Core Web Vitals Assessment: Nepal Parliament:నేపాల్ పార్ల‌మెంట్ ర‌ద్దు ఎప్పుడ‌య్యింది? ఎందుక‌య్యిందో

Nepal Parliament:నేపాల్ పార్ల‌మెంట్ ర‌ద్దు ఎప్పుడ‌య్యింది? ఎందుక‌య్యిందో తెలుసా?

Nepal Parliament నేపాల్ పార్ల‌మెంట్ ర‌ద్దుకు ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ 2020 డిసెంబ‌ర్ 20న సిఫార్సు చేశారు. ఆయ‌న నేతృత్వంలో మంత్రి వ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింది. దీంతో దేశాధ్య‌క్షురాలు విద్యాదేవి భండారీ నేపాల్ పార్ల‌మెంటు ప్ర‌తినిధుల స‌భ‌(హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌)ను ర‌ద్దు చేశారు. వెంట‌నే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల తేదీల‌ను (Nepal Parliament) ప్ర‌క‌టించారు.

అధికారం కోసం మాజీ ప్ర‌ధాని పుష్ఫ‌క‌మాల్ ద‌హ‌ల్ (ప్ర‌చండ‌)కు -ఓలీకు మ‌ధ్య కొంత‌కాలంగా సొంత‌పారీ్ట అధికార నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) లో అంత‌ర్గ‌త పోరు కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఓలీ తీసుకున్న తాజా నిర్ణ‌యం వివాదాస్ప‌దం అయ్యింది. దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) మండిప‌డింది. NCPలోనే ఓ వ‌ర్గం దుయ్య‌బ‌ట్టింది. రాజ్యాంగ నిపుణులు కూడా ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతున్నారు.

నేపాల్ పార్ల‌మెంట్‌లో దిగువ స‌భ‌గా పిలిచే ప్ర‌తినిధుల స‌భ‌లో 275 మంది స‌భ్యులుంటారు. దీనికి 2017లో ఎన్నిక‌లు జ‌రిగాయి. కాల ప‌రిమితి ఐదేళ్లుగా కాగా ఆక‌స్మికంగా స‌భ ర‌ద్ద‌వ్వ‌డంతో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అయితే 2020 ఏప్రిల్ 30న తొలిద‌శ‌, 2021 మే 10న రెండో ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు నేపాల్ రాష్ట్రప‌తి భ‌వ‌న్ వెల్ల‌డించింది.

ఎన్‌సీపీలో కొన‌సాగిన అంత‌ర్గ‌త పోరు

ఓలీ నేతృత్వంలోని సీపీఎస్ – యూఎంఎల్‌, ప్ర‌చండ నాయ‌క‌త్వంలోని సీపీఎస్ (మావోయిస్ట్ సెంట‌ర్‌)లు 2018 మేలో విలీన‌మై ఎన్‌సీపీగా ఏర్ప‌డ్డాయి. అనంత‌రం పార్టీలో ఈ రెండూ వ‌ర్గాలుగా త‌యార‌య్యాయి. ఓ వ‌ర్గాన్ని పార్టీ ఛైర్మ‌న్ ఓలీ, మ‌రో వ‌ర్గాన్ని ప్ర‌చండ న‌డిపిస్తున్నారు. కొంత‌కాలంగా ప్ర‌చండతో పాటు ఆ వ‌ర్గంలోని కీల‌క నేత‌, మాజీ ప్ర‌ధాని మాధ‌వ్ కుమార్ నేపాల్‌లు ఓలీని ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వాన్ని, పార్టీని న‌డిపించ‌డంలో ఓలీ విఫ‌ల‌మ‌య్యార‌ని, ఓలీ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఓలీ ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ వ‌స్తున్నారు. ఓలీ నిర్ణ‌యంతో అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఆయ‌న మంత్రివ‌ర్గంలో ఏడుగురు (ప్రచండ వ‌ర్గీయులు) వెంట‌నే రాజీనామా చేశారు.

ఓలీ నిర్ణ‌యం ప్ర‌జాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగానికి వ్య‌తిరేకం, నిరంకుశ‌మ‌ని ఎన్‌సీపీ అధికార ప్ర‌తినిధి నారాయ‌ణ‌కాజీ శ్రేష్ట‌, సీనియ‌ర్ నేత మాధ‌వ్ కుమార్ నేపాల్‌లు దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవాలంటే పార్టీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఓ పార్టీకి స్ప‌ష్ట‌మైన మోజార్టీ ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని పార్ల‌మెంటును ర‌ద్దు చేయ‌డాన్ని రాజ్యాంగం అనుమ‌తించ‌ద‌ని, దీన్ని న్యాయ స్థానంలో స‌వాల్ చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

అంత‌ర్జాతీయ వైఖ‌రి..

ఓలీ చైనాకు అనుకూల ధోర‌ణిని క‌న‌బ‌రుస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. కొద్ది నెల‌ల క్రితం ఆయ‌న ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా 3 కీల‌క భార‌త భూభాగాల‌ను (లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా) త‌మ‌విగా చూపిస్తూ నేపాల్ దేశ ప‌టాన్ని మార్చ‌డంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. నేపాల్ చేస్తున్న ఈ కృత్రిమ విస్త‌ర‌ణ ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని భార‌త్ గ‌ట్టిగా అభ్యంత‌రం తెలిపింది కూడా.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *