Core Web Vitals Assessment: panchatantra stories for kids:హంస‌ను మోసం చేసిన కాకి చివ‌ర‌కు...! (తెలు

panchatantra stories for kids:హంస‌ను మోసం చేసిన కాకి చివ‌ర‌కు…! (తెలుగు పంచ‌తంత్ర క‌థ‌లు)

panchatantra stories for kidsఒకానొక అడ‌విలో ఒక హంస ఉంది. అది స‌మీపంలోని స‌ర‌స్సులో విహ‌రిస్తూ కాలం గ‌డిపేది. కొంత కాలానికి ఒక కాకి అక్క‌డ‌కు వ‌చ్చింది. హంస‌ను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చేయాల‌నుకుంది. ఓ రోజు కాకి ఆ హంస ద‌గ్గ‌రికి వెళ్లి విన‌య‌గంగా అయ్యా! హంస గారూ! నేను నీల‌వ‌ర్ణుడ‌నే కాకిని. ఎంతో కాలం నుండి ఎక్క‌డెక్క‌డో తిరిగి పొట్ట‌పోసుకునేవాడిని. ఎందుకో మిమ్ముల‌ని చూడ‌గానే మీతో స్నేహం చేయాల‌నిపించి మీ ద‌గ్గ‌రికి వ‌చ్చాను. అని (panchatantra stories for kids)అంది.

ఓహో! అలాగా! కాకుల‌కు, హంస‌ల‌కు మ‌ధ్య జాతివైరం ఉంది. నీకూ, నాకూ స్నేహం కుద‌ర‌దు. వెళ్లి పో! అంది హంస‌. లేదు! మీరు అలా అన‌కండి. జాతివైరం అనేది ఒక‌ప్ప‌టి మాట‌! ఇప్పుడు కాలం మారి పోయింది. పైగా నేను అలాంటి దానిని కాదు. మీతో స్నేహం చేయాలంటే నాకెంతో ఇష్టం.. అని కాకి బ‌తిమాలుకుంది. జాతి వైరాన్ని ప‌క్క‌న పెట్టి ఇత‌నితో స్నేహం చేస్తే మంచిదా? చెడ్డ‌దా? కాకి వ‌ల్ల త‌న‌కేమైనా అపాయం ఉందా.. అని ఆలోచించ‌సాగింది హంస‌.

అయ్యా! త‌మ‌రు మ‌రీ లోతుగా ఆలోచ‌న చేస్తున్నారు? ఎప్పుడో శ‌తాబ్ధాల జాతి వైరం గురించి ఇప్పుడు ఆలోచ‌న చేయ‌డం ఎందుకు? అప్పుడున్న స‌మ‌యం వేరు, ఇప్పుడున్న కాలం వేరు? కాలం ఎంతో మారిపోయింది. మీరు అంతగా ఆలోచించ‌కండి! నా వ‌ల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు!. అని కాకి అంది. నేను ఎంత ఆలోచించినా, ఎందుకో నాకు నీతో స్నేహం చేయాల‌నిపించ‌ట్లేదు. అని స‌మాధానం చెప్పింది హంస‌. స‌రే! ఏం చేస్తాం? నా ఖ‌ర్మం ఇలా ఉందిలే? అని ఊరుకుంటాను. ఇక వెళ‌తాను. అంది కాకి.

అది చూసి కాకి మీద హంస‌కు జాలేసి స‌ర్లే! మ‌నం ఇప్ప‌టి నుండి స్నేహంగా ఉందాం! అని హంస అంది. కాకి సంతోషంతో హమ్మ‌య్య‌! నాకొక స్నేహితుడు ల‌భించాడు. ఇది చాలు! అని అనుకుని నా స్నేహాన్ని అంగీక‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. ఇక ముందు మీలోని మంచిత‌నాన్ని నేను కూడా అల‌వాటు చేసుకుని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను. అంది.

కొన్నాళ్ల‌కి వేస‌వికాలంలో ఓ రోజు మ‌ధ్యాహ్నం పూట ఓ వేట‌గాడు వేటాడుతూ అల‌సిపోయి, హంస నివాసం ఉంటున్న మ‌ర్రి చెట్టు కింద సేదదీరాడు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌టంతో అత‌డు వెంట‌నే గాఢ నిద్ర‌లోకి వెళ్లిపోయాడు. చెట్టు కొమ్మ‌ల సందుల్లోంచి ఎండ వ‌చ్చి వేట‌గాడి మీద ప‌డుతుండ‌టం చూసి హంస త‌న రెక్క‌ల‌ను చాచి, అత‌ని మీద ఎండ‌ప‌డ‌కుండా చేస్తోంది. ఇంత‌లో అక్క‌డికి కాకి వ‌చ్చింది. హంస చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని చూసి.. ‘అయ్యో! హంస రాజా! వాడు వేట‌గాడు! మ‌న‌కు విరోధి ! అలాంటి విరోధికి నీకు ఎండ‌ప‌డ‌కుండా స‌హాయం చేస్తున్నావా? ఎంత విచిత్రం ఇది?’ అని అంది.

‘విరోధి అయినా, స్నేహితుడు అయినా, మ‌న అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు స‌హాయం చేయ‌డం మ‌న క‌ర్త‌వ్యం!’అంది హంస‌. ‘నీవు పిచ్చిదానివి, విరోధికి స‌హాయం చేయ‌డం ఏమిటి? అది నీ తెలివి త‌క్కువ‌త‌నం కాక‌పోతే!’ అని అంటూ కాకి రెట్ట వేసుకుంటూ ఎగిరి పోయింది. ఆ రెట్ట స‌రిగ్గా వేట‌గాడి ముఖం మీద ప‌డ‌టంతో, గాఢ నిద్ర‌లో ఉన్న వేట‌గాడు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డి లేచాడు. ముఖం మీద ప‌క్షి రెట్ట చూసుకున్నాడు. కోపంతో పైకి చూశాడు. పైన కొమ్మ‌మీద హంస కూర్చుని ఉంది. రెట్ట వేసింది అదే అనుకుని చ‌టుక్కున లేచి ప‌క్క‌నే పెట్టుకున్న విల్లు తీసి బాణం సంధించి హంస‌కేసి వ‌దిలాడు.

క్ష‌ణంలో బాణం వెళ్లి హంస క‌డుపులో గుచ్చుకుంది. ఆ దెబ్బ‌కు కొమ్మ మీద నుండి నేల మీద ప‌డి గిల‌గిలా కొట్టుకొని చ‌నిపోయింది హంస‌. చూశారుగా ! ప‌రోప‌కారి అయిన హంస‌ను దుష్ట‌బుద్ధి గ‌ల కాకి ఎంత న‌ష్ట ప‌రిచిందో? అందుకే దుష్టుల‌తో స్నేహం చేయకూడ‌దు. చేస్తే ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డుతుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *