MP Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఇది అక్రమ అరెస్టు అంటూ పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించే వారందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్టు చేస్తుందని ఆయా పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MP Raghu Rama Krishna Raju : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడి పోలీసులు శుక్రవారం హైదరాబాద్లో తన స్వగృహంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు, బారీగేట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని 124 ఐపీసీ – ఎ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపి ని అక్రమంగా అరెస్టు చేశారని ఏపీలో ప్రతిపక్ష పార్టీ టిడిపితో సహా ప్రధాన పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది అప్రజాస్వామ్య బద్ధమని తెలిపాయి.
అరెస్టును ఖండించిన సిపిఐ
ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మర్గ చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతం కలిగిస్తాయన్నారు. దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే సీఎం జగన్ కక్ష పూరిత విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఎంపీని అరెస్టు చేయించి జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేదిలేదనే సంకేతాలిస్తున్నారని విమర్శించారు.
కక్ష సాధింపు చర్యే రాష్ట్ర క్షత్రియ సంఘం
ఎంపి రఘురామకృష్ణ రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. ఇది కక్ష సాధింపులో భాగమేనని అన్నారు. బెయిల్ రద్దు చెయ్యమని పిటిషన్ వేసినందుకు పగబట్టి కావాలని అక్రమ అరెస్టు చూపించారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని నిలదీశారు. ఈ అక్రమ అరెస్టుల మీద దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలైనా కాపాడవచ్చు అని హితువు పలికారు. తమ కేసుల విచారణకు ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మంటున్నారని కక్షతో ప్రతి శుక్రవారం ఒక అక్రమ అరెస్టు చేస్తున్నారా? అని విరుచుకుపడ్డారు. తమరు పెట్టే అక్రమ కేసులకు త్వరలోనే న్యాయస్థానాలు మళ్లీ మొట్టికాయలు వేయడం ఖాయమన్నారు. తక్షణమే ఎంపీపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియుల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని రఘురామరాజు హెచ్చరించారు.
తప్పుబట్టిన అమరావతి రైతులు
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన విధానాన్ని అమరావతి రైతులు తప్పుబట్టారు. ఏపీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదా? అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతకన్నా దారుణంగా మాట్లాడారన్నారు. మరి వీర్నెందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రాజధాని అమరావతికి ఎవరు అనుకూలంగా మాట్లాడినా వారిపై ప్రభుత్వం కక్షగడుతోందని విమర్శించారు. వ్యాక్సిన్లు వచ్చినా వాటిని పూర్తిగా వేయకుండా వేరేచోటకు తరలిస్తోన్నారని, రాజధాని గ్రామాల్లో ఎక్కడా గ్రామ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ రాష్ట్ర పౌరులం కాదా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు 18 సంవత్సరాలు ఉన్నా వ్యాక్సిన్ వేస్తున్నారని, వేరేవాళ్లకు మాత్రం వ్యాక్సిన్ అందనివ్వడం లేదని ఆరోపించారు. ఎక్కడో ఉన్న లోకేష్ ఏయిమ్స్లో వ్యాక్సినేషన్ కు ప్రయత్నం చేస్తే అది కూడా జరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో ఫిర్యాదు చేయడమే తప్పా: వర్ల
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఆయన ఫిర్యాదు చేయడమేనని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేయడం, కోర్టు దానిని అంగీకరించడం, ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అభాసుపాలు కావడమే ఇందుకు కారణమని అన్నారు. న్యాయవ్యవస్థ కూడా విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదని వర్ల రామయ్య పేర్కొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!