real love story కొన్ని లవ్ స్టోరీలు మనసును తాకుతాయి. మరికొన్ని లవ్ స్టోరీలు సేం నాది కూడా ఇలానే అనే విధంగా ఉంటాయి. ఇక్కడ కింద ఇచ్చిన లవ్‌స్టోరీ మాత్రం ప్రతి ఒక్క ప్రేమికుడు, ప్రేమికురాలు ఆలోచించి ప్రేమ అనే పదానికి గౌరవం ఇవ్వాలని ఆశిస్తోంది. ఈ స్టోరీ రియల్ కథే. కానీ పేర్లు మార్చి(real love story) ఇస్తున్నాం.
కాలేజీ ఆఖరి రోజు. ‘జీవితమంటే చదువొక్కటే కాదు. లావుగా, బండలా ఉన్నావ్. నువ్వూ అమ్మయివేనన్న సంగతి గుర్తుంచుకో’ క్లాస్ మేట్ మాట నా మనసును తాకింది. చిన్నప్పుడే నాన్న చనిపోతే మామయ్యలు పెంచారు. చదువు తప్ప మరో లోకం ఉండేది కాదు. బీటెక్‌లో కాలేజీ టాపర్‌గా బంగారు పతకం అందుకున్నా. అంతుకు ముందే పెద్ద కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యా. అంతా హ్యాపీ అనుకుంటుండగా స్నేహితుడి మాట కలవర పాటుకు గురి చేసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని అందంపై దృష్టి పెట్టా. కసరత్తులు చేసి కపుడు మాడ్చుకొని మొత్తానికి నేనూ అందగత్తెనని నిరూపించుకున్నా.

తొలి పరిచయం!
‘హాయ్.. వెల్కమ్ టూ అవర్ గ్రూప్..మీ పేరేంటి? ఏ ఊరు?’ మొదటి రోజే మాట కలిపాడు రాము. మా సీనియర్. స్పందించాను. అడక్కముందే సాయం చేసే గుణం అతడిది. ఏ అవసరం వచ్చినా తన సీటువైపే నా అడుగులు. ఆ చొరవ మమ్మల్ని దగ్గర చేసింది. ‘నువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం.’ ప్రపోజ్ చేశాడోరోజు. తనంటే నాకూ ప్రేమే. కానీ మా కులాలు వేరు. అదే చెప్పి సున్నితంగా తిరస్కరించా.
మావాళ్లు ఒప్పుకోక పోతే నిన్ను రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటా. ‘నీ చేయి వదిలే ప్రసక్తే లేదు’ ఆవేశంగా చెప్పాడు. పడిపోయా. కానీ ఆ ఆనందం ఆవిరవ్వడానికి వారం పట్టలేదు. నువ్వు చెప్పినట్టే మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నా మరదల్ని పెళ్లి చేసుకొమ్మని గొడవ అన్నాడు బేలగా. మరోసారి గట్టిగా ప్రయత్నించంటే సరేనన్నాడు. మళ్లీ ఏమైందో కొద్ది రోజులకే పాత పాట. పూటకోసారి మాట మార్చటం నాకు నచ్చలేదు. అతడ్ని మర్చిపోవాలనే నిర్ణయానికొచ్చా. కానీ ప్రేమగా పలకరింపులు. నడుంపై చేతులేయడం. బుగ్గలు గిల్లడం, ముద్దులు పెట్టడం. ఇలాంటి చేష్టలతో పూర్తిగా తన వశమయ్యా.

తప్పటడుగు పడింది!
ఓ రోజు ఇద్దరం సినిమాకెళ్లొచ్చాం. ఇంట్లో ఎవరూ లేరు. ఏకాంతం, వయసు ఉద్రేకం మాతో తప్పటడుగు వేయించింది. ఆరోజు నుంచి రామూనే నా భర్తని ఫిక్సయ్యా. తనలో మాత్రం ఊహించని మార్పు. అస్సలు పట్టించుకునేవాడు కాదు. కనపడితే ముఖం తిప్పుకునేవాడు. అసలే తప్పు చేశానని కుమిలిపోతుంటే తన నిర్లక్ష్యం చాలా బాధించేది. ప్రేమ భిక్ష పెట్టమని పెళ్లాడమని దాదాపు బిచ్చగత్తెలా అర్థించా. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించు. అప్పుడు మా వాళ్లని కాదని నీ దగ్గరికొస్తా అంటూ ఓ ఛాన్స్ ఇచ్చాడు. అదే మహాభాగ్యమని పుస్తకమందుకున్నా. అప్పుడూ దురదృష్టం వెంటాడింది. అదే సమయంలో మా ఇంటి ఓనర్ గది ఖాళీ చేయమనడంతో ఆఫీసుకు దగ్గరే ఉన్న ఓ అపార్ట్మెంట్కి మారా. నా ఖర్మకాలి అది రాము పక్క ప్లాట్. వీలు చేసుకొని నా ప్లాట్‌లోకి దూరిపోయేవాడు. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడేసరికి తన కౌగిలిలో వాలిపోయేదాన్ని. చదువు పక్కదారి పట్టింది.

తేల్చుకుందామనుకున్నా!
ఇంట్లో వాళ్లు ఓ సంబంధం చూశారు. రాముని తప్ప వేరొకర్ని పెళ్లాడనన్నా. తాడోపేడో తేల్చుకుందామని రామూ వాళ్లింటికెళ్లా. అప్పుడు బయటపడింది అతడి అసలు స్వరూపం. నీది లోక్యాస్ట్.. నాది హై క్యాస్ట్. నిన్ను చేసుకోవడం కుదరదు. పైగా నా మరదల్ని చేసుకుంటే కోట్ల ఆస్తి దక్కుతుంది. నిన్ను చేసుకుంటే ఏం వస్తుంది? అని కర్కశంగా మాట్లాడాడు. ఆ బాధలోంచి తేరుకోకముందే నాకు మరో షాక్. నేను గర్భవతిని అని తేలింది. అప్పుడూ కరగలేదు. అబార్షన్ చేయించుకో నీకే మంచిది. అని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. మొదటిసారి తనపై అసహ్యం వేసింది. ఇలాంటి వాడినా ఇన్నాళ్లూ ప్రేమించింది అనిపించింది. ఏదేమైనా నిజం తెలుసుకునేలోపే నా జీవితం సర్వనాశనమైంది. ఈ తప్పులో ఇద్దరం దోషులమే. శిక్ష అనుభవిస్తోంది మాత్రం నేనొక్కదాన్నే. నాలా ఎవరూ తొందరపడొద్దని మీ ముందుకొచ్చా.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!