khammam News In Telugu I ఖమ్మం పోలీసుల చొరవ! కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు!
ఖమ్మం: నగరంలోని విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు మరోసారి వారి నిజాయితీని, నిబద్ధతను చాటుకున్నారు. నిరంతరం ప్రజలకు అతిచేరువలో ఉంటూ వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ ఫ్రెండ్లీ పోలీసులుగా నిలుస్తున్నారు. విషయానికి వస్తే ఖమ్మం నగరంలోని బ్యాగును పోగొట్టుకున్న బాధితుడికి ఫోన్ చేసి మరీ బ్యాగును తిరిగి అప్పగించారు త్రీటౌన్ పోలీసు కానిస్టేబుళ్లు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం రాజోలు గ్రామానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ తోట శ్రీనాథ్ వ్యక్తిగత పనులపై ఖమ్మం వచ్చి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో నయాబజార్ సెంటర్లో తన బ్యాగ్‌ను జారవిడుకున్నారు. బ్యాగ్ మర్చిపోయి వెళ్లడంతో ఆ సమీపంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న బ్లూ క్లోట్స్ కానిస్టేబుళ్లు సీహెచ్ వెంకటేశ్వరరావు, బోనగిరి నాగేశ్వరరావులు గమనించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న ఆధారాలతో బాధితుడికి సమాచారం అందించి బ్యాగ్ అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీనాథ్ పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలపారు.
ఈ సందర్భంగా త్రీటౌన్ సిఐ శ్రీధర్ సిబ్బందిని అభినందించారు. ఇటీవల ఇద్దరు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు ఖమ్మం పోలీసులు. ఓ తల్లి ఇద్దరు పిల్లలను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతే, చేరదీసి వారిని తండ్రి వద్దకు చేర్చారు. ఆ తల్లి తన సుఖం కోసం ఇద్దరు పిల్లలను వదిలించుకుంది. అనాథల్లా రోడ్డు మీద వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ పిల్లలు అనాథల్లా బస్టాండ్ లో ఉంటే వారిని కన్నబిడ్డల్లా సాకారు ఖమ్మం పోలీసులు.
ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో ఇద్దరు పిల్లలు అమ్మా..అమ్మా అంటూ ఏడుస్తున్నారు. ఇదే సమయంలో ఖమ్మం టూ టౌన్ సీఐ తుమ్మ గోపి, మహిళ కానిస్టేబుల్ రేణుక ఇద్దరు పిల్లలను చేరదీసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి కొత్త బట్టలు కొని ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం కు చెందిన తండ్రి జల్లి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సమక్షంలో తండ్రి జల్లి వెంకటేశ్వర్లుకు చిన్నారులను అప్పగించారు. ఆ ఇద్దరు చిన్నారుల తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని విచారించగా విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలో అతడితో వెళ్లిపోవడానికి ముందు తన ఇద్దరు పిల్లలను ఖమ్మం బస్టాండులో వదిలి వెళ్లిపోయింది. వాళ్లు ఏడుస్తూ ఉండగా సీఐ గోపి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు వారు ఉండేందుకు వసతి కల్పించారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారి ద్వారా తండ్రికి అప్పగించారు. తల్లి ఇలా చేయడం ఇది మూడోసారి అని భర్త ఆవేదనతో తెలిపాడు. మొత్తంగా ఖమ్మం పోలీసు వారు తీసుకుంటున్న చొరవ, ప్రజలకు చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
![]() |
khammam-2 town police station |