Letter: కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో 17 జూన్ 2021న ఉదయం 6.45 గంటలకు ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ గుండాల చేతిలో హత్యకు గురైన ఇద్దరు సోదరులు ఉదంతంపై ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిజిపి గౌతం సవాంగ్‌కు లేఖ(Letter) రాశారు.
ఇటువంటి క్రూరమైన, అనాగరిక, భయంకరమైన హింసాత్మక చర్యలకు నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో స్థానం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇద్దరు సోదరులైన వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిని స్థానికులైన వైసీపీ గుండాలు హత్య చేశారన్నారు. హత్యకు గురైన సోదరులు తమ్ముడు వడ్డు మోహన్ రెడ్డికి నివాళి అర్పించేందుకు స్మశాన వాటికకు వెళుతున్న సమయంలో వీరు హత్య చేపబడ్డారన్నారు.
ఈ హత్యకు సంబంధించి అదే రోజు ఒక ఫిర్యాదు దాఖలు చేయబడి ఎఫ్ఐఆర్(FIR) కూడా నమోదు అయ్యిందన్నారు. ఇంతటి అనాగరిక చర్యలకు పాల్పడి, పక్కా సాక్ష్యాలు ఉన్నప్పటికీ దోషులు నిర్భయంగా బయట తిరుగుతున్నారన్నారు.
అంతేకాకుండా దోషులు బాధితుల కుటుంబ సభ్యులను, సాక్షులను బెదిరిస్తున్నారని, ఫిర్యాదు దారులకు, సాక్షులకు, వారి కుటంబ సభ్యులకు ఫోన్ ద్వారా మరియు భౌతికంగా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. దోషులు ఒక వర్గం పోలీసులతో కుమ్మక్కై పిర్యాదు దారులు, బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల ప్రాణాలకు, ఆస్తికి తీవ్రమైన ముప్పు కల్పించాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి ఫిర్యాదుదారులకు, సాక్షులకు, కుటుంబ సభ్యులకు రక్షణ, భద్రత కల్పించాలని డిజిపిని చంద్రబాబు పంపిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
హత్య తర్వాత ఏం జరిగింది? ఎవరేమన్నారు?
వడ్డు సోదరుల హత్య జరిగిన మర్నాడే అంటే జూలై 18న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వడ్డు సోదరుల దారుణ హత్య నేపథ్యంలో పెసరవాయి గ్రామంలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత ఎలాంటి కేసు నమోద చేయలేదు. కేసు నమోదు విషయంలో తీవ్ర విమర్శలు రేకెత్తిన నేపథ్యంలో వడ్డు ప్రతాప్‌రెడ్డి భార్య ఫిర్యాదుతో చాలా ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యలు వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోదరుల హత్యతో జిల్లాలోనే కాకుండా యావత్తు ఏపీ మొత్తంగా టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడ్డు సోదరులకు నివాళి అర్పించిన లోకేష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీకి అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికేనని, అయితే ఆ పనిని పక్కనపెట్టి జగన్ రెడ్డి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్న జగన్ అండ్ కో.. వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డిని, వైసీపీ నేతలను తాము వదిలిపెట్టబోమని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది టిడిపినేనని అన్ని ఘటనలకు వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు.