Padma shri tulasi gowda రాష్ట్రపతి భవన్లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే, సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76 ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే దర్బార్ హాల్లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి. ఆమెను చూడగానే అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించింది. ఏ క్షణాన ఆమెకు తులసి అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్టుగా ఆమె జీవితం కూడా ప్రకృతిలో (Padma shri tulasi gowda) మమేకమైనది.
సాధారణంగా రాణులు కోటలు కడుతారు. కానీ కర్ణాటకకు చెందిన ఈ మనుసున్న మారాణి తులసి మాత్రం ప్రత్యేకమైన కోటను నిర్మించింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే సృష్టించింది. గత ఆరు దశాబ్ధాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే పద్మశ్రీ అవార్డును తెచ్చి పెట్టింది. ఎంతో మంది ప్రముఖల మధ్య సోమవారం ఆమె దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పెద్దావిడను చూడగానే మోడీ కూడా ఎంతో గౌరవంగా ప్రతి నమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది. కర్ణాటకలోని అంకోలా తాలూకా హెన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ, హలక్కీ గిరిజిన కుటుంబంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు.


దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలికి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసికి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించారు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె ఎప్పుడూ కుంగిపోయేది. దీని నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవి. అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది. చిన్నతనం నుంచే తులసికి మొక్కలంటే ప్రాణం. ఎన్నో రకాల మొక్కలు నాటేది. రాను రాను అదే తన జీవితం అయిపోయింది. ఆమె మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు.
ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెకు శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఇలా 14 ఏళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. అరవై ఏళ్లలో తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు. తులసి చదువుకోలేదు గానీ ఆమెకు చెట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఎప్పుడు నాటాలి. ఎన్ని నీళ్లు పోయాలి. దాని జీవితకాం ఔషధ గుణాలు, ఏది అడిగినా చటుక్కున చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడేంత వృక్ష విజ్ఞానం ఆమె సొంతం. అందుకే పర్యావర్ణ వేత్తలు ఆమెను ఎన్సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు.


కానీ ఆమె ఊరి వాళ్లు మాత్రం ఆమెను వనదేవతగా కొలుస్తారు. ఆమెను చూడటానికి చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అరుదైన వృక్షాల జాతుల గురించి తెలుసుకుని పోతుంటారు. 76 ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను డబ్బులన్నింటినీ దీనికే ఖర్చు చేస్తున్నారు. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. మొక్క నాటితేనే సంతృప్తి రాదు. అది మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం..!
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!