
జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్టా?
Revanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే దశలో టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఏదో రకంగా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో గట్టి పట్టుదలతోనే ఉన్నారు. సొంత పార్టీ నాయకులు సహకరించక పోయినా పార్టీలో సర్థుకుపోతూ వస్తున్నారు. ఒక పక్క సొంత పార్టీ నాయకుల అసమ్మతిని ఎదుర్కొంటూనే అధికార పార్టీ టిఆర్ఎస్పై రాజీ లేకుండా పోరాటం సాగిస్తున్నారు.
Revanth Reddy | హైదరాబాద్: నడిసంద్రంలో ఉన్న కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చే పనిలో బరువు, బాధ్యతను తీసుకున్న రేవంత్ రెడ్డి ఆటుపోటులను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకుంటూ పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రమైనే యాక్టివ్‌లో ఉన్నదంటే అందుకు రేవంత్ రెడ్డి కష్టం ఎంతుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో కేసులు, వేధింపులు అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురొడ్డి నిలుస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారాలను ఫోకస్ చేస్తూ వారి అవినీతి వ్యవహారాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వంలోని లొసుగులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి కష్టాన్ని చూసి కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ పదవి కట్టపెడతామనుకుంటే, తెలంగాణలో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు ఏ మాత్రమూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఆ పదవిని భర్తీ చేద్ధామనుకున్నా వాయిదాలు పడుతూ ఏదో ఒక కారణం అడ్డు తగులుతూనే ఉంది. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలితో రేవంత్ రెడ్డి సైతం విసిగిపోయారనేది తెలుస్తోంది.
బీజేపీ నుండి ఆఫర్?
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ నుండి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆ పార్టీలో కీలక పదవి కూడా కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంతో రేవంత్ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో ఉంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరికంటే ఎక్కువుగా యాక్టివ్‌గా ఉన్నది కేవలం ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. తాజాగా నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన వరద సహాయం విషయంలో ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉండటంతో ఆయన ఇంత యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒక వేళ పీసీసీ పదవి రేవంత్ కు కాకుండా వేరే వారికి కట్టబెడితే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఎక్కువుగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు సంకేతాలు పంపుతుంది.
రేవంత్ సత్తాను తెలుసుకున్న బీజేపీ
రేవంత్ రెడ్డి సత్తా కాంగ్రెస్ కంటే బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలకే తెలుసు. ఆ విషయం రేవంత్ కు కూడా తెలియడంతో ఇప్పటికే మరో ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ ఆఫర్లతో రేవంత్ ఎదురుగా వచ్చి వాలిందనే సంకేతాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్లోకి ధీటుగా చొచ్చుకుపోతాయి. అయితే ఈ స్థాయి పవర్ ఉన్న రేవంత్ రెడ్డిపై బీజేపీ కన్ను పడింది. పార్టీలోకి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలే బీజేపీ టార్గెట్?
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థల ఎన్నికలు ఈ నెలలో(నవంబర్) జరగబోతున్నాయి. ఈ సమయంలోనే రేవంత్‌ను తీసుకు వచ్చి పార్టీని బలపర్చాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. ఎలాగైనా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. బీజేపికి హైదరాబాద్‌లో పట్టు ఉంది. బీజేపీ సొంతంగా ఎన్నికలకు వెళితే 15 నుంచి 20 స్థానాలు గెలుచుకోగల సత్తా ఉంది. అయితే మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 80 కార్పొరేటర్లు గెలవాల్సి ఉంది. ఇందుకోసం టిడిపి, కాంగ్రెస్‌లోని బలమైన నాయకులను పార్టీలోకి తెచ్చుకోవాలనే ఆలోచన బీజేపీ చేస్తుంది.
రేవంత్ రెడ్డికి స్వయంగా 10 నుంచి 15 స్థానాలు గెలిపించే సత్తా ఉందని, టిడిపిని కలుపుకుంటే మరికొన్ని స్థానాలు కైవసం చేసుకోవచ్చని, టిఆర్ఎస్కు ప్రత్నామ్నాయంగా నిలవాలని బీజేపీ భావిస్తోంది. నగర పాలక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి అవసరం బీజేపీకి చాలా ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్, కిషన్‌రెడ్డి లాంటి ప్రముఖులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
ఇతర పార్టీల్లోని అసంతృప్తులతోపాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తీసుకువస్తే రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఓటింగ్‌ను శాసించగలరని బీజేపి ఆలోచిస్తుంది. ఇందుకు రేవంత్‌తో సంప్రదింపులు ప్రారంభించిందని సమాచారం. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం కాంగ్రెస్ ను గట్టెక్కించాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని,తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండకూడదంటే పార్టీ మారడమే బెటర్ అనే అభిప్రాయంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడే ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!