maha shivaratri 2022: శంక‌రా.. నా మ‌దిలోకి అడుగు పెట్టు | మ‌హాశివ‌రాత్రి 2022

maha shivaratri 2022 అర్థం తెలియ‌ని చ‌దువు వ్య‌ర్థం అంటారు పెద్ద‌లు చ‌దువు విష‌యంలోనే కాదు, మ‌నిషి చేసే అన్ని ప‌నుల్లోనూ అర్థం తెలుసుకొని చేయ‌డ‌మ‌న్న‌ది సార్థ‌క‌త చేకూరుస్తుంది. అర్థం తెలియ‌కుండా చేసే పనుల‌న్నీ గుడ్డిగా రాయి విస‌ర‌డం వంటివి. వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌దు. ముఖ్యంగా మాన‌వాళికి ఆరాధ్యులైన దేవ‌త‌ల‌కు చేసే పూజ‌ల విష‌యం లోనూ ఇదే నీతి వ‌ర్తిస్తుంది. అందుకే ఏది చేసినా మ‌న‌సు తో చేయాల‌ని చెప్ప‌డం గ్రంథాల్లో క‌నిపిస్తుంది. అసేతు హిమాచ‌లం ప‌ర్య‌టించి, అధ్వైత త‌త్వాన్ని ప్ర‌బోధించి లోకానికి మ‌హోప‌కారం చేసిన ధ‌న్యులు అది శంక‌రా చార్యులు. ఆయ‌న ప్ర‌ధానంగా చెప్పిన అంశం ఏది చేసినా మ‌న‌సుతో చేయాలే కాని మొక్క‌బడిగా చేయికూడ‌దు. అలా చెప్ప‌డ‌మే గాక‌’, ఆచ‌రించి చూపిన జ‌గ‌ద్గురువు ఆయ‌న‌. ఆచ‌ర‌ణ లేని వేదాంతానికి విలువ లేదు. ఆచ‌ర‌ణే ముఖ్యం. ప్ర‌బోధం ఆ త‌రువాత స్థానంలోనే ఉంటుంది. క‌నుక దేవ‌త‌ల విష‌యంలోనూ మాన‌సిక పూజ ఎంతో శ్రేష్ట‌మైన‌ది. మాన‌సిక పూజ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఈ సందేహం ఎవ‌రికైనా రావ‌చ్చు. అందుకు స‌మాధానంగా శంక‌ర భ‌గ‌వ‌త్పాదులు శివ మాన‌స‌ పూజ ప్ర‌వ‌చించారు. అంటే, శివుణ్ని(maha shivaratri 2022) మాన‌సికంగా పూజించ‌డం.

ఓ ప‌శుప‌తీ! నీ కోసం నా మ‌న‌సులో ర‌త్నాల‌తో పొదిగిన సింహాస‌నం రూపొందించాను. నీ స్నానం కోసం హిమ జ‌లాల‌ను సిద్ధించేశాను. దివ్య వ‌స్త్రాల‌ను సిద్ధంగా ఉంచాను. ఎన్నో ర‌త్నాల‌తో హారాలు చేశాను. క‌స్తూరి వంటి ప‌రిమ‌ళ ద్ర‌వ్యాల‌ను సేక‌రించాను. గంధంతో పాటు సువాస‌న గ‌ల పూల‌ను, బిల్వ ద‌ళాల‌ను తెచ్చాను. ప‌రిమ‌ళ‌భ‌రిత‌మైన దూపాన్ని వెలిగించాను. దీపం వెలిగించాను. క‌నుక నీవు నా హృద‌యంలోకి రా! ఓ ప్ర‌భూ! నీ కోసం మంచి నేతితో చేసిన పాయ‌సాన్ని బంగారు పాత్ర‌లో పోసి నా ఎద‌లోనే ఉంచాను. పంచ‌భ‌క్యాలు, చిక్క‌ని పాలు, గ‌డ్డ పెరుగు.. అన్నింటినీ సిద్ధించేశాను. రుచి గ‌ల శాఖాల‌ను వండించాను. నిర్మ‌ల జ‌లాన్ని తెచ్చాను. నా మ‌దిలోకి వ‌చ్చి స్వీక‌రించు స్వామి.! నీవు భోజ‌నం చేశాక‌, ఛ‌త్ర చామ‌రాల‌తో సేద‌తీరుస్తాను. వ‌ణ‌, మృదంగాది వాద్యాల‌తో సంగీత సేవ చేస్తాను. సాష్టాంగ ప్ర‌ణామం చేస్తాను. ఎన్నో విధాలుగా నిన్ను స్తుతిస్తాను. శంక‌రా! నా మ‌దిలోకి అడుగు పెట్టు!(maha shivaratri 2022)

ఓ శంభూ! నా ఆత్మ నీవు. నా శ‌రీర‌మే దేవాల‌యం. నా న‌డ‌క‌లే నీకు చేసే ప్ర‌ద‌క్షిణ‌లు. నేను ప‌లికే ప్ర‌తీ మాట నీ స్తోత్ర‌మే. నేను చేసే ప‌నుల‌న్నీ నీ ఆరాధ‌న‌లే. ఓ మ‌హాదేవా! చెవులు, క‌ళ్లు, మ‌న‌సు తెలిసీ తెలియ‌క దోషాలు చేసి ఉంటాయి. వాత్సల్యంతో మ‌న్నించి, న‌న్ను కృతార్థుణ్ని చేయ‌మ‌ని వేడుకుంటున్నాను. నీవే నాకు దిక్కు. ఓ ప‌ర‌మేశ్వ‌రా! క‌రుణానిధీ! నీవే నాకు శ‌ర‌ణ్యం. మాన‌స పూజ ఇలా ఉండాల‌ని శంక‌రులు ప్ర‌బోధించారు. ఇందులో ప్ర‌ధానంగా మాన‌స క‌ల్ప‌న‌, ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌, మాన‌సిక అధ్వైత్యం, అప‌రాధ క్ష‌మార్ప‌ణ అనే విష‌యాలున్నాయి. ఇవి మ‌నిషిలోని ప‌రివ‌ర్త‌న‌కు ఉదాహ‌ర‌ణ‌లు. దోషాలు చేయ‌డం మాన‌వ స్వ‌భావ‌మైతే వాటిని క్ష‌మించ‌డం దైవ స్వ‌భావం. మ‌నిషికి త‌న త‌ప్పులు తెలుసుకోవాల‌నే స్పృహ ఉండాలి. వాటిని స‌రిదిద్దుకోవాల‌నే త‌పన ఉండాలి. అది లేనప్పుడు మ‌నిషి మ‌నిషి కాలేడు. పూజ‌, ప‌రోక్షంగా తెలియ‌జేసే స‌త్యం ఇదే. ఈ స‌త్యాన్ని మ‌న‌సుతో తెలుసుకోవాల‌నే ల‌క్ష్యంతోనే మాన‌సిక పూజ‌కు పెద్ద‌లు ప్రాధాన్యం ఇచ్చారు.

మ‌న‌సుతో చేసేదే పూజ‌. పూజాద్ర‌వ్యాల వంటివి కేవ‌లం మ‌నోనిశ్చ‌ల‌త‌కు తోడ్ప‌డే సాధ‌నాలు. ఆ ద్ర‌వ్యాలే ముఖ్యం అనుకుంటే, మ‌న‌సు ముఖ్యం కాకుండా పోతుంది. అందువ‌ల్ల మ‌న‌సునే ప్ర‌ధానంగా చేసుకుని పూజ నిర్వ‌ర్తించాల‌ని చెబుతారు. భ‌క్తి లేని పూజ ప‌త్రి చేటు అని పెద్ద‌ల‌న్నారు. దీన్ని మ‌నిషి స‌ర్వ‌దా గుర్తుంచుకోవాలి.

Share link

Leave a Comment