Core Web Vitals Assessment: Mamata Banerjee: బీజేపీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఫ్రంట్ ఏర్పాటు చేయ‌నున

Mamata Banerjee: బీజేపీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఫ్రంట్ ఏర్పాటు చేయ‌నున్నారా?

Mamata Banerjee: దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల‌న్నీ ఢిల్లీ బాట ప‌డుతున్నాయి. రానున్నకాలంలో దేశ రాజ‌కీయాలు మారే అవకాశం ఉండ‌టంతో ఆయా రాష్ట్రాలు ఢిల్లీలో రాజ‌కీయ చ‌ర్చ‌లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు.


Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినాయ‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీ ఈ నెలాఖరులో ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేయ‌నుండటం జాతీయ రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత మ‌మ‌త ఈ నెల 25న ఢిల్లీకి బ‌య‌లుదేర‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆమె 4 రోజుల పాటు దేశ రాజ‌ధానిలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ఈ నెల 19 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతుండ‌గా, అదే స‌మ‌యంలో మమ‌త ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేయ‌నుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డంతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో విశ్లేష‌ణ‌లూ మొద‌ల‌య్యాయి.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె ప‌లువురు కీల‌క ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో భేటీ అవుతార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధినాయ‌కురాలు సోనియాగాంధీతో పాటు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), స‌మాజ్ వాదీ పార్టీ, ఆప్‌ల అధినేత‌లు శ‌ర‌ద్ ప‌వార్‌, అఖిలేశ్ యాద‌వ్‌, అర‌వింద్ కేజ్రీవాల్‌ల‌తో ఆమె చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ సాధించిన విజ‌యానికి ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుంచి ప్ర‌శంస‌లందుకున్నంటున్న మ‌మ‌త జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మ‌రోవైపు పార్ల‌మెంటు స‌మావేశాల్లో బిజేపీయేత‌ర పార్టీల స‌హ‌కారంతో అనేక అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు కాంగ్రెస్ స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా కోవిడ్ క‌ట్ట‌డిలో వైఫల్యం, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి అంశాల‌ను లేవ‌నెత్త‌నున్న‌ట్టు తెలుస్తోంది. బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ విజ‌యం కోసం ప‌నిచేసిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. బీజేపీని స‌మిష్టిగా ఎదుర్కొనే వ్యూహంపై ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపినట్టు స‌మాచారం. గ‌త నెల‌లో శ‌ర‌ద్ ప‌వార్‌తోనూ ప్ర‌శాంత్ కిశోర్ 3 సార్లు భేటీ అయ్యారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి బీజేపీకి వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఫ్రంట్‌ల‌ను రూపుదిద్దాల‌ని ప్ర‌తిప‌క్షాలు యోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌మ‌త ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

క‌మ‌ల్‌నాథ్ బేటీకి ప్రాధాన్య‌త‌!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మ‌ద్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్ గురువారం పార్టీ అధినాయ‌కురాలు సోనియాతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తార‌న్న ఊహాగానాల‌కు ఈ భేటీ తావిచ్చింది. గాంధీ కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే క‌మ‌ల్‌నాథ్ ప‌లుమార్లు ఎంపీగా ఎన్నిక‌య్యారు. మ‌రోవైపు పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల అనంత‌రం కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పండింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *