా కాస్త గుర్తింపు పొందారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో కేటీఆర్ ఉన్నట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ శఖం ముగిసిపోయిందని, ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు మీడియా ఎదుట పలు సందర్భాల్లో చెబుతున్నారని అన్నారు.
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఇటీవల శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారని, అదే విధంగా శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొందరు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ మెడిసిన్ మంచిదైనప్పటికీ ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని, అదే మెడిసిన్‌లో కేటీఆర్ కావాలని ఆ పార్టీ నేతలు సొంత మీడియాలో చెబుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.


వీహెచ్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్
కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తనకు టిపిసిసి పదవి రాకుండా అడ్డుకునేది రాష్ట్రంలో ఒకరో, ఇద్దరో మాత్రమే ఉన్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు తనకు టిపిసిసి పదవి రావాలని కోరే వారే ఎక్కువుగా ఉన్నారని అన్నారు. ఒకరు, ఇద్దరు అడ్డుకునేది ఎందుకంటే? ఇప్పుడేగా పార్టీలోకి వచ్చింది నాలుగురోజులు ఆగినంక తీసుకో అన్నట్టు చెబుతున్నారన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ తో కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి వస్తేనే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందికి ఉందని చెప్పారు. విహెచ్ హనుమంతురావు ఒక్కప్పుడు తాను టిడిపిలో ఉంటే, రేవంత్ రెడ్డి ధైర్యవంతుడు కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటదని మీడియా ఎదుట అప్పట్లో చెప్పారని అన్నారు. అలా రమ్మన్న విహెచ్ హనుమంతురావు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో తెలియదని చెప్పారు.
ఇది చదవండి: మంత్రికొడాలి నానిపై ప్రతిపక్షాల మాటల యుద్ధం!