New Covid Strain :Hyderabad: కరోనా మళ్లీ చెలరేగుతోంది. సెకండ్ వే స్ట్రెయిన్ భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మళ్లీ వస్తోంది. ఈ నేపథ్యంలో జనం సందిగ్ధంలో పడిపోతున్నారు. రూపం మార్చుకొని పాత లక్షణాలతో పాటు మరికొన్ని కొత్త లక్షణాలతో ప్రజలపై సెకండ్ స్ట్రెయిన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో జనం సందిగ్ధంలో పడిపోతున్నారు. మళ్లీ గతేడాది చీకటి గడియలు సమీపిస్తాయా? అనే ఆలోచనలో పడ్డారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రమూ సీరియస్‌గా తీసుకునే ఆలోచనలో లేకుండా వ్యవహరి స్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాచుతోంది. సరిగ్గ ఏడాది కిందట తొలినాళ్లలో ఈ వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆ భయం మళ్లీ జనాల ముఖాల్లో కనిపించే పరిస్థితులు వస్తున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కారణం సెకండ్ స్ట్రెయిన్ వైరస్ పుంజుకోవడమే. కరోనా సెకండ్ స్ట్రెయిన్ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి కరోనా వైరస్ లక్షణాలు ఒకరంగా ఉంటే, ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ కరోనా లక్షణాలు మరొకలా ఉన్నాయి. వాసన లేకపోవడం, రుచి తెలియకపోవడం, దగ్గు, జలుపు లాంటివి పాత లక్షణాలు అయితే, సెకండ్ స్ట్రెయిన్ లో డయేరియా, గొంతు నొప్పి, చాతిలో నొప్పి, కళ్లలో మంట, చర్మం మీద దద్దుర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వ్యాపిస్తున్న వైరస్ మహా ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సెకండ్ స్ట్రెయిన్ వైరస్ ఊపిరితిత్తుల మీద, జీర్ణ వ్యవస్థ మీద, కళ్లపై ప్రభావం చూపుతోంది.

వ్యాక్సిన్ అంటే భయం!
కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్కరూ వేసుకునేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ తొలుత ఫ్రంట్ వారియర్స్ కు వేశారు. అయితే ఈ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు జనం భయపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరు చనిపోవడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా వేసుకోవాలంటే జనాలు ముందుకు రావడం లేదు. అయితే కరోనాను పూర్తిగా అంతమొందించే పరిస్థితి ఇప్పటిలో లేదని, కేవలం వ్యాక్సిన్ మాత్రమే మన ముందు ఉన్న ఆయుధమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటీవల వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా కరోనా మళ్లీ రావడంతో వ్యాక్సిన్ ప్రభావం నామమాత్రంగానే మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో రెండు సార్లు వ్యాక్సిన్ వేసుకున్నాడు ఓ బ్లండ్ బ్యాంకు ఉద్యోగి. గత నెల 18న మొదటి విడత, ఈ నెల 18న రెండో విడత డోస్ వేసుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు చేసిన టెస్టుల్లో కరోనా మళ్లీ కనిపించింది. అదే విధంగా రామగుండం ఎన్టీపీసీలో వ్యాక్సిన్ వేసుకున్న ఎస్బిఐ మేనేజర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బ్యాకు సిబ్బందితో పాటు, ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది అంతా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సిద్ధిపేట జిల్లా లో ఓ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు, కొందరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కూడా రెండో దశ కరోనా కేసులు వెలుగు చూశాయి. కోట మండలం విద్యానగర్‌లో 5 కేసులను అధికారులు గుర్తించారు. వాళ్లందరినీ హోం క్వారంటైన్లో ఉంచారు.
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు!
గతేడాది భారత్ లో మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. కానీ సెకండ్ స్ట్రెయిన్ వైరస్ కేసులు ప్రస్తుతం పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, వైద్య పరీక్షలు చేయడంలో వేగం పెంచింది. మహారాష్ట్రలోనూ, కర్ణాటక రాష్ట్రంలో సెకండ్ స్ట్రెయిన్ కేసులు పెరగడంతో తెలంగాణ సరిహద్దుల్లో ఆందోళన మొదలైంది. నిజామాబాద్ సరిహద్దు సాలూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దు దాటి వచ్చే వారిపై నిఘా పెంచే యోచనలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు!
కరోనా సెకండ్ స్ట్రెయిన్ కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. సమీప రాష్ట్రాలు సెకండ్ వే కేసులపై అప్రమత్తంగా ఉంటుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో, సెకండ్ స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి సెకండ్ స్ట్రెయిన్ వైరస్ విషయంలో హైకోర్టు కొన్ని దిశ, నిర్ధేశిత ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత పెంచాలని, వారికి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా సీరం సర్వే చేయాలని, అనంతరం ఆ నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా కరోనా వైరస్ గతేడాది సృష్టించిన విలయతాండవం నుంచి దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటేంటే మళ్లీ సెకండ్ స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి:పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇది చదవండి:బ్రిందలో అరుదైన శస్త్ర చికిత్స
ఇది చదవండి:రైతు గొప్పతనాన్ని తెలిపిన శ్రీకారం మూవీ సాంగ్ సూపర్!
ఇది చదవండి:వెంకన్న సన్నిధిలో భక్తులకు పెద్దపీట!
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన విలేకర్లు అరెస్టు
ఇది చదవండి:ప్రస్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!