Madhira Flyover Bridge | ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న బడ్డీ కొట్లను, మెయిన్ రోడ్డులోని అడ్డంగా ఉన్న బడ్డీ కొట్లను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం ట్రైనీ కలెక్టర్ రాహుల్ మధిర పట్టణంలో పర్యటించారు. ఏఏ ప్రాంతాల్లో బడ్డీ కొట్లు ఉన్నాయి.. అవి ట్రాఫిక్‌కి ఇబ్బందిగా ఉన్నాయా? లేవా? అని (Madhira Flyover Bridge)పరిశీలించారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ గౌతమ్ మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు బడ్డీ కొట్లు మూసి వేసి కనిపించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రమాదేవితో మధిరలో బడ్డీకొట్లు పెట్టి మూసివేస్తే అవార్డులు వస్తాయా? అంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదే విధంగా బోనకల్ వెళ్తూ బ్రిడ్జి కింద ఉన్న బడ్డీకొట్లు తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
మధిర-బోనకల్లు ప్రాంతాల్లో అనేక బడ్డీ దుకాణాలు చిరు వ్యాపారులు చేతిలో లేకుండా బడా వ్యాపారుల చేతిలో ఉన్నాయని, వాటిని అద్దెకి ఇస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ట్రైనీ కలెక్టర్ సూచించినట్టు తెలిసింది. దీంతో ట్రైనీ కలెక్టర్ రాహుల్ మధిరలో పర్యటించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందించనున్నారు. ఆయన వెంట తహశీల్దార్ రాజేష్, కమిషనర్ రమాదేవి ఉన్నారు.