Gangavva Story: జీవితంలో సాధించాలనే తపన ఉంటే దానికి వయసుతో పనిలేదని చెప్పిన గంగవ్వ ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా చలాకీగా ఉండి అందర్నీ నవ్విస్తూ కొన్ని లక్షల మంది ప్రేక్షకుల అభిమానిగా మారిన గంగవ్వ జీవితంలోకి తొంగి చూస్తే నిజంగా కన్నీళ్లు రాక మానవు. ఆమె నమ్ముకున్న కష్టమే ఇప్పుడు ఈ స్థాయిలో నిలిపింది. బతికి సాధించాలి గాని.. సచ్చి సాధించలేము అంటూ ఆమె చెప్పే మాటలు ఒక మోటివేషనల్ స్టోరీ(Gangavva Story)ని తలపిస్తాయి. My Village show తో ప్రారంభమైన గంగవ్వ ప్రస్థానం ఇప్పుడు విజయతీరాలను తాకిందనే చెప్పాలి. ఆమె జీవితంలో పడిన కష్టాలను ఆమె చెప్పిన విధంగా ఒక్కసారి తెలుసుకుందాం!
నా పేరు మిలుకూరి గంగవ్వ. నేను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే మా అవ్వ, నాయన చనిపోయారు. అప్పుడు నన్ను మా అవ్వ తల్లీదండ్రి సాదారు. వారు సాదినంక నాకు 5 ఏళ్లకే నా నాన్న తోడ పుట్టిన అక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయినంక లంబాడి పల్లెలోనే నా అత్త సాదింది. అలా సాదిన తర్వాత నాకు 10 ఏళ్లు వచ్చాయి. నా అత్త పనికి వెళ్లినప్పుడు నన్ను కూడా ఆమెతో పాటు పనికి తీసుకెళ్లేది.
అప్పుడు ఆడవాళ్లకు లంగాలు, జాకెట్లు లేవు. వల్లెలు వేసుకొని ధరించేవారు. ఆ తర్వాత మా అత్త కొద్ది కాలానికి చీరలు తెచ్చి నాకు కట్టింది. అలా పెంచిన తర్వాత నాకు 26 ఏళ్లు వచ్చాయి. ఆ వయసుకు వచ్చిన తర్వాత నేను 4గురు పిల్లల్ని కన్నాను.

4గురు పిల్లల్ని కనిన తర్వాత మా ఆయన దేశం పోయిండు.. అంటే దుబాయ్ పోయిండు. అలా వెళ్లిన మా ఆయన దుబాయ్ నుంచి 50 వేల అప్పుతో వచ్చాడు. 13 ఏళ్లు దుబాయ్‌లో ఉన్న మా ఆయన ఒక్క రూపాయి కూడా నాకు పంపలేదు. అలా పంపకపోవడంతో నా చిన్న బిడ్డకు పిడుసులు వచ్చాయి.
అయితే నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. బాకీ ఉన్నానని ఒక్కరు కూడా ఒక్క పైసా అప్పు ఇవ్వలేదు. ఆ తర్వాత 2వ తరగతి చదువుతున్న నా బిడ్డ 8 ఏళ్ల వయసులో చనిపోయింది. ఆ తర్వాత నేను అందరితో కలిసి మక్క, జొన్న, వరి కోయడానికి కూలికి వెళ్లాను. బావిలో నీళ్లను చేది పొలం మడి నిండే వరకు నీళ్లు పోసేందుకు వెళ్లాను. మా అత్త ఒక పక్క , నేను ఒక పక్క ఉండి కావిడి మోస్తూ గుంజితే నీళ్లు వచ్చేవి.
అలా పంటలు పండించుకున్న తర్వాత నా పెద్ద బిడ్డకు 15 సంవత్సరాలు వచ్చాయి. పెద్దదైంది. అయిన వారిలో బంధువులు వచ్చి గంగవ్వ నీ బిడ్డను ఇస్తవానే అని నన్ను అడిగారు. నా పెద్ద బిడ్డకు ఇంతో అంతో అప్పు చేసి పెళ్లి చేసిన. ఆ తర్వాత మరో బిడ్డకు ఊళ్లోనే సంబంధం వచ్చింది. ఈ అప్పు తీరకుండా పెళ్లి ఎలా చేయాలనుకున్నాను.
నా దగ్గర భూమి ఉండటం వల్ల వేరే వాళ్లు మళ్లా అప్పు ఇచ్చారు. ఆ డబ్బులతో చిన్న బిడ్డకు ఊళ్లనే పెళ్లి చేసినా. ఒక బిడ్డ చనిపోయింది. ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసిన. ఇక కొడుకు ఉన్నాడు. కొడుకుకు పెళ్లి చేస్తే కట్నం వస్తది. ఆ కట్నంతో అప్పులు తీర్చుదామనుకున్న. నా కొడుకు కట్నంగా రూ.50,000 వేలు ఇస్తామన్నరు. అయితే డబ్బులు ఇవ్వకుండా ఆ 50,000 వేలకు బంగారమే పెట్టుకున్నారు వారి పిల్లకు. ఇక నేను చేసిన అప్పులు పెరిగినాయి.

నాకు కొంచెం భూమి ఉన్నది. ఇక చేసేది ఏమీ లేక భూమి అమ్మి అప్పులు తీర్చాను. మా మామ మంచిగా లేకపోవడంతో అతను చనిపోయాడు. మా అత్త కూడా చనిపోయింది. వారి కర్మఖాండాలు నేనే చేసిన. తర్వాత మళ్లీ వ్యవసాయ కూలికి వెళ్లాను. ఆ తర్వాత కొంత మందిని ముఠాగా చేసుకొని పనికి తీసుకెళ్లిన.
టకలపెల్లి, దోమలకుంట, తాటిపెల్లి, లంబాడి తండాలో నా తో పాటు వచ్చే కూలీలతో ముఠాగా పనిచేసిన. కానీ నాకు వచ్చే కూలి నా కుటుంబానికి సరిపోవడం లేదు. ఈ అప్పులకు సరిపోవడం లేదు. ఎలా బతకాలని మదన పడ్డ. ఇక ఇలా అయితే బతకడం కష్టమనుకున్న. ఉన్న భూమి అమ్మిన, పిల్లలకు పెళ్లి చేసిన ఇక దుబాయ్ వెళ్లిన మా ఆయన వచ్చాడు. పచ్చి తాగుబోతు. ఎప్పుడూ తాగుతూనే ఉంటాటు.
నన్ను కొడుతూ, తిడుతూ చాలా ఇబ్బంది పెట్టాడు మా ఆయన. నేను పడిన బాధలు లంబాడి పల్లెలో ఎవ్వరూ పడలేదు. ఇక నేను భర్త పెట్టే ఇబ్బందులను పక్కన పెట్టి పిల్లలను చూసుకుంటా కూలి చేసుకుంటూ బతికాను.

మా అల్లుడు శ్రీకాంత్ మా ఇంటికి వచ్చింది. గంగవ్వ ఏం చేస్తున్నావన్నాడు . వచ్చేటప్పుడు ఒక కెమెరా తీసుకొచ్చిండు. నేను కట్టెల పొయ్యి వద్ద ఉన్నాను. గంగవ్వ నీకు ఏమైనా పాటలు వస్తయా, మాటలు వస్తయా అని శ్రీకాంత్ అడిగిండు. అప్పుడు నాయనా నాకు పాటలు రావు ఏడుపు బాగా వస్తది. మాటలు వస్తయి అని చెప్పిన. నా చిన్నప్పుడు జరిగిన బాధలు, కష్టాలు అన్నీ మాట్లాడిన అయితే అల్లుడు శ్రీకాంత్ వాటిని యూట్యూబ్‌లో పెట్టిండు.
మలొక్కనాడు నావద్దకు వచ్చిండు. మళ్లీ మాట్లాడు..మాట్లాడు అంటూ ఉన్నాడు. ఫోన్ కొనిత్తవా..ఫోన్ కొనిత్తవా అంటూ మధ్యలో ఒక చిన్న పోరడు వచ్చింది. పోరికిత్తావురా..పోరికిత్తావురా ..ఏందిరా నువ్వు..ఏ పోను పోను అంటున్నవు..నీ ఇంట్ల పీనగెల్లా..అని అన్నా. మల్లేదో తూట్ల పాయింట్ అంటా. అది అంతా చినిగిపోయినది. ప్యాంట్లు చినిగిపోయినవి డబ్బులు ఇవ్వు గంగవ్వ అన్నడు. డబ్బులు ఇచ్చిన. అయితే చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వచ్చాడు. అది చేదో ఫ్యాసనో..పాసనో నాకు తెల్వదు.
ఇలా వీడియోలు చేస్తుండగా వాటిని యూట్యూబ్‌లో పెట్టిండు. ఇంతో అంతో ఆ వీడియోలు పేమస్ అయినవి. ఇలా వీడియోలు చేస్తుండగా ఇంటి కాడినే ఉన్న. అయితే నా సోపతోల్లు వచ్చి గంగవ్వ నువ్వు ఇంటికాడినే ఉంటువు. ఏదైనా పనికి మమ్మల్నీ తీసుకుపోతే ఒక పది రూపాయలు వస్తయగా అంటున్నరు.
అయితే మా శ్రీకాంత్ గంగవ్వ నువ్వు ఎటూ పోవద్దు. నీ వీడియోలు తీసుకుంటా ఉంటాము అన్నరు. అలా వీడియోలు యూట్యూబ్‌లో చూసిన చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ముసలివాళ్లు నవ్వుకుంటూ నాకు ఫ్యాన్స్ అయినట్టు తెలిసింది. ఇక మా ఇంటికి ఫ్యాన్స్ వచ్చుడు..పోవుడు సెలిపీలు దిగుడు జరిగింది. కార్లు.. జీపులు మా ఇంటికి వచ్చేటల్లా నాకు సతం మంచిగా అనిపించింది.

ఇప్పుడు నాకు 60 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసిన. పెద్ద పెద్ద హీరోలను చూసిన. అయితే సమంతతోని కొన్ని కొశ్చన్లు మాట్లాడిన. ఆమె మస్తు నవింది. నందిని రెడ్డి మాట్లాడింది. కాజల్ సతం మాట్లాడింది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో నేను అష్టచమ్మ ఆడినా(నవ్వుతూ)..
అప్పుడు లంబాడిపల్లె , మల్లెల ఎరుక.. ఇప్పుడు హైదరాబాద్ ఎరుక. వారానికి ఒకసారి హైదరాబాద్ వస్తున్న. 15 రోజులకొకసారి వస్తున్న. నెలకొకసారి వస్తున్న.నాకు మస్తు మంది ఫేమస్ అయితాండ్రు. ఇంకా నేను చదువుకోపోతి. నాలుగు ముక్కల అక్షరాలు వస్తే ఇంకా మంచిగా చెబుతుంటిని. ఇప్పుడు 60 ఏళ్లు దాటినవి. మీ దయ వల్ల బాగున్న. అందరూ మంచిగా చదువుకోండి. పైకి రావాలి. మనం ఉండి సాధించాలే..చచ్చి సాధించలేము. ఆ భగవంతుడు మనల్ని ఇచ్చిండు. మంచిగా ఉండాలి. అమ్మను నాన్నను మంచిగా చూసుకోవాలే. మీ అందరికీ నమస్కారం.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి