Remdesivir Injection : రెమిడిసివర్ ఇప్పుడు దేశంలో అత్యవసర మందుగా పేరొందింది. కారణం కరోనా మహమ్మారి విజృంభించడమే. కరోనా తగ్గాలంటే రెమిడిసివర్ ఇంజక్షన్ ఒక్కటే మార్గం అనే పరిస్థితులు వచ్చాయి. దీంతో డిమాండ్ పెరగడంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది.
Remdesivir Injection: గతేడాదితో పోలిస్తే దేశంలో కరోనా ప్రభావం ఈ ఏడాది ఎక్కువుగా ఉంది. రెండో దశలో కరోనా విలయతాండవం చేయడంతో పాటు అనేకమందిని పొట్టన పెట్టుకుంటుంది ఈ వైరస్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భారిన పడిన వారు కోలుకోవాలంటే రెమిడిసివర్ ఇంజక్షన్ దివ్య ఔషధంగా మారింది. గతంలో రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిపై ఇటు ప్రభుత్వాలు, అటు ఫార్మా కంపెనీ(Pharma companies)లు అంతగా దృష్టి పెట్టలేదు. ఎప్పుడైతే దేశంలో కరోనా రెండో దశ విజృంభణ ఎక్కువుగా అయ్యిందో రెమిడిసివర్ ఇంజక్షన్ల వాడకం పెరిగింది. దీంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రెమిడిసివర్ ఇంజక్షన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో రెమిడిసివర్కు ఉన్న డిమాండ్ ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో రెమిడిసివర్ బ్లాక్ మార్కెట్ దందా పెద్ద ఎత్తున కొనసాగుతుంది.
సంజీవనీగా మారిన రెమిడిసివర్(Remdesivir Injection)
కరోనా(Corona) సోకిన వారు ఎట్టి పరిస్థితుల్లో రెమిడిసివర్ ఇంజక్షన్లపైనే ఆశలు పెంచు కుంటున్నారు. దీంతో రెమిడిసివర్ ప్రస్తుతం సంజీవనిగా మారింది. ఇది అదునుగా భావించిన అక్రమార్కులు ఒక్కో ఇంజక్షన్ ధర రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పైగా దొంగదారిలో అమ్ముతున్నారు. ముందు ప్రాణం కాపాడు కోవాలనే తపనతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు చేతిలో రెమిడిసివర్ ఇంజక్షన్ పడితే చాలని కొందరు కరోనా రోగులు భావిస్తున్నారు. వాస్తవానికి రెమిడిసివర్ ఒక్కటే కరోనాను తగ్గించే మందు అనే దోరణి అందరిలో పడిందని, ఇది ఒక్కటే ప్రత్యామ్నాయం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కరోనాకు సంబంధించి యాంటీవైరల్స్ ట్రీట్మెంట్లో ఎక్కువుగా వాడుతున్న మందు ఇదే. కానీ దీనిని సరైన సమయంలో ఉపయోగించడం లేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి మొదటి దశలో ఉన్నప్పుడు ఈ రెమిడిసివర్ ఇంజక్షన్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందంటున్నారు. కరోనా బాగా ముదిరిన తర్వాత చివరి స్టేజీలో రెమిడిసివర్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. వైరస్(virus) ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పుడు దాని ప్రభావం ఎక్కువుగా చూపించకుండా తగ్గించడానికి మాత్రమే ఈ రెమిడిసివర్ ఇంజక్షన్ పనిచేస్తుందని అంటున్నారు. కరోనా సోకిన వ్యక్తికి 5 రోజుల నుంచి 8 రోజుల మధ్యలో ఈ ఇంజక్షన్ ఇస్తే వైరస్ తీవ్రత తగ్గుతుందని డాక్టర్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెమిడిసివర్ ఒక్కటే కరోనాను తగ్గించే మందు కాదని, దీనికి ప్రత్యమ్నాయంగా వేరే డ్రగ్స్ కూడా ఉన్నా యంటున్నారు.

ప్రచారమే ప్రజలను నమ్మేలా చేసింది!
కరోనాకు పక్కా మందు ఇప్పటికీ తయారు కాలేదు. కానీ రెమిడిసివర్కు మాత్రం చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే అందుబాటులో ఉన్న కొన్ని మందులతో కరోనా రోగులకు వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందులోనూ కొన్ని మందులు పనిచేయడం లేదు. అయితే ఫార్మా కంపెనీలు ‘మా మందు మంచిగా పనిచేస్తుంది.’ అని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. దీంతో జనాలు అయోమయంలో పడుతున్నారు. 12 ఏళ్ల లోపు పిల్లలకు రెమిడిసివర్ మందు ఇవ్వవద్దని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని వాడొద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఎక్కువుగా విజృం భించడం మొదలైందే అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు పెద్ద ఎత్తున రెమిడిసివర్ మందు ఒక్కటే ఆధారమనే విధంగా వార్తలు ప్రచారం చేశాయి. దీంతో కరోనా వైరస్ సోకిన వారు రెమిడిసివర్ లేకపోతే ఇక బ్రతకడం కష్టమనే ధోరణిలో పడిపోయారు. ప్రజలకు రెమిడిసివర్ మందును పరిచయం చేసిన తర్వాత దేశంలో కృత్రిమ కొరత ఏర్పడేలా కొందరు ఇబ్బందులను సృష్టించారు. ఇందులో ప్రభుత్వాలు కూడా ఎలాంటి మార్గదర్శకాలు, ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోలేదు.
రెమిడిసివర్ కరోనా మందు కాదు!
వాస్తవానికి రెమిడిసివర్ ను యాంటీ వైరల్ డ్రగ్‌గా వాడుతారు. ఈ ఇంజక్షన్‌ను ఒక కోర్సుగా వాడాల్సి ఉంటుంది. కరోనా వైరస్ నుండి 90 శాతం కోలుకున్న వారు దీనిని వాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతున్నారో, ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి మాత్రమే ఈ రెమిడిసివర్ ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది కూడా 200 మి.లీ రోజుకు ఒకసారి చొప్పున ఐదు రోజుల పాటు ఇస్తే కరోనా థర్డ్ స్టేజీలోకి వెళ్లకుండా రోగిని కాపాడవచ్చు. కరోనా రోగికి 40 శాతం దాటి ప్రభావం ఉన్నప్పుడు ఈ ఇంజక్షన్ పనిచేయదని వైద్యులు చెబుతున్నారు. అయితే కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు మళ్లీ దొరకదనే నెపంతో ఏకంగా ఇంటిల్లపాదికి, ఒక్కోదానికి రూ.20 వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తు న్నారు. కరోనాను తగ్గించే మందు రెమిడిసివర్ కాదని, వాస్తవానికి దీనిని ఎబోలా, సార్స్ విరుగుడుకు వాడేవారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువుగా ఇతర దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్నప్పుడు దీనిని వాడారు. అదే క్రమంలో భారత్‌లో కూడా ప్రస్తుతం దీని వాడకం ఎక్కువుగా పెరిగింది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి