Mercury Planet: ప్రపంచ జనాభా పెరుగుతున్న జోరు చూస్తుంటే, ఇక భూమి మీద మనిషికి చోటు సరిపోని రోజు ఎప్పుడో ఒకప్పుడు రాక మానదు. భూమి తర్వాత ఎక్కడ అన్న ప్రశ్న మనిషిని ఎంతో కాలంగా వేధిస్తుంది. అయితే ఇతర గ్రహాల మీద మానవ నివాసం వీలవుతుందా? అని ఆలోచిస్తే, పొరుగు గ్రహాలైన శుక్ర, బుధ గ్రహాలను ఒక పక్క, అంగారక గ్రహాన్ని మరో పక్క మొట్ట మొదట పరిగణించాల్సి ఉంటుంది.
Mercury Planet | బుధుడిపై మకాం సాధ్యమా?
సూర్యుడు దిశలో ఇంకా లోపలికి పోతే, మానవ నివాసానికి అవకాశాలు సన్నగిల్లుతాయి. సూర్యుడికి అతి దగ్గరలో ఉన్న గ్రహం బుధుడు. రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ గ్రహం ఉనికి గురించి మనిషికి తెలుసు. క్రీ.పూ. 4వ శతాబ్ధంలో గ్రీకు ఖగోళ శాస్త్రవేత్లు ఈ గ్రహం (Mercury Planet) నిజానికి రెండు వేర్వేరు గ్రహాలని భ్రమపడ్డారు. ఒకటి సూర్యోదయ సమయంలోనే కనిపించేది. దీన్ని అపోలో అన్నారు. రెండోది సూర్యాస్తమయ సమయంలో కనిపించేది దీన్ని హెర్మిస్ అన్నారు.
అపోలో, హెర్మిస్ రెండూ నిజానికి ఒక్కటేనని తెలిసిన చాలా కాలానికి రోమన్లు దీనికి రోమన్ దేవత అయిన మెర్క్యూరీ పేరు పెట్టారు. ప్రాచీన భారత ఖగోళ విజ్ఞానంలో దీన్ని బుధ గ్రహం అంటారు. బుధ గ్రహం సూర్యుడికి మరీ దగ్గర కావడంతో, నివాసం దుర్భరంగా ఉంటుంది. బుధుడు ఉపరితలం మీద పగటి ఉష్ణోగ్రత 427 డిగ్రీల సెంటీగ్రేడు. సీసాన్ని కరిగించగల ఉష్ణోగ్రత అన్నమాట. అయితే మెర్క్యూరీ ధృవప్రాంతాలు మరింత చల్లగా ఉంటాయి.


అక్కడ ఉష్ణోగ్రత -183 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పోతుంది. ధృవాల వద్ద ఉండే ఉల్కాబిలాల (Craters)లో శాశ్వత హిమం పుష్కలంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బుధగ్రహ నేలలో హీలియం-3 సమృద్ధిగా ఉండొచ్చని కూడా అంచనాలు ఉన్నాయి. ఈ హీలియం-3 కేంద్ర సంయోగానికి పనికొస్తుంది కాబట్టి ముందు ముందు ఆర్థిక ప్రగతి కావాల్సిన ఒక ముఖ్యమైన పదార్థంగా పరిణమిస్తుందన్న అవగాహన ఇప్పటికే ఉంది. ఇది కూడా Mercury Planet మీద మనిషి కన్నేసి ఉంచడానికి ఒక కారణం.
ప్రయాణానికి అనువైన ప్రదేశం!
బుధగ్రహ నివాసన యోగ్యతని మరింత బలహీనపరిచే విషయం మరొకటి ఉంది. అయితే అది నివాసానికి కాక ప్రయాణానికి సంబంధించినది. భూమి నుండి బుధగ్రహానికి ప్రయాణించాలంటే కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధగ్రహం (Mercury Planet) సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి, భూమి నుండి బుధగ్రహానికి ప్రయాణించాలంటే రాకెట్ సూర్యుడు గురుత్వాకర్షణికి లోనై వేగం పుంజుకుం టుంది. మరి బుధగ్రహం దగ్గర పడ్డాక వేగం తగ్గించుకోవాలంటే రాకెట్ బూస్టర్లు వాడాల్సి ఉంటుంది. ఆ గ్రహం మీద దట్టమైన వాతావరణం ఉన్నట్టయితే, వాతావరణం నిరోదకతని వాడుకుని రాకెట్ వేగం తగ్గించడానికి వీలవుతుంది.


కానీ బుధగ్రహాని (Mercury Planet) కి పెద్దగా వాతావరణమే లేదు. కాబట్టి బుధగ్రహాన్ని సమీపించాక రాకెట్ నెమ్మదించి, ఆ గ్రహం మీదకి వాలడానికి అమితమైన ఇంధనం ఖర్చు అవుతుంది. బుధగ్రహానికి వెళ్లడానికి ఖర్చయ్యే రాకెట్ ఇందనంతో ఏకంగా సౌరమండలాన్ని దాటి పోవచ్చని అంచనా. ఏదేమైనా బుధగ్రహం ఇవ్వగల వరరుల ఆకర్షణ తప్ప, నివాసయోగ్యత దృష్ట్యా మనిషి ఎప్పుడూ దాన్ని పెద్దగా లక్ష్యపెట్టలేదు.