Nagarjuna Sagar constituency by-election | Nagarjuna Sagar By-Election Notification | సాగర్ ఉప ఎన్నిక పై గురి?Nalgonda: నాగార్జున సాగర్ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు వస్తుందా? లేదా రెండుమూడు నెలలు తర్వాత వస్తుందా? అనే విషయం సందిగ్థంలో పడింది. టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
వేగం పెంచిన బీజేపీ!
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరగనుందనే అంశంపై రాజకీయ పార్టీలతో పాటు నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. అయితే ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జిహెచ్ఎంసి లో మెరుగైన ఫలితాలు సాధించిన భారత జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ రాష్ట్రంలో వేగం పెంచింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి అధికార పార్టీ టిఆర్ఎస్కు గట్టి పోటీని ఇచ్చింది బిజెపి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యా మ్నాయం తామేనని పలు మీడియా సమావేశాలు అగ్ర నాయకులు చెబుతూ వస్తున్నారు.
ఇదే క్రమంలో రెండు నెలల్లో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైబిజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూబ్నగర్ స్థానం ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్నాయి. మరో నియోజకవర్గమైన నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో పాత స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మరో స్థానాన్ని గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు బిజెపి ముఖ్య నాయకులు వరుస పర్యటనలు చేస్తూ ఇతర పార్టీల నుండి చేరికలపై దృష్టి సారించారు.
గత ఎన్నికల్లో నాగార్జున సాగర్ స్థానం నుండి బిజెపికి కేవలం 2,700 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ స్థానంలో సంస్థాగతంగా కూడా పెద్ద పట్టు లేదు. సాగర్ ఉప ఎన్నిక ఎక్కువుగా కాంగ్రెస్, టిఆర్ఎస్ నడుమే పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపినే పోటీ ఇస్తుందనే వాదన నడుస్తున్నప్పటికీ బ్రేక్ పడే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రభావం ఎమ్మెల్సీ, ఇతర మున్సిపల్ ఎన్నికలపై పడితే బిజెపి ఎదుగుదలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలా కాకుండా ఈ ఎన్నికలు పూర్తయ్యాక సాగర్ ఉప ఎన్నిక జరిగితే తమకు లాభం చేకూరుతుందని బిజెపి శ్రేణుల్లో ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందుకే ఉప ఎన్నిక ఇప్పట్లో జరుగుతాయా, తర్వాత జరుగుతాయా అనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. గతేడాది సిఎం కుమార్తె, టిఆర్ఎస్ మాజీ ఎంపి కవిత పోటీ ఏసిన నిజామాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నామినేషన్లు వేశాక రెండు మార్లు పోలింగ్ వాయిదా పడింది.
అక్కడ తాము గెలిచే అవకాశం ఉండటంతో కావాలనే పోలింగ్ వాయిదా పడ్డదని టిఆర్ఎస్ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రెండు స్థానాలు దాదాపు సగం రాష్ట్రం పరిధిలో ఉండటంతో ఎన్నికల కమిషన్ యంత్రాంగం దానిపైనే దృష్టి సారిస్తోంది. పైగా ఉప ఎన్నిక జరగాల్సిన నాగార్జున సాగర్ కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఈ కారణమేమైనా సాగర్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యేందుకు కారణమవుతుందా? అనే అనుమానాలు కూడా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరగనున్నాయి. ఒక వేళ అంతకుముందు ఉప ఎన్నిక జరగకపోతే, ఏప్రిల్, మే నెలలో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటే నాగార్జున సాగర్ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తారేమో చూడాలి మరి!.
క్లిక్ చేయండి: సీఎం జగన్ ఫొటోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా కావాలా! అయితే ఫ్రీ డౌన్ లోడు చేసుకోండి!