నాడు ఎన్టిఆర్ – నేడు జగన్ వల్లేనా?
తెలుగు నాట చెరిపినా చెరగని చరిత్ర ఆ పార్టీ సొంతం!
Political Story: ఒక్కప్పుడు ఆ పార్టీ దేశానికి దిశా, నిర్థేశంగా మారింది. దేశ ప్రజలకు ఏం కావాలో చేసింది. దేశ భద్రతకు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంది. ఆ పార్టీ నాయకులు ఒక్కప్పుడు తలలో నాలుకగా చలామణి అయ్యారు. వారిని ఎదురించాలన్నా ప్రత్యర్థులకు భయం పుట్టేది. అదే భారతదేశంలో శక్తివంతమైన జాతీయ పార్టీ కాంగ్రెస్(Congress). అయితే ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎదిగిన పార్టీని, ప్రభుత్వాన్ని కూల దోయాలన్నా ఏ పార్టీనైనా గద్దె దించాలంటే ప్రత్యర్థ పార్టీలకు ఎంతో సమయం పట్టదు. కానీ అలాంటి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఎదురించే ప్రయత్నాలు తెలుగునాట జరిగినా ఎంతో కాలం ఆ పార్టీలు నిలవలేకపోయాయి.
గొప్ప విశేషమేమిటంటే తిరగబడ్డ పార్టీల(Political Story)నే తనలో కలుపుకున్న అనకొండలాంటి పార్టీ కాంగ్రెస్‌గా చెప్పవచ్చు. అయితే ఆ పార్టీని ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన వారూ లేకపోలేదు. చర్రితను తిరగరాసిన వారిని గుర్తు చేసుకోక తప్పదు. అందులో తెలుగు ప్రజలు మరిచిపోలేని తిరుగులేని మహానాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(NTR). రెండో వ్యక్తి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS JAGAN).
తెలుగు ప్రజల్లో చైతన్యం నేటిది కాదు. తెలుగు వారు ఎంతటి ఓర్పు కలిగిన వారో అంత చైతన్యవంతులవ్వడానికి స్వతంత్రం మునుపటి నుంచి నేటి వరకూ ఎన్నో సాక్ష్యాలున్నాయి. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. నిజాముల పాలనను ఎండగట్టిన వారిలో కొమరం భీం ముందున్నారు. అప్పటి నుంచే తెలుగు నాట చైతన్య జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. నాటి ఉద్యమాల నుంచి నేటి నవతరం రాజకీయాల(Political Story) వరకూ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వీరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎంతటి వారినైనా మట్టికరిపించగలరు. తాము మెచ్చిన వారిని అందలమెక్కించనూ గలరు.
తిరుగుబాటుకు బీజం వేసిన తెలంగాణ ప్రజా సమితి (Telangana Praja Samithi)
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తూనే వచ్చింది. అలాగే తెలుగు ప్రాంతమైన తన అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన మర్రి చెన్నారెడ్డి 1971లో తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కనీసం 25 శాతం పార్లమెంట్ సీట్లను గెలిచి తన సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలనుకున్నారు. కానీ ఆ విజయం ఎంతో కాలం నిలువలేదు. తిరిగి తెలంగాణ ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పై తిరుగుబాటు జరిగినా ఎంతో కాలం నిలువలేకపోయాయి. కాంగ్రెస్ పాలన పట్ల తెలుగు ప్రజలు విసిగిపోయారు. మరో రెండు దశాబ్ధాల పాటు వారిని భరించక తప్పలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని ఎదురించే చిరుదివ్వె ప్రముఖ మహానటుడు నందమూరి తారక రామారావు రూపంలో ముందుకు వచ్చింది.

అప్పట్లో సంచలన పార్టీగా తెలుగుదేశందే అగ్రస్థానం! (Telugu desham Party)
కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీకి జనం పట్టం కట్టారు. ఎక్కడా లేని విధంగా తిరుగులేని మెజార్టీని అందించారు. 1983లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ దిగ్గజాలు కుప్పకూలాయి. ఎన్టీఆర్ కాంగ్రెస్ కూసాలు కదిలించగలిగారు. ఆయన దేశవ్యాప్త రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించారు. దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రమూ జీర్ణించుకోలేకపోయింది. అంతలోనే తమ వ్యూహాలకు పదను పెట్టి ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడి చేశారు. అయితే అది ఎంతో కాలం నిలువలేకపోయింది. నెల తిరగక ముందే కాంగ్రెస్ పార్టీ జనాగ్రాహానికి గురికాక తప్పలేదు. తర్వాత 1984లో జరిగిన ఎన్నికలలో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి తన సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన కొరకరాని కొయ్యలా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో ఎన్టీఆర్ సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత మూడో సారి ముఖ్యమంత్రి గా సొంత పార్టీలో జరిగిన పరిణామాల కారణంగా ఆయన పదవీచ్యుడయ్యారు.

ఇప్పుడు వైయస్సార్సీపీ వంతు! (YSRCP)
కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ పాలన చేతులు మారుతూ వచ్చింది. అయితే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ పాలనే అయినా ఆయన తన ముద్ర వేసుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పార్టీ నీడ తనపై పడకుండా వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టతలను సాధించగలిగారు. అయితే కాలక్రమంలో ఆయన అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తిగిరి తమ పట్టును సాధించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో తెలంగాణలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పటిష్టంగా తయారవుతోంది. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయనను అనుక్షణం కట్టడి చేసే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఇక జగన్‌పై అవినీతి కేసులు పెట్టారు. అక్రమాస్తుల కేసులో ఆయనను జైలుకు పంపారు. (కేసులు విషయం వాస్తవమా? కాదా? అనేది ఈ స్టోరీకి సంబంధించిన అంశం కాదు.) కేసులు లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు కలిసి వచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్సార్ కాంగ్రెస్ ) పార్టీని స్థాపించారు.
ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణగా,ఆంధ్రాగా విడిపోయాయి. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కి తెలుగు రాష్ట్రాల్లో పతనం ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేని స్థితికి వెళ్లింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ అక్కడ కనీసం తన ఉనికిని నిలుపుకోలేకపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగు స్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వడంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చుకునేందుకు కూడా సాహసించడం లేదనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న మాట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించుకుంటుందా? ప్రస్తుతం కేంద్రలోని బీజేపీ అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ